logo

పుర పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి

రెండేళ్ల పుర పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని భువనగిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, పురపాలిక మాజీ ఛైర్మన్‌ బర్రె జహంగీర్‌, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు కైరంకొండ వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ

Published : 28 Jan 2022 03:13 IST

ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని చూపుతున్న కాంగ్రెస్‌ నాయకులు పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌,

బర్రె జహంగీర్‌, కౌన్సిలర్లు కైరంకొండ వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: రెండేళ్ల పుర పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని భువనగిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, పురపాలిక మాజీ ఛైర్మన్‌ బర్రె జహంగీర్‌, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు కైరంకొండ వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, నిధులు సాధించడంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అధికార పక్షం పుర పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. పట్టణం నుంచి హెచ్‌ఎండీఏకు కోట్లాది రూపాయలు ఆదాయంగా వెళ్తున్నప్పటికీ, అక్కడి నుంచి పట్టణాభివృద్ధి, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులు మంజూరు చేయించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పురపాలికలోని కీలక పదవులను రాయగిరికి కట్టబెట్టి పట్టణానికి అన్యాయం చేశారన్నారు. అన్ని వార్డుల్లో సమస్యలు నెలకొన్నప్పటికీ పరిష్కరించిన దాఖలాలు లేవని ఆరోపించారు. కౌన్సిలర్లు చేసిన తీర్మానాలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. కోతులు, కుక్కలను నియంత్రించడంలో విఫలమయ్యారన్నారు. మినీ ట్యాంక్‌బండ్‌, అవుట్‌డోర్‌ స్టేడియం పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ముందస్తుగా చిరువ్యాపారులకు ఆశ్రయం కల్పించకుండా రహదారిని విస్తరిస్తూ 208 మంది ఉపాధిని హరించారని పేర్కొన్నారు. నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపులో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజలకు కల్పించిన సదుపాయాలపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు పడిగెల ప్రదీప్‌, సలావొద్దీన్‌, గంగాధర్‌, కృష్ణ యాదవ్‌, కొల్లూరి రాజు, దర్గాయి దేవేందర్‌, సాయి, నరేష్‌, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని