logo

అడ్డదారి.. కలప చోరీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాలు చేపడుతోంది. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా అక్రమార్కులు చెట్లను అడ్డంగా నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 24 May 2022 03:51 IST

కలప దుంగ.. చోరుల బెంగ


చందంపేట మండలం ముర్పునూతల వద్ద మూతపడిన అటవీ శాఖ చెక్‌పోస్టు

దేవరకొండ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాలు చేపడుతోంది. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా అక్రమార్కులు చెట్లను అడ్డంగా నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న చెక్‌పోస్టు కాస్తా మూతపడి దశాబ్దకాలం గడుస్తోంది. దీంతో అక్రమార్కులు వృక్షాలను నరికి కలపను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని పోలేపల్లి ప్రధాన కేంద్రంగా అక్రమ కలప రవాణా జోరందుకుంది. అక్రమార్కులు ఈ గ్రామాన్ని అడ్డాగా ఎంచుకొని నిత్యం దేవరకొండ పట్టణంలోని హోటళ్లు, మిల్లులకు కలపను తరలిస్తున్నారు. మరోవైపు బొగ్గు బట్టీలుగా మారుస్తున్నారు. ముదిగొండ, గొట్టిముక్కల, చింతపల్లి మండలం ఉమ్మెంతాలపల్లి, గుర్రంపోడు మండలం పాల్వాయి వద్ద, కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి శివారులో కలపను బొగ్గుగా మార్చి పొరుగు రాష్ట్రం విశాఖపట్టణానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.


దేవరకొండ పట్టణం మీదుగా అడ్డదారిన పోతున్న కలప

మూతపడిన చెక్‌పోస్టులు

నల్లమల అటవీ ప్రాంత పరిసర గ్రామాల నుంచి అక్రమంగా కలపను తరలించి పోలెపల్లి గ్రామాన్ని అడ్డాగా ఎంచుకొని తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా చందంపేట మండలం ముర్పునూతల వద్ద దశాబ్దకాలం క్రితం అక్కడున్న చెక్‌పోస్టు మూతపడింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు పునరుద్ధరించకపోవడంతో రాత్రివేళలో గుట్టుగా కలప తరలిస్తూ అటవీ శాఖ సిబ్బందికి గతంలో పట్టుబడ్డారు. పోలెపల్లి వద్ద మరో చెక్‌పోస్టును ఏర్పాటు చేసినట్లయితే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని