logo

తండ్రి మృతితో కుంగిపోయి.. చదువుకు దూరమై..

ఇంటి పెద్దదిక్కు మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. చక్కగా చదువుకుంటున్న బాలిక చదువుకు దూరమైంది. ఇది కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌ గేట్‌ తండాకు చెందిన నందిని పరిస్థితి. వివరాలు.. గేట్‌ తండాకు చెందిన రమావత్‌ సురేష్‌, బుజ్జిబాయి దంపతులకు

Published : 03 Jul 2022 01:37 IST

నందిని, కుటుంబ సభ్యులతో ఎంపీపీ, తదితరులు

కౌడిపల్లి, న్యూస్‌టుడే: ఇంటి పెద్దదిక్కు మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. చక్కగా చదువుకుంటున్న బాలిక చదువుకు దూరమైంది. ఇది కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌ గేట్‌ తండాకు చెందిన నందిని పరిస్థితి. వివరాలు.. గేట్‌ తండాకు చెందిన రమావత్‌ సురేష్‌, బుజ్జిబాయి దంపతులకు కుమార్తెలు నందిని, పల్లవి, కుమారులు రాంచరణ్‌, కార్తీక్‌లు ఉన్నారు. పెద్ద కుమార్తె నందిని స్థానిక గిరిజన గురుకులంలో ఐదో తరగతి వరకు చదివింది. రెండేళ్ల కిందట తండ్రి సురేష్‌ గుండెపోటుతో మృతిచెందడంతో కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. కూలీ పనులే ఆధారంగా జీవనం సాగిస్తున్న వారిని మరింత కుంగదీసింది. దీంతో పిల్లల భారమంతా బుజ్జిబాయిపైనే పడింది. కుమారులిద్దరూ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. బుజ్జిబాయి కూలీ పనులకు వెళ్తుండగా పెద్ద కుమార్తె నందినిని చదువు మానిపించి చిన్న కూతురిని చూసుకునేందుకు ఇంట్లోనే ఉండిపోయింది. ఇలా రెండేళ్లుగా చదువుకు దూరమైంది. ఇదే తండాకు చెందిన తన మిత్రురాలు సంధ్య గురువారం కౌడిపల్లిలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పాల్గొనగా.. వారి దృష్టికి నందిని విషయాన్ని తీసుకెళ్లింది. ఆమెను చదివించండంటూ సభాముఖంగా వేడుకుంది. దీనికి స్పందించిన ఎమ్మెల్యే, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌లు నందిని విద్యాభ్యాసానికి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. వారి సూచనలతో శనివారం కౌడిపల్లి ఎంపీపీ రాజునాయక్‌, రైబస మండల అధ్యక్షుడు రామాగౌడ్‌, అమర్‌సింగ్‌ సదరు విద్యార్థిని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తిరిగి చదివించేలా తల్లి బుజ్జిబాయి, నాయనమ్మ దుర్గిలను ఒప్పించారు. వసతిగృహంలో చేర్పిస్తామని అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు ధైర్యంతో తన మిత్రురాలి పరిస్థితిని వివరించిన సంధ్యను అందరూ ప్రశంసించారు. సర్పంచి పద్మ, ఉపసర్పంచి మౌనిక తదితరులున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని