logo

మరో ఉద్యమానికి శ్రీకారం: జగదీశ్‌రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో 14 ఏళ్ల పోరాటం చేసి దిల్లీ పెద్దల మెడలు వంచి రాష్ట్రం సాధించిన భారాస మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 28 Apr 2024 06:08 IST

నల్గొండ భారాస కార్యాలయంలో జెండా  ఆవిష్కరించిన పార్టీ జిల్లా  అధ్యక్షుడు రవీంద్ర కుమార్‌ నాయక్‌, చిత్రంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి రాష్ట్రంలో 14 ఏళ్ల పోరాటం చేసి దిల్లీ పెద్దల మెడలు వంచి రాష్ట్రం సాధించిన భారాస మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల గోసకు కారణమైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. రైతాంగ సమస్యలతో పాటు నేతన్నల సమస్యలు కూడా తీవ్రరూపం దాల్చాయన్నారు. ప్రజలు ఉపాధి కోసం విదేశాలబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. భారాస ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించామని.. రేవంత్‌రెడ్డి సర్కారు బీడు భూములుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజ జీవితంలో ఏనాడు కూడా నిజాలు చెప్పని కోమటిరెడ్డి సోదరుల గురించి మాట్లాడి స్థాయి దిగజార్చుకోవడం ఇష్టం లేదని తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు, నాయకులు తిప్పన విజయసింహారెడ్డి, చీరపంకజ్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు