logo

ఓటెత్తేలా.. స్ఫూర్తి చాటేలా..!

లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

Published : 29 Apr 2024 04:22 IST

దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు

కుడకుడలో శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరుసలో ఉన్న ఓటర్లు

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన, స్వీప్‌ కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు 96 శాతం, వృద్ధులు 87, ట్రాన్స్‌జెండర్లు వంద శాతం ఓటుహక్కు వినియోగించుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. ఎన్నికల సంఘం వికలాంగులు, వృద్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా ఓటు వేశారు. వృద్ధులు, మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్ద ఓటు వేయించడం, దివ్యాంగులను ఆటోలో పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లి ప్రత్యేక వరుసలో వీల్‌ఛైర్లతో వాలంటీర్ల సహకారంతో ఓటేయించడం, ట్రాన్స్‌జెండర్లకు ఓటు ఆవశ్యకత గురించి అధికారుల పూర్తి స్థాయి అవగాహన కల్పించడంతో వారి ఓటింగ్‌ శాతం పెరిగింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇప్పటికే ఇంటి వద్దే ఓటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలింగ్‌ కేంద్రాల్లోనూ వృద్ధులకు వీల్‌ఛైర్ల ఏర్పాటు, ర్యాంపుల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నారు. ఆ సౌకర్యాలను వినియోగించుకొని లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కును సద్వినియోగం చేసుకుని స్ఫూర్తిని నిలుస్తామని పలువురు ఓటర్లు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


ప్రత్యేక వెసులుబాటు హర్షణీయం
-ఎం.లక్ష్మయ్య, వృద్ధుడు

వృద్ధులకు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక వెసులుబాటు కల్పించడం హర్షణీయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్ద ఓటు వేయించడంతో ఓటింగ్‌ శాతం పెరిగింది. ఈ సారి 85 సంవత్సరాలు పైబడిన వారికి ఎన్నికల సంఘం ఈ అవకాశం కల్పిస్తోంది. పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఓటర్లు బారులు తీరినట్లయితే వృద్ధులను వాలంటీర్లు గుర్తించి వారికి మరో వరుసలో తీసుకెళ్లి ఓటు వేసేలా అవకాశం కల్పించడం బాగుంది.


సౌకర్యాలు బాగున్నాయి
-కె.సైదులు, దివ్యాంగుడు

పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులకు నిబంధనల మేరకు కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయి. వీల్‌ఛైర్లు, ఆటోలు, వాలంటీర్లను ఏర్పాటు చేయించడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 96 శాతం మందిమి ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నాం. ఈ ఎన్నికల్లోనూ వంద శాతం ఓటు వేసేందుకు మాతోటి వారందరికీ అవగాహన కల్పిస్తున్నాం.


స్వేచ్ఛగా సద్వినియోగం
-శ్రీలేఖ్య, ట్రాన్స్‌జెండర్‌

మాపై ఎలాంటి వివక్ష చూపకుండా రాజ్యాంగం ఓటుహక్కు కల్పించడంతో స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకున్నాం. జిల్లాలో పాలనాధికారి గత ఎన్నికల్లో తొలిసారిగా ఓటరు గుర్తింపు కార్డులు అందించారు. తొలిసారిగా జిల్లాలో ఉన్న 55 మంది ట్రాన్స్‌జెండర్లం ఓటు వేశాం. ఈ ఎన్నికల్లోనూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకుంటాం.


జిల్లాలో వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్ల వివరాలు

వృద్ధులు 17,216
85 సంవత్సరాల పైబడిన వారు 6,425
దివ్యాంగులు 13,421
ట్రాన్స్‌జెండర్లు 55


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని