logo

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్‌ రోజున గొడవలు సృష్టించే రౌడీలు, కేడీలు, పాత నేరస్థుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించింది.

Published : 29 Apr 2024 01:33 IST

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి

సంగారెడ్డి పట్టణంలో పోలీసుల కవాతు

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్‌ రోజున గొడవలు సృష్టించే రౌడీలు, కేడీలు, పాత నేరస్థుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించింది. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో స్థానిక పోలీసులతోపాటు కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. ఎన్నికల నిర్వహణపై పోలీసు శాఖను అప్రమత్తం చేస్తూ ఎస్పీ రూపేష్‌ నిత్యం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అత్యధికంగా జహీరాబాద్‌ నియోజకవర్గంలో..

జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, అందోలు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాలున్నాయి. మే 13న నిర్వహించే లోక్‌సభ ఎన్నికలను పోలీస్‌ శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా 1445 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వాటిలో సమస్యాత్మకమైన 250 కేంద్రాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. అత్యధికంగా జహీరాబాద్‌ నియోజకవర్గంలో 67 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా ప్రకటించారు. అత్యల్పంగా హత్నూర మండలంలో 19 ఉన్నాయి. గతంలో ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు, అల్లర్లను దృష్టిలో ఉంచుకొని వీటిని ఎంపిక చేశారు. వాటిపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పాత నేరస్థులను స్థానిక తహసీల్దార్ల ముందు బైండోవర్‌ చేయడంతో పాటు.. వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ఇప్పటికే చేరిన కేంద్ర బలగాలు

లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు జిల్లాకు ఇటీవల చేరాయి. నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు డివిజన్లకు మూడు కంపెనీల బలగాలను కేటాయించారు. సంగారెడ్డికి అత్యవసరమైతే పటాన్‌చెరు నుంచి రప్పిస్తారు. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం పోలీస్‌ శాఖ ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని వినియోగించుకుంటుంది.

సాంకేతికత వినియోగం

ప్రశాంత పోలింగ్‌ కోసం పోలీస్‌ శాఖ సాంకేతికతను వినియోగిస్తోంది. సమస్యాత్మక కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. వీటికి ప్రత్యేకంగా కేంద్ర బలగాలను కేటాయిస్తారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలతోపాటు వెబ్‌ కాస్టింగ్‌తో పర్యవేక్షిస్తారు. ఎస్పీ, కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలకు వీటిని అనుసంధానిస్తారు. సాధారణ పోలింగ్‌ కేంద్రాల్లో అయిదుగురు పోలీసులు, సమస్మాత్మక కేంద్రాల్లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలతోపాటు స్థానిక పోలీసులు పహారా కాస్తారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే... అక్కడికి త్వరగా చేరుకునేందుకు ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉంటాయి. స్థానిక డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలకు బందోబస్తు పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారు.

విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

రూపేష్‌, ఎస్పీ

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసు అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అప్రమత్తమయ్యాం. అన్ని పార్టీల నేతలు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి. చట్ట వ్యతిరేక శక్తులు, పాత నేరస్థులు, అనుమానితుల కదలిలకపై ప్రత్యేక దృష్టి సారించాం. నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ పోలీసు అధికారులు,  సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. పోలీసు సిబ్బందికి పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక అవగాహన ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. విధులను నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తప్పవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని