logo

ఆయిల్‌పాం తోటలకు నీటి కొరత

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రోత్సహిస్తున్న ఆయిల్‌పాం సాగుపై కరవు ప్రభావం పడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు అందక, ఈ తోటల్లో బిందుసేద్యం పరికరాలు సరిగా పనిచేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 28 Apr 2024 06:22 IST

చిట్యాల: వెంకటాపురంలో నీటి కొరత ఎదుర్కొంటున్న ఆయిల్‌పాం తోట

నకిరేకల్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రోత్సహిస్తున్న ఆయిల్‌పాం సాగుపై కరవు ప్రభావం పడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు అందక, ఈ తోటల్లో బిందుసేద్యం పరికరాలు సరిగా పనిచేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రతకు క్రమంగా బోర్లు వట్టి పోతుండటంలో వడలి పోతున్న తోటలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోంది. ఆరు నెలలు, ఏడాది లోపు వయసున్న తోటలను నీటి ఎద్దడి నుంచి కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు.

వేల ఎకరాలపై ప్రభావం

ఉమ్మడి జిల్లాలో 16 వేల ఎకరాలకుపైగా ఆయిల్‌పాంను రైతులు సాగుచేస్తున్నారు. భూగర్భ జలాలు వేగంగా అండుగంటుతుండటం, ఎండల తీవ్రత కొనసాగుతుండటంలో 4,500 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. ఈ సమస్యతో ఇతర జిల్లాల్లో తోటల సంరక్షణను రైతులు వదిలేస్తున్నారన్న సమాచారం అందుతుండటంతో ఉద్యానశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. తోటలను కాపాడుకునేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు. ఆయిల్‌పాం మొక్కలు తాటి, ఈత, కొబ్బరి వంటి ఫామ్‌ జాతికి చెందినవైనందున నీటి ఎద్దడిని తట్టుకుంటాయని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.


రైతులు ఆందోళన చెందవద్దు
రావుల విద్యాసాగర్‌, ఉద్యానశాఖ క్లస్టర్‌ అధికారి, నకిరేకల్‌

ఆయిల్‌పాం సాగుచేస్తున్న రైతులు నీటి కొరత సమస్యతో ఆందోళన చెందవద్దు. రెండు మూడు నెలలు నీరు తగ్గడం వల్ల మొత్తం మొక్కలన్నీ చనిపోవు. ఎదుగుదలపై కొంత ప్రభావం ఉంటుంది. దీని వల్ల తోట మొత్తం నష్టం ఉండదు. నీటి సమస్య వల్ల చెట్లకు ఆడ గెలల స్థానంలో మగ గెలలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ చెట్లు చనిపోవు. మొక్కల పాదుల్లో జనుము విత్తనాలు చల్లి నీరు పట్టడం వల్ల పాదుల్లో తేమ వాతావరణం కొనసాగుతుంది. వరి గడ్డి, వరి పొట్టు, వేరుశనగ పొట్టుతో ఒక దానితో పాదుల్లో కప్పి ఉంచడం వల్ల తేమ ఎక్కువ కాలం ఉంటుంది. వారం వరకు నీటి తడిని ఇవ్వలేని పరిస్థితులు ఉంటే 15-20 రోజులకు ఒకసారి లీటరు నీటిలో 5 గ్రాములు యూరియా కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని