logo

సీఎంపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్‌

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 14 May 2024 06:24 IST

హుస్నాబాద్‌ పోలింగు కేంద్రం వద్ద బండి సంజయ్‌

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం హుస్నాబాద్‌లో పలు పోలింగు కేంద్రాల్లో ఓటింగ్‌ సరళిని పరిశీలించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి భాజపాకు, మోదీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడవచ్చా... నిబంధనల నుంచి ముఖ్యమంత్రిని మినహాయించారా అని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలను బట్టి తెలంగాణ రాష్ట్రంలో అధిక సీట్లు భాజపా గెల్చుకుంటుందని భయంతో మాట్లాడుతున్నారన్నారు. కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గంలో, ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌, భారాస మద్యం, డబ్బులు పంపిణీ చేస్తూ చేపట్టిన ప్రలోభాలను నివారించడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైందన్నారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఓటుకు రూ.వెయ్యి నగదు, మద్యాన్ని భారాస, కాంగ్రెస్‌ నేతలు ఆదివారం అర్ధరాత్రి పంపిణీ చేశారని ఆరోపించారు.  హుస్నాబాద్‌ పట్టణంలో ప్రభుత్వ బాలుర కళాశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, ఆరెపల్లెలోని  పోలింగు కేంద్రాలను భాజపా అభ్యర్థి ఎంపీ బండి సంజయ్‌ సందర్శించారు. కార్యకర్తలతో పోలింగు సరళిని అడిగి తెలుసుకున్నారు. పట్టణ భాజపా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్‌, భాజపా రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు లక్కిరెడ్డి తిరుమల, మహిళా మోర్చా అధికార ప్రతినిధి స్వరూప, సీనియర్‌ నాయకులు కొత్తపల్లి అశోక్‌, పట్టణ మాజీ అధ్యక్షుడు శంకర్‌బాబుతోపాటు పలువురు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని