logo

భారాసతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

కాంగ్రెస్‌ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Updated : 29 Apr 2024 06:26 IST

శివ్వంపేటలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో పార్లమెంట్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీతారెడ్డి

చిన్నశంకరంపేట, వెల్తురి, శివ్వంపేట న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారాస అధికారంలో ఉన్నప్పుడే ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కులం, మతం పేరుతో భాజపా ఓట్లు అడుగుతోందని ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచి, ఆరు గ్యారంటీలను అమలు చేసేలా పోరాడుతామన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రఘునందన్‌రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఇపుడు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సేద్యానికి 24 గంటలు విద్యుత్తు రావడంలేదు, ఆసరా పింఛన్లు ఇవ్వడంలేదు, ధాన్యం కొనుగోలు మందకొడిగా నిర్వహిస్తూ, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాలుగున్నర నెలల్లో చేసింది శూన్యమని, అయితే తిట్లు, లేకపోతే ఓట్లు అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉందని విమర్శించారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా పని చేయడమే కాదు, సేవాతత్పరుడని గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో ఉన్నారని, మళ్లీ ఇప్పుడు ఓటుకు ఒట్టుతో ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారని విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీ, బీమా, మహిళలకు రూ.2,500, యువతకు నిరుద్యోగభృతి ఇవ్వడంలేదన్నారు. ప్రజలకు ఏమీ చేయని భాజపా అదాని, అంబానీలకు దోచిపెడుతోందని ఆరోపించారు. మెదక్‌ లోక్‌సభ స్థానంలో బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు 7వ తరగతి, మరొకరు బ్లాక్‌ మెయిలర్‌, ఇంకొకరు కలెక్టర్‌ వీరిలో ఎవరికీ వేస్తే సేవ చేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. ధాన్యం బస్తాలో ఆరు కిలోలు తరుగు తీసే, కాంగ్రెస్‌కు ఓట్లలో తరుగుపెట్టాలన్నారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ శివ్వంపేటలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూములను కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి పరిష్కారానికి కృషి చేశారని, ఆయన ఓటు వేసి గెలిపించాలన్నారు.  అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గెలిస్తే యువత కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో మాసాయిపేట నుంచి వెల్దుర్తి వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు చిన్నశంకరంపేటలో జిల్లా అధ్యక్షురాలు పద్మ, జడ్పీటీసీ సభ్యురాలు  మాధ]వి, జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి, ఎకే.గంగాధర్‌రావు, వెల్దుర్తిలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నాయకులు అనంతరెడ్డి, రమేష్‌గౌడ్‌, మోహన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, శివ్వంపేటలో ఎమ్మెల్యే సునీతారెడ్డి,  జడ్పీటీసీ సభ్యుడు పబ్బ మహేష్‌ గుప్తా, ఎంపీపీ హరికృష్ణ, చంద్రాగౌడ్‌, జడ్పీకోఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని