logo

సంఘాలను కాదని.. సంస్థకు అప్పగించి..

పురపాలక సంఘం పరిధిలో చేపట్టాల్సిన పనులకు ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. అర్హులకు లబ్ధి చేకూరకపోగా పనులు ముందుకు సాగడం లేదు.

Published : 28 Apr 2024 06:16 IST

పొడి చెత్త విక్రయంపై కుదరని ఒప్పందం

బండిల్స్‌గా మార్చిన ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లు, వ్యర్థాలు

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక సంఘం పరిధిలో చేపట్టాల్సిన పనులకు ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. అర్హులకు లబ్ధి చేకూరకపోగా పనులు ముందుకు సాగడం లేదు. డంపింగ్‌ యార్డులో పొడిచెత్త సేకరణ, విక్రయాల హక్కులను ఫిబ్రవరి నెల నుంచి ఒప్పందం ఖరారు చేయకపోవడంతో మహిళా సంఘాలు నష్టపోయాయి. వీరి స్థానంలో ఒప్పందం లేకుండానే యార్డులో తడి, పొడి చెత్తను సేకరిస్తూ ఓ సంస్థ లాభాలు గడించడం గమనార్హం. పురపాలక సంఘం డంపింగ్‌ యార్డులో రెండేళ్లుగా రెండు మహిళా సంఘాలకు చెందిన మహిళలకు పొడి చెత్తను సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరి ఒప్పంద గడువు గత ఫిబ్రవరితో ముగిసింది. తిరిగి మహిళా సంఘాలకు ఈ హక్కులను కట్టబెట్టాల్సి ఉండగా గత కమిషనర్‌ ఓ సంస్థకు ఒప్పందం చేసుకోకుండానే యార్డులో కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతించారు. మూడు నెలలుగా సంస్థ ప్లాస్టిక్‌ వ్యర్థాలు, సీసాలు, గాజు సీసాలు, అట్ట, కాగితం, ఐరన్‌ వ్యర్థాలను సేకరించి లాభాలను మూటకట్టుకుంది. విషయం తెలిసి నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్‌ రామాంజులరెడ్డి గత మూడు రోజుల క్రితం పట్టణంలోని ప్రగతి మహిళా సంఘం సభ్యురాలు సొప్పరి బిందు, చైతన్య మహిళా సంఘం సభ్యురాలు గీస లక్ష్మికి సేకరణ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పట్టణం నుంచి భారీగా తడి, పొడిచెత్త యార్డుకు రావాల్సి ఉన్నప్పటికి చెత్త సేకరణ వాహనాల కార్మికులు తాము సేకరించిన వ్యర్థాలను అధిక మొత్తంలో మార్కెట్‌లోని స్క్రాప్‌ వ్యాపారులకు విక్రయించి, కొద్ది మొత్తంలో మహిళా సంఘాల సభ్యులకు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తడి, పొడి చెత్త సేకరణపై గతంలో మహిళా సంఘాల సభ్యులు నెలకు రూ.35 నుంచి రూ.40 వేల ఆదాయాన్ని గడించే వారు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల రీసైకిల్‌ జరిగి యార్డులో స్థలం అందుబాటులోకి వస్తుందన్న ఉద్దేశంతో పురపాలకులు ఈ కార్యకలాపాలను నిర్వహించేందుకు యార్డులో షెడ్లు, విలువైన కంప్రెస్‌ యంత్రంతో పాటు నెలనెలా భారీగా వచ్చే విద్యుత్తు బిల్లును చెల్లిస్తూ ఉచితంగా వసతి, ఇతర సదుపాయాలను కల్పిస్తుండటం గమనార్హం. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డిని వివరణ కోరగా గత కమిషనర్‌ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండానే సంస్థకు బాధ్యతలు అప్పగించారని, మహిళలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని వివరణ ఇచ్చారు. గత మూడు నెలలుగా సంస్థ సేకరించిన వ్యర్థాలపై మున్సిపాలిటీకి ఎలాంటి రుసుం చెల్లించలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు