logo

అలంపూర్‌ బేనీషా.. ప్రియం

ప్రఖ్యాతి గాంచిన అలంపూర్‌ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది.

Published : 29 Apr 2024 05:08 IST

తోటల్లో కాత అంతంత మాత్రమే

ర్యాలంపాడులో కాతలేని అలంపూర్‌ బేనీషా మామిడి తోట

అలంపూర్‌, న్యూస్‌టుడే: ప్రఖ్యాతి గాంచిన అలంపూర్‌ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది.

ఐదు వేలకుపైగా ఎకరాల్లో..: గద్వాల జిల్లాలో 5,400 ఎకరాల్లో ఈ రకం మామిడి తోటలున్నాయి. అత్యధికంగా గట్టు మండలంలో రెండు వేల ఎకరాల వరకు సాగవుతోంది. అత్యల్పంగా అలంపూర్‌ మండలంలో 500 ఎకరాల వరకు సాగులో ఉంది. ఈ రకానికి చెందినవి పూర్తిగా మాగాల్సిన అవసరం కూడా ఉండదు. పక్వానికి వచ్చి పచ్చ రంగులోకి మారితే చాలు తీయగా ఉంటుంది. లోపలి భాగంలో సైతం పచ్చ రంగుతోనే కనిపిస్తుంది. టెంక కూడా  చిన్న పరిమాణంలో ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉండటంతో ఈ పండ్లకు డిమాండు ఉండేది. విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంటుంది. గతేడాది ఎకరాకు నాలుగు టన్నుల మేరకు దిగుబడి వచ్చిందని, ఈ ఏడాది రెండు టన్నులు రావడం కూడా కష్టమేనని రైతులు అంటున్నారు. తోటలకు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టామని, పురుగుల మందు పిచికారీ చేసినా, ఎరువులు పెట్టినా దిగుబడి కానరావడం లేదని వారంటున్నారు. అక్టోబరులో రాత్రి సమయంలో 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే చెట్లకు మంచిగా పూత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఈ ఏడాది అనుకూల ఉష్ణోగ్రతలు లేకపోవడంతో పూత తగ్గిపోయింది. ప్రస్తుతం రాత్రి సమయంలో చల్లగా ఉండటంతో ఈ మధ్య కాలంలో ఆలస్యంగా కొంత పూత వచ్చింది.

ప్రయోజనం లేదు: పది ఎకరాల్లో ఈ తరహా మామిడి సాగుచేస్తున్నాను. రూ.రెండు లక్షల వరకు మందుల పిచికారీకి వెచ్చించాను. అయినా ఆశించిన మేర దిగుబడి రాలేదు. పెట్టిన పెట్టుబడి, అంతర్‌ సేద్యం, కూలీలు ఇలా చాలా మేరకు పెట్టుబడులు అయినా ప్రయోజనం కన్పించలేదు. ఈ ఏడాది పూత సరిగా రాకపోవడంతో కౌలుకు తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వయంగా సాగు చేసుకున్నాను.

గోవిందు, రైతు, గొందిమళ్ల

వాతావరణంలో మార్పుల వల్లనే..: వాతావరణంలో మార్పుల వల్ల ఈ ఏడాది మామిడి తోటల్లో దిగుబడి రాలేదు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, సరైన వర్షాలు లేకపోవడంతో పూత సరిగా రాలేదు. ఈ నేపథ్యంలో దిగుబడులు బాగా తగ్గిపోయే అవకాశముంది.

రాజశేఖర్‌, హార్టికల్చర్‌ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని