logo

పేట అభివృద్ధికి నిధుల వరద

నూతన జిల్లాగా ఏర్పడిన నారాయణపేటకు నిధుల వరద పారుతుందని, అభివృద్ధిలో ఇతర జిల్లాలతో పోటీ పడుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 25 Jan 2023 05:55 IST

మంత్రి కేటీఆర్‌

నారాయణపేట, న్యూస్‌టుడే : నూతన జిల్లాగా ఏర్పడిన నారాయణపేటకు నిధుల వరద పారుతుందని, అభివృద్ధిలో ఇతర జిల్లాలతో పోటీ పడుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పేటలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు మంత్రులు మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, ఎంపీˆ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. పేటలో రూ.8 కోట్లతో చేపట్టిన సమీకృత వాణిజ్య సముదాయం చూసి సహచర మంత్రులు అసూయపడేలా జిల్లా అభివృద్ధి చెందుతోందన్నారు. కొండారెడ్డిపల్లి చెరువును రూ.4కోట్లతో సుందరంగా తీర్చిదిద్దామన్నారు. రూ.80 లక్షలతో సీˆనియర్‌ సిటిజన్‌ పార్కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పట్టుబట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయించుకున్నట్లు తెలిపారు. ధన్వాడలో డిగ్రీ కళాశాల, నారాయణపేటకు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరైందన్నారు. మరికల్‌లో రూ.7 కోట్లతో సమీకృత మండల సముదాయం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రామాలయం నిర్మాణానికి రూ.10కోట్లు, ఈద్గా నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేశామని త్వరలో పనులు చేపడతారన్నారు. పనిమంతుడు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు.

ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నిజాయితీ నిరూపించుకుని సమావేశం పెట్టుకోవాలని కొందరు అంటున్నారని.. ప్రజాదరణ లేని వాళ్ల వద్ద నా నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చుట్టూ  గుట్టల మధ్యలో చెరువు చూడముచ్చటగా ఉందని దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామన్నారు. కొందరికి ఇవేమీ కనిపించడంలేదని.. కంటివెలుగులో పరీక్షలు చేయించి కళ్లద్దాలు అందజేసి అభివృద్ధి చూపిస్తామన్నారు. సిరిసిల్లలో కూడా లేని విధంగా అన్ని హంగులతో కూరగాయల, మాంసాహార మార్కెట్ను ప్రారంభించుకున్నామన్నారు. కోయిలకొండలో రామప్పకొండ రామాలయానికి రూ.10కోట్లు అడిగితే రాష్ట్రమంత్రి వెంటనే మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ ప్రజలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ నుంచి తీసుకున్న స్థలానికి బదులుగా మరికల్‌లో అంతే స్థలం కేటాయించామన్నారు. రూ.11 కోట్లతో స్టేడియం గ్రౌండ్‌ నిర్మిస్తున్నామన్నారు. అనంతరం మహిళా సమాఖ్యకు రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు... :   ఉదయం 11.06 గంటలకు చేరుకున్న మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ తొలుత భారాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి రాకకోసం గంటపాటు అక్కడే వేచి ఉన్నారు. అనంతరం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి సింగారం చౌరస్తాలో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, పేట గ్రామీణ, ధన్వాడ పోలీస్‌స్టేషన్‌, తహసీల్దార్‌ భవనం, అప్పక్‌పల్లి, కోయిలకొండ డబుల్‌రోడ్డు, సేవాలాల్‌ భవనం, ధోబీఘాట్, మరికల్‌ మండల కాంప్లెక్స్‌ మొత్తం తొమ్మిది పనులకు ఒకేచోట శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి పేట సమీకృత మార్కెట్, సఖీ కేంద్రం, మినీ ట్యాంక్‌బండ్‌, సీనియర్‌ సిటిజన్‌ పార్కులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీహర్ష, పేట, గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్‌లు వనజ, సరిత, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అనసూయ, వైస్‌ఛైర్మన్‌ హరినారాయణ్‌భట్టడ్‌, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని