Kajal Aggarwal: అందుకే ‘జనతా గ్యారేజ్‌’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్‌

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌  ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.

Updated : 15 May 2024 11:09 IST

చందమామతో దగ్గరై.. మిత్రవిందగా మాయ చేసి అభిమానులను సొంతం చేసుకున్నారు హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌. సరైన పాత్రలను ఎంచుకొని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగి సక్సెస్‌ను అందుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోన్న క్యూట్‌ కాజల్ (Kajal) తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. తన సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఆమెతో పాటు దర్శకుడు శశికిరణ్ తిక్క కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. 

కాజల్‌ (Kajal Aggarwal) అనే పేరు ఎవరు పెట్టారు?

కాజల్‌: ఈ పేరు నాకు మా తాతయ్య పెట్టారు. నేను ముంబయిలో పుట్టాను. తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతున్నా. నాకు సెకండ్‌ లాంగ్వేజ్‌లా మారిపోయింది. 

మీ మొదటి సినిమా ఏ భాషలో చేశారు?

కాజల్‌: నా తొలి చిత్రం తెలుగులోనే విడుదలైంది. మొదట హిందీ చిత్రానికి సైన్‌ చేశాను. కానీ, అది ప్రారంభమయ్యేకంటే ముందే.. తెలుగులో ‘లక్ష్మీ కల్యాణం’ విడుదలైంది. స్కూల్‌లో చదువుకునే సమయంలో ఒక హిందీ చిత్రంలో చిన్న పాత్ర చేశానంతే. హీరోయిన్‌గా మాత్రం ‘లక్ష్మీ కల్యాణం’ మొదటిది.

‘లక్ష్మీ కల్యాణం’ అవకాశం ఎలా వచ్చింది?

కాజల్‌: దర్శకుడు తేజ నా ఫొటోస్‌ చూసి ఆడిషన్స్‌కు పిలిచారు. ‘ఒకసారి ఏడవండి’ అన్నారు. నా జీవితంలో నేను అప్పటివరకు ఎప్పుడూ ఏడవలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏడుపు రాలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. నా చిన్నప్పుడు స్కూల్లో జరిగిన బాధాకరమైన విషయాలు గుర్తు చేశారు. అయినా కన్నీళ్లు రాలేదు. అప్పుడు మా నాన్న ఏదో చెప్పారు. దానికి ఏడుపు వచ్చింది. ఆ కన్నీళ్లతో తేజ చెప్పమన్నట్లు చెప్పాను. సెలెక్ట్‌ చేశారు.

ఆ సినిమా షూటింగ్‌ సమయంలో తేజ మీపై ఎప్పుడైనా సీరియస్‌ అయ్యారా?

కాజల్‌: దర్శకుడు తేజ ప్రతీ సన్నివేశాన్ని జాగ్రత్తగా తీస్తారు. నాపై సీరియస్‌ కాలేదు. కాకపోతే ఆయన సన్నివేశం బాగా రాకపోతే ఆయన మాటతీరు తిట్టినట్లు ఉంటుంది. నేను మొదట్లోనే ఆ విషయాన్ని అర్థం చేసుకున్నా. సెట్‌లో అరిచినప్పుడు నేనూ తిరిగి అరిచేదాన్ని. కాసేపు మాట్లాడుకునేవాళ్లం కాదు. మళ్లీ కొంతసేపటికే అంతా సెట్‌ అయ్యేది. ఆయన దర్శకత్వంలో నేను మూడు సినిమాల్లో (లక్ష్మీ కల్యాణం, నేనేరాజు నేనే మంత్రి, సీత) నటించా.

‘సత్యభామ’ గురించి చెప్పండి?

కాజల్‌: నేను ఇందులో పోలీస్‌ పాత్రలో కనిపించనున్నా. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శశి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. నాకు ఇలాంటి చిత్రాలంటే ఆసక్తి ఎక్కువ. ఈ కథ చెప్పగానే నచ్చింది. వెంటనే ఓకే చేశా. 

మీది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చినదా?

కాజల్‌: ప్రేమించుకున్నాం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మొదటిసారి గౌతమ్‌ కిచ్లూని స్నేహితుల పెళ్లిలో కలిశాను. 10 ఏళ్లు ఫ్రెండ్స్‌గా ఉన్నాం. కరోనా టైమ్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. 

తెలుగింటి సంప్రదాయాలంటే మీకు ఇష్టమా?

కాజల్‌: చాలా ఇష్టం. అందుకే నా పెళ్లిలో కొన్ని క్రతువులు మన సంప్రదాయానికి సంబంధించినవి కూడా ఉండేలా చూసుకున్నా. నాకు తెలియకుండానే తెలుగులో ఎన్నో ఫేక్‌ పెళ్లిళ్లు చేసేశారు. అందుకే నిజం పెళ్లి కూడా అదే సంప్రదాయంలో చేసుకున్నా.

ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో చేశారు?

కాజల్‌: మూడు భాషల్లో నటించాను. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపుగా 60కు పైగా సినిమాలు చేశా. ఎంతోమంది గొప్ప దర్శకులతో పని చేశాను. రాజమౌళి, కృష్ణవంశీ, సుకుమార్‌, తేజ.. ఇప్పుడు శంకర్‌ గారి దర్శకత్వంలో వర్క్‌ చేస్తున్నాను. వాళ్లలో ఎవరి దర్శకత్వం ఇష్టమంటే చెప్పలేను. ఇండస్ట్రీలో రెండు జనరేషన్స్‌తో కలిసి చేసిన హీరోయిన్‌ని నేనే. చిరంజీవి-రామ్‌చరణ్‌తో చేశా. నాగచైతన్య సరసన చేశాను. నాగార్జున సినిమాలో అవకాశం వచ్చింది. కానీ, ఆ సమయంలో నేను ప్రెగ్నెంట్‌ కావడంతో చేయలేకపోయాను.

మీ స్కూల్ నుంచి రోజూ ఇంటికి ఫోన్‌లు వచ్చేవట ఎందుకు?

కాజల్‌: నేను చదువుకునే సమయంలో చాలా కొంటె పనులు చేసేదాన్ని. మా టీచర్స్ వాటి గురించి మా అమ్మతో చెప్పేవాళ్లు. ఇంటి దగ్గర కూడా నేను, మా చెల్లి బాగా అల్లరి చేసేవాళ్లం. పక్క బిల్డింగ్‌లో వాళ్ల మీద వాటర్ బెలూన్స్‌ వేసేవాళ్లం.

నిషా అగర్వాల్‌తో మీ అనుబంధం ఎలా ఉంటుంది?

కాజల్‌: మా ఇద్దరిలో నేను ఎక్కువ గోల చేస్తాను. తను సైలెంట్‌ కిల్లర్‌. ప్రస్తుతం తను ముంబయిలో ఉంది. నాకంటే ముందే పెళ్లి చేసుకుంది.

ఇండస్ట్రీకి రావడానికి స్ఫూర్తి ఎవరు?

కాజల్‌: మాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. నేను యాక్టర్‌ కావాలని ముందే దేవుడు నిర్ణయించాడేమో. అన్నీ దానికి అనుకూలంగానే జరిగాయి. 

‘మగధీర’ చేసే సమయంలో ఎలా అనిపించింది?

కాజల్‌: ఆ సినిమా చేసే సమయంలో అంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు. పెద్ద డైరెక్టర్‌, స్టార్‌ హీరోతో వర్క్‌ చేస్తున్నా అనే భావనలో ఉన్నానంతే. ఆ సినిమా తర్వాత నాకు స్టార్‌డమ్‌ వచ్చింది. కథలను ఎంపిక చేసుకునే విధానం మారింది. 

కాలేజీ రోజుల్లో ఎంతమంది ప్రపోజ్‌ చేశారు?

కాజల్‌: చాలామంది ప్రపోజ్‌ చేశారు. వందకు పైగా లెటర్స్ వచ్చాయి. ఒక అబ్బాయి రాసిన లవ్‌ లెటర్‌ నాకు చాలా నచ్చింది. నా గురించి కవిత రాశాడు. అది మా అమ్మకు నచ్చి దాచిపెట్టుకుంది. 

‘సత్యభామ’ కథ వినగానే ఏమనిపించింది?

కాజల్‌: నేను ఇప్పటివరకు అన్ని జోనర్లో సినిమాలు చేశాను. కుటుంబనేపథ్యం ఉన్న సినిమాలు, కమర్షియల్‌, రొమాంటిక్.. ఇలాంటి ఎన్నో చిత్రాల్లో నటించా. కానీ, మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమా చేయాలనిపించింది. అందుకే దీనికి ఓకే చెప్పా. దీనికోసం ఎంతో కష్టపడ్డా. స్టంట్స్ చేయడం అంత సులభం కాదు.

బాగా నిరాశపరిచిన సినిమా ఏదైనా ఉందా?

కాజల్‌: ఇది కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్న సినిమాలు కొన్ని అసలు ప్రేక్షకాదరణే నోచుకోలేదు. అప్పుడు ఒత్తిడికి గురయ్యాను. హిందీలో నేను ‘లఫ్జోన్‌ కీ కహానీ’ అనే సినిమా చేశా. అందులో అంధురాలిగా నటించాను.  చాలా కష్టపడ్డాను. కానీ, ఆ చిత్రం హిట్‌ కాలేదు. తెలుగులో కూడా అలాంటి సినిమాలు ఉన్నాయి.

‘జనతా గ్యారేజ్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు చేశారు?

కాజల్‌: ఎన్టీఆర్‌ కోసం. ఆయనతో నేను ఎన్నో సినిమాలు చేశాను. నాకు ఆ పాట ఛాలెంజింగ్‌గా అనిపించింది. అందుకే నటించాను. 

కాజల్ రెమ్యూనరేషన్‌ పెంచేసింది? అందుకే ఆఫర్లు రావట్లేదని టాక్.. నిజమేనా?

కాజల్‌: కాదు. నేను అందరిలాగే పారితోషికం తీసుకుంటాను. పాత్రను బట్టి డిమాండ్‌ చేస్తానంతే. 

అల్లు అర్జున్ మీకు ఇచ్చిన సలహా ఏంటి?

కాజల్‌: నాకు చాలా విలువైన సలహా ఇచ్చాడు. ఇప్పటికీ దాన్ని పాటిస్తున్నాను. కెమెరా ఆఫ్‌ చేశాక కూడా కొంచెంసేపు ఎమోషన్‌లోనే ఉండాలన్నారు. ఎడిటింగ్ సమయంలో అది అవసరం అవుతుందని చెప్పారు. అది నాకు ఎంతో ఉపయోగపడింది. 

రాజమౌళి గురించి చెప్పండి?

కాజల్‌: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ఆయన విజన్‌ మరో స్థాయిలో ఉంటుంది. ఆయనతో వర్క్‌ చేశాక అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యం చేయొచ్చని అర్థమైంది. ఆయనతో కలిసి మరోసారి వర్క్‌ చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే. 

తమన్నాతో ఫ్రెండ్‌షిప్‌ ఎలా ఉంటుంది?

కాజల్‌: నాకు సమంత, తమన్నా ఇద్దరూ ఫ్రెండ్సే. షూటింగ్స్‌ ఉండడం వల్ల ఎక్కువగా కలవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైనా కలిసినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్‌ చేస్తాం. సమంతతో నేను కలిసి నటించాను. తమన్నా, నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. మేము కలిసినప్పుడు పని గురించి తక్కువ మాట్లాడుకుంటాం. 

ముంబయి, హైదరాబాద్‌ల్లో ఏదంటే ఇష్టం?

కాజల్‌: హైదరాబాద్. ఇక్కడ ఎలాంటి వాళ్లైనా జీవించొచ్చు. దేశంలోని బెస్ట్‌ సిటీల్లో హైదరాబాద్ ఒకటి.

‘సత్యభామ’కు దర్శకుడిగా కాకుండా.. స్క్రీన్‌ప్లేకే ఎందుకు పరిమితం అయ్యారు?

శశికిరణ్‌: నాకు సినిమాకు సంబంధించిన అన్ని పనులు చేయాలని కోరిక. అందుకే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నా. భవిష్యత్తులో రచయితగా, కొరియోగ్రాఫర్‌గా కూడా చేయాలనుకుంటున్నా.

ఈ సినిమాలో కాజల్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

శశికిరణ్‌: ఆమె ఎన్నో జోనర్స్‌లో నటించారు. ‘సత్యభామ’ పాత్ర కాజల్‌కు సరిపోతుందనిపించింది. అందుకే ఆమెను ఎంపిక చేశాం. ఎంతో కష్టపడ్డారు. సెట్‌లోకి రాగానే పాత్రలో లీనమైపోతారు. 

‘మేజర్‌’ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందనుకుంటున్నారా?

శశికిరణ్‌: మా టీమ్‌ నామినేషన్‌ పంపింది. సందీప్‌ ఉన్నికృష్ణన్‌ ఆ అవార్డుకు అర్హుడు. 

తల్లి అయ్యాక ఏమనిపించింది? 

కాజల్‌: మా అబ్బాయి నా జీవితం మొత్తాన్ని మార్చేశాడు. నేను మా అమ్మతో చాలా క్లోజ్‌గా ఉంటాను. ఇప్పుడు మా బాబుతో కూడా అలానే ఉంటున్నా. అమ్మ అవ్వాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు