logo

పొరపాటుతో స్వతంత్రం.. తారుమారు

చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్‌కర్నూల్‌ ఎంపీ స్థానానికి కేఎస్‌ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది.

Updated : 11 May 2024 05:48 IST

 2004లో మారిన సమీకరణలు

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్‌కర్నూల్‌ ఎంపీ స్థానానికి కేఎస్‌ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది. దీంతో పరిస్థితులు అనుకూలించకుండా పోయాయి. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెరాస పొత్తులో భాగంగా కలిసి పోటీ చేశాయి. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానాన్ని తెరాసకు కేటాయించారు. తెరాస అభ్యర్థిగా కేఎస్‌ రత్నంను కేటాయించారు. బీఫాంను తీసుకొచ్చిన కేఎస్‌ రత్నం ఎవరైనా ఎత్తుకెళ్తారనే భయంతో తన కూతురి బ్యాగ్‌లో ఉంచారు. ఈ క్రమంలోనే బీఫాం జత చేయకుండా ఒకటి పార్టీ తరఫున, మరోటి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేశాడు. బీఫాం జత చేయటం మరిచిపోయినట్లుగా గుర్తించి తర్వాత బీఫాంను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వడానికి వెళ్లాడు. అప్పటికే సమయం దాటిపోయిందని తీసుకోలేదు. పార్టీ తరఫున వేసిన నామినేషన్‌ను తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను ఆమోదించారు. తప్పని పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగానే రంగంలోనే నిలువాల్సి వచ్చింది. టెంకాయ గుర్తుతో ప్రచారం చేశారు. అదే గుర్తుకు ఓటు వేయాలని కేసీఆర్‌, తెరాస నాయకులు అప్పట్లో ప్రచారం చేశారు. కేఎస్‌ రత్నంకు 3,05,396 ఓట్లు వచ్చాయి. తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మంద జగన్నాథం 99,650 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మరో స్వతంత్ర అభ్యర్థికి అధికంగా ఓట్లు..: 2004లో ఎన్నికల్లోనే మరో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన భగవంతుకు  ఊహించకుండా భారీగా ఓట్లు వచ్చాయి. భగవంతు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న భగవంతుకు విమానం గుర్తు కేటాయించారు. అదే సమయంలో కొల్లాపూర్‌, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థులను అక్కడ నిలుపలేదు. కాంగ్రెస్‌ టిక్కెట్లు దక్కకపోవడంతో కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు, పరిగిలో హరీశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. వారిద్దరికి విమానం గుర్తు వచ్చింది. అసెంబ్లీకి ఒక గుర్తుకు, పార్లమెంటుకు మరో గుర్తుకు వేయాలని చెబితే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీకి, పార్లమెంటుకు విమానం గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేసుకున్నారు. దీంతో లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన భగవంతుకు 1,19,813 ఓట్లు వచ్చాయి. ఫలితాల తర్వాత స్వతంత్ర అభ్యర్థికి భారీగా ఓట్లు వచ్చాయని ఆశ్చర్యం వ్యక్తమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని