logo

వలస ఓటర్లపై ఆశలు!

సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

Published : 29 Apr 2024 05:24 IST

గత శాసనసభ ఎన్నికల్లో బస్సులో స్వస్థలాలకు వస్తున్న ఓటర్లు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మహబూబ్‌నగర్‌ స్థానం పరిధిలో మహబూబ్‌నగర్‌, నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌, దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్లలో వలస ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో సుమారు 90 వేల మంది వలస ఓటర్లు ఉన్నట్లు అంచనా. నారాయణపేట, ధన్వాడ, కోయిల్‌కొండ, మద్దూరు, కోస్గి, బొంరాస్‌పేట, హన్వాడ మండలాల నుంచి ఎక్కువ మంది ఉపాధి కోసం వలస వెళ్లారు. నాగర్‌కర్నూల్‌ పరిధిలో వనపర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 35 వేల మంది మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వీరందరికీ ఉమ్మడి జిల్లాలో ఓటుహక్కు ఉంది. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఓటర్లను ఎలా తీసుకురావాలన్న దానిపై ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గాల స్థానిక నేతలతో పార్టీ ముఖ్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడున్న గుంపు మేస్త్రీలు, ఓటర్ల వివరాలు, చరవాణి నంబర్లను సేకరించి పెట్టుకున్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ  పరిధిలో ప్రధాన పార్టీలకు వలస ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఓటేసేందుకు వస్తారా..: గతేడాది నవంబరు 30న జరిగిన శాసనసభ ఎన్నికలకు వలస ఓటర్లు ఉమ్మడి జిల్లాకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మళ్లీ నాలుగు నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో పోలింగ్‌ రోజు వస్తారా.. లేదా.. అన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. వలస ఓటర్లు ఉన్న గ్రామాలకు చెందిన నేతలు కూడా ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు తీసుకురావడానికి ఆసక్తి చూపడం లేదు. సార్వత్రిక ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికలకు ప్రతి ఓటూ కీలకమే. అందుకే స్థానిక నేతలు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకే వీరిని రప్పిస్తే తమ విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయన్న ఆలోచనలో ఉన్నారు. పైకి మాత్రం ప్రధాన పార్టీల ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నా.. వీరిని రప్పించడంతో మాత్రం పెద్ద ఆసక్తి చూపడం లేదు.

రాజధానిలోని ఓటర్లూ కీలకమే..: ఉమ్మడి జిల్లాకు చెందిన ఓటర్లు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఈ సంఖ్య రెండు నియోజకవర్గాల పరిధిలో కలిపి సుమారు లక్షన్నరకుపైగా ఉంటుందని అంచనా. ఇప్పటికే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఓటర్ల వివరాలను ప్రధాన పార్టీల అభ్యర్థులు సేకరించి పెట్టుకున్నారు. ఈ వారం రోజుల్లో ముఖ్య నేతలు రాజధానిలోని వలస ఓటర్లతో సమావేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం వచ్చి ఓటు వేసి రాత్రికి వెళ్లవచ్చు. వారికి కావాల్సిన వాహనాలను కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓటింగ్‌ శాతం పెరిగితే ఏ పార్టీకి లాభం ఉంటుందన్న సమీకరణాలను ప్రధాన పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. దాని ప్రకారం వలస ఓటర్లను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నటు నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 79.89 శాతం, నాగర్‌కర్నూల్‌ పరిధిలో 80.95 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు 46.73 శాతం, భారాసకు 38.53 శాతం, భాజపాకు 8.73 శాతం ఓట్లు పడ్డాయి. ఇప్పుడూ జాతీయస్థాయిలో ఓట్ల ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో వలస ఓటర్ల మనస్సులో ఏముందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని