logo

దుందుభి.. దుఃఖిస్తోంది!

దుందుభి వాగులో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఇసుక మాఫియా వాగును ఖాళీ చేస్తుండటంతో మండలంలోని కొత్తూర్‌, వెలుగొముల, రెడ్డిగూడ, చిల్వేరు, అయ్యవారిపల్లి, కొత్తపల్లి, వాడ్యాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 29 Apr 2024 06:30 IST

వాగులో లోతుగా తీసిన ఇసుక తవ్వకాలు

జడ్చర్ల న్యూటౌన్‌, న్యూస్‌టుడే : దుందుభి వాగులో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఇసుక మాఫియా వాగును ఖాళీ చేస్తుండటంతో మండలంలోని కొత్తూర్‌, వెలుగొముల, రెడ్డిగూడ, చిల్వేరు, అయ్యవారిపల్లి, కొత్తపల్లి, వాడ్యాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసినా పచ్చని పంటభూములు... నీటిజలతో కళకళలాడే దుందుభి పరిసర ప్రాంతాలు నేడు రాళ్లుతేలి బోసిపోతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. 30ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం మిడ్జిల్‌ మండలాన్ని డార్క్‌ ఏరియాగా ప్రకటించి బోరు, బావులు తవ్వడం, వాగుల్లో ఇసుక తీతను పూర్తిగా నిషేధించింది. అయినా ఆచరణకు నోచుకోక పోగా చట్టాలను అక్రమార్కులు, ఉల్లంఘించి దందాలను కొనసాగిస్తున్నారు.

రాత్రివేళల్లో దర్జాగా తరలింపు..: మండల పరిధిలోని వాడ్యాల, మున్ననూరు, మిడ్జిల్‌, చిల్వేరు, రెడ్డిగూడ, కొత్తపల్లి శివారు దుందుభి వాగు నుంచి రాత్రివేళల్లో ట్రాక్టర్లతో తరలిస్తున్నా అడ్డుకట్ట వేయడంలో జిల్లా మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు శాఖలు దృష్టి సారించడం లేదు. ట్రిప్పుకు రూ.3500- రూ.4వేల వరకు విక్రయిస్తున్నారు. నిత్యం ట్రాక్టర్లు అనధికారికంగా ఇసుక తరలిస్తున్నా అడ్డుకునే నాథుడు కనిపించక పోవడం విడ్డూరం. ఫిర్యాదు చేసినా క్షణాల్లో సమాచారాన్ని మాఫియాకు అందిస్తుండటం అనుమానాలకు దారితీస్తోంది.

అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం..

అనుమతి లేకుండా రాత్రిళ్లు ఇసుక అక్రమంగా తరలించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు అతిక్రమిస్తే కేసుల నమోదుతో పాటు వాహనాలు జప్తు చేస్తాం. రాత్రిళ్లు రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో గస్తీ నిర్వహిస్తున్నాం. అక్రమార్కులను ఉపేక్షించేది లేదు.

రాజునాయక్‌, తహసీల్దార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని