logo

నిద్రలేమి.. నిండు ప్రాణాలు బలి

నిద్రలేమి కారణంగానే ఈ మధ్యలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి వెంబడి నిలిపి ఉంచిన వాహనాలను నేరుగా వచ్చి ఢీకొట్టడం వెనక గత రాత్రి డ్రైవర్లకు నిద్ర లేకుండా ఉండటం, ఏకాగ్రత లోపించడమే ప్రధాన కారణం.

Published : 28 Apr 2024 06:24 IST

ఈ చిత్రంలో లారీ కంటైనర్‌ కిందకు కారు దూసుకుపోవడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఈ నెల 21న మునగాల మండలం ముకుందాపురం గ్రామ సమీపంలోని పెట్రోల్‌ బంకు దగ్గర చోటు చేసుకుంది. నవీన్‌రాజు, భార్గవి దంపతులు విజయవాడలో నివాసం ఉంటున్నారు. 20న భార్గవి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో తల్లిదండ్రుల సమక్షంలో వేడుకలు నిర్వహించుకున్నారు. 21న ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరగా ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రాత్రి సరైన నిద్ర లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ చిత్రంలో లారీని వెనక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందడం అందరినీ కలచి వేసింది. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 25న విజయవాడలో పుట్టు వెంట్రుకల కార్యక్రమం నిర్వహించేందుకు తెల్లవారుజామున ఒంటి గంటకే హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. 24న రాత్రి శుభకార్యానికి కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉండి, నిద్ర లేకుండా విజయవాడకు బయలుదేరారు. డ్రైవర్‌ సీటులో కూర్చున్న కృష్ణంరాజుకు నిద్ర లేకపోవడంతో కోదాడ సమీపంలోకి రాగానే రహదారి వెంబడి నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు నిద్రలేమి ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు.


కోదాడ, న్యూస్‌టుడే: నిద్రలేమి కారణంగానే ఈ మధ్యలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి వెంబడి నిలిపి ఉంచిన వాహనాలను నేరుగా వచ్చి ఢీకొట్టడం వెనక గత రాత్రి డ్రైవర్లకు నిద్ర లేకుండా ఉండటం, ఏకాగ్రత లోపించడమే ప్రధాన కారణం. నిద్రలేమి, అతివేగంతో నడపడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతుండటంతో నిండు ప్రాణాలు ఆరిపోతున్నాయి.

ఉదయపు ప్రమాదాలే ఎక్కువ..

చాలా మంది పుట్టిన రోజు వేడుకలు, శుభకార్యాల పేరిట అర్ధరాత్రి దాటే వరకు డీజే పాటలతో నృత్యాలు చేస్తున్నారు. మరుసటి రోజు విరామం లేకుండా వారి పనుల నిమిత్తం దూరపు ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో సరైన నిద్ర లేకపోవడంతో వాహనం నడిపేటపుడు కునుకు తీస్తుంటారు. ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని ప్రమాదాలు ఉదయమే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 200లకు పైగా ప్రమాదాలు జరగగా, వాటిలో 100 మందికి పైగా మరణించడం గమనార్హం. మరో 200 మంది ప్రమాదంలో గాయపడి దివ్యాంగులుగా మారారు.


నిద్రలేమితో వాహనాలు నడపొద్దు
రాహుల్‌ హెగ్డే, జిల్లా ఎస్పీ

ఈ మధ్య కాలంలో జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం బాధాకరం. వాహనం నడిపే వ్యక్తులకు సరైన నిద్ర ఉండట్లేదని మా విచారణలో తెలుస్తోంది. వివిధ కార్యక్రమాల పేరిట సరైన నిద్ర లేకుండా మరుసటి రోజు వాహనాన్ని నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. నిద్రలేమి, మద్యం తాగి ఉండటంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రైవర్లు నిద్రలేమితో వాహనాలు నడపొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు