logo

రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యం

రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి మైదానంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వహించిన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Published : 28 Apr 2024 04:34 IST

సంఘీభావం ప్రకటిస్తున్న తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, యోగేంద్ర యాదవ్‌ తదితరులు

పాలమూరు, న్యూస్‌టుడే : రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి మైదానంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వహించిన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని భాజపా రాజ్యాంగాన్ని మారుస్తామని స్పస్టంగా చెప్పిందన్నారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ, దాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్లిష్ట సమయంలో మౌనంగా ఉంటే ప్రమాదంలో పడినట్లేనని, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు ద్వారా భాజపాకు బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీతో రూ.58లక్షల కోట్ల ఆదాయం ఖజానాకు వస్తున్నా 6.5 శాతం మాత్రమే పేదలకు అందుతోందన్నారు. నిరుద్యోగిత శాతం గణనీయంగా పెరిగిందన్నారు. భాజపా కార్పొరేట్‌ శక్తులకు వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. అసమానతలను నిర్మూలించడానికి ఇండియా కూటమి పేదల పక్షాన నిలబడిందన్నారు. స్వరాజ్‌ అభియాన్‌ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు ఆచార్య యోగేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ రాజ్యాంగం వ్యక్తి స్వేచ్ఛను కాపాడే పవిత్ర గ్రంథమన్నారు. దేశాభివృద్ధికి బ్లూ ఫ్రింట్‌ మాదిరిగా రాజ్యాంగం పని చేస్తుందన్నారు. దేశంలో అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా రాజ్యాంగంలో పొందుపర్చారని పేర్కొన్నారు. భాజపా నాయకులు మాత్రం రాజ్యాంగాన్ని మార్చుతామని ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ డా.బీఆర్‌ అంబేడ్కర్‌ అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని వివిధ దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని రాస్తే పాలకులు సమూలంగా మార్చుతామని చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి సామాజిక హోదాతో పని లేకుండా సమాన అవకాశాలు పొందడానికి, సమానంగా ఎదగడానికి కావాల్సిన రాజ్యాంగం హక్కులు కల్పించిందని తెలిపారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని చూసే భాజపాకు తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆచార్య ఖాసీం, దాసురాం నాయక్‌, ఐవీ ఆశ్వీరాదం, విల్సన్‌, అమీర్‌ అలీ ఖాన్‌, ఖాలిక్‌ సాబ్రి సాహెబ్‌, హఫీజ్‌, కాచం సత్యనారాయణగుప్త, ఖలీల్‌, హనీఫ్‌ మహమ్మద్‌, వన్నాడ అంజన్న, ప్రసాద్‌, రవినాయక్‌, గట్టన్న ముదిరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు