logo

భారాస హయాంలోనే అభివృద్ధి

50 ఏళ్ల కాంగ్రెస్‌, తెదేపా పాలనలో పాలమూరుకు ఏమైనా న్యాయం జరిగిందా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట’ బస్సుయాత్ర శనివారం నాగర్‌కర్నూల్‌లో కొనసాగింది.

Published : 28 Apr 2024 05:09 IST

కాంగ్రెస్‌, తెదేపా పాలనలో ఏం చేశారు
బస్సుయాత్రలో గులాబీ దళపతి కేసీఆర్‌

మాట్లాడుతున్న కేసీఆర్‌, చిత్రంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, విజయుడు, నిరంజన్‌రెడ్డి, నాగం, శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, మహబూబ్‌నగర్‌- నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: 50 ఏళ్ల కాంగ్రెస్‌, తెదేపా పాలనలో పాలమూరుకు ఏమైనా న్యాయం జరిగిందా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట’ బస్సుయాత్ర శనివారం నాగర్‌కర్నూల్‌లో కొనసాగింది. పట్టణంలో రోడ్డుషో నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన కూడలి సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక్క వైద్య కళాశాలైనా వచ్చిందా అన్ని ప్రశ్నించారు. భారాస ప్రభుత్వ హయాంలో పాలమూరుకు ఐదు వైద్య కళాశాలలు వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు. నాగర్‌కర్నూల్‌కు వస్తుంటే తమ ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాలను చూసుకుంటూ వచ్చానన్నారు. తాను మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఈ గౌరవం ఎప్పుడూ కూడా పాలమూరుకే దక్కుతుందన్నారు. కులమతాలకతీతంగా పదేళ్లు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత హైదరాబాద్‌ నుంచి గద్వాలకు 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. చాలా ఆనంద పడ్డా. ఎక్కడికక్కడ వరి కోతలు, యంత్రాలు, ధాన్యం రాశులు కనిపించాయన్నారు. అలంపూర్‌ బిడ్డ మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకొచ్చారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవీణ్‌కుమార్‌ను పిలిచి గురుకులాలను బాగా నడుపుతున్నారు. ఎంత బడ్జెటు కావాలి? ఇంకా బాగు చేయండి అని చెప్పా. తెలంగాణ గురుకులాలు అంటే ఇంటర్నేషనల్‌ పాఠశాలలకు సమానం. గురుకులాల నుంచి ఇంజినీర్లు, వైద్యులు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఏఎస్‌లు, పైలెట్లు, ఎవరెస్టు శిఖరాలు ఎక్కిన బిడ్డలను తయారు చేసిన ఘనత ప్రవీణ్‌కుమార్‌ది. చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. అలాంటి వ్యక్తి గెలిస్తే విచక్షణ ఉంటుంది. చదువుకున్న వాళ్లు రాజకీయాలకు వచ్చి సేవ చేస్తామంటే వారిని గెలిపించుకోవాలన్నారు. ఆయన  ఆయన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నాగర్‌కర్నూల్‌కు వస్తే 1500 మంది కూడా జనం రాలేదన్నారు. చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని నవోదయ విద్యాలయాలు ఇవ్వాలి. రాష్ట్రంలో ఒక్కటి కూడా మోదీ ఇవ్వలేదు. ఒక్క మెడికల్‌ కళాశాల ఇవ్వలేదు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అడిగాం. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.25వేల కోట్లు కావాలని అడిగాం. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇక్కడికొచ్చిన వారందరూ మీ గ్రామాల్లోకి వెళ్లి వీటిపై చర్చ పెట్టండి అన్నారు. మన కోసం కష్టపడే భారాసకు ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు.

నాగర్‌కర్నూల్‌: కేసీఆర్‌ను చూసి నినాదాలు చేస్తున్న జనం.. 

ప్రపంచపటంలో నిలబెడతా: తనను గెలిపించి పార్లమెంట్‌కు పంపితే నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో నిలబెడుతానని భారాస అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శనివారం రాత్రి నాగర్‌కర్నూల్‌ పట్టణంలో నిర్వహించిన కేసీఆర్‌ రోడ్డుషోలో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడారు. కేసీఆర్‌ నాయకత్వంలో గురుకులాలను ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులు వృద్ధిలోకి వచ్చేలా తోడ్పడ్డారన్నారు. గురుకులాల మాదిరిగానే నాగర్‌కర్నూల్‌ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఐపీఎస్‌గా పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ పదవిని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, విజేయుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వలబాలరాజు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు