logo

రణమా.. ఉపసంహరణమా!

నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు.

Updated : 29 Apr 2024 06:25 IST

నేటితో ముగియనున్న గడువు

మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌

న్యూస్‌టుడే, మెదక్‌: నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు. పరిశీలన అనంతరం రాష్ట్రంలో అత్యధిక మంది అభ్యర్థులు బరిలో ఉన్నది కేవలం మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గమే. ఇందులో ప్రధాన పార్టీలతో పాటు, గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు ఉన్నారు. ఐదారుగురు స్వతంత్రులు ఉంటే వారిని బుజ్జగించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు చేసే వారు. కానీ పదుల సంఖ్యలో ఉండడంతో వారి వైపు కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. ఒక వేళ ఉపసంహరించుకోకుండా, 53 మంది అభ్యర్థులు బరిలో ఉంటే...నాలుగు బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందుకు ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఖమ్మం నుంచి వచ్చి: మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మొత్తం 54 మంది నామపత్రాలు సమర్పించగా, పరిశీలనలో ఒక స్వతంత్ర అభ్యర్థిని తిరస్కరించారు. దీంతో ప్రసుత్తం 53 మంది ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నలుగురు ఉండగా, మిగిలిన 13 మంది గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు. ఇక మిగిలిన 36 మంది స్వతంత్ర అభ్యర్థులు కావడం గమనార్హం. ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నామినేషన్‌ వేశారు.

శుక్రవారం పరిశీలన చేపట్టగా..: నామపత్రాల పరిశీలన శుక్రవారం నుంచి చేపట్టగా, నిబంధనల ప్రకారం శని, ఆదివారాల్లో ఉపసంహరణ పత్రాలను స్వీకరించలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం మూడుగంటల లోపు ఉపసంహరించేందుకు గడువు విధించారు. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించి, అనంతరం బరిలో ఉన్న వారి వివరాలను రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారు.

బుజ్జగింపులు లేవు...

సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు... ఇతర పార్టీలు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే చాలా తక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన వారై ఉండడంతో, అందులో పలువురిని ప్రధాన పార్టీల అభ్యర్థులు బుజ్జగించి, నామినేషన్‌ ఉపసంహరించుకునేలా దృష్టిసారించేవారు. అదే లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలవ్వడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. మెదక్‌ లోక్‌సభ స్థానానికి 36 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. వీరికి నచ్చజెప్పడం ప్రధాన పార్టీలకు తలకు మించిన భారమవుతోంది. నయానో...బయానో కొంత అప్పజెప్పి...పోటీలో నుంచి ఉపసంహరించుకునేలా చేద్దామన్నా...వారి డిమాండ్లు పెద్దఎత్తున ఉండడంతో ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. ఎంతో కొంత ముట్టజెప్పే బదులు...ఎన్నికల ఖర్చులకు వెచ్చించవచ్చని ఓ పార్టీ నేత అభిప్రాయపడ్డారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులుండడంతో అందులో కొంత మందిని తప్పించేలా ప్రయత్నం చేస్తే, పెద్దఎత్తున డిమాండ్‌ ఉండడంతో అటు వైపు వెళ్లడం లేదని మరో పార్టీ నేత పేర్కొన్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు, ఫొటో...మొదటి ఈవీఎంలోనే ముందు వరుసలో ఉండనున్నాయి. ఈ కారణంగా వారు స్వతంత్రులను పోటీ నుంచి తప్పుకొనేలా ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. ఈ లెక్కన ఎంత మంది బరిలో ఉంటారనేది సోమవారం తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని