logo

నల్లబజార్‌కు భారత్‌ సరకులు..!

మార్కెట్‌లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాయితీపై సరఫరా చేస్తున్న ‘భారత్‌ దాల్‌’ను మిర్యాలగూడ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ప్యాకెట్లు చింపి.. బస్తాల్లో నింపి ఏపీలోని పలు జిల్లాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

Published : 29 Apr 2024 04:30 IST

భారత్‌ దాల్‌ సబ్సిడీ పప్పు ప్యాకెట్‌

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: మార్కెట్‌లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాయితీపై సరఫరా చేస్తున్న ‘భారత్‌ దాల్‌’ను మిర్యాలగూడ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ప్యాకెట్లు చింపి.. బస్తాల్లో నింపి ఏపీలోని పలు జిల్లాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మిర్యాలగూడకు చెందిన కొందరు వ్యాపారులు ముఠాగా ఏర్పడి సబ్సిడీపై కేంద్రం ఇచ్చే పప్పు, గోధుమపిండిని డీలర్ల నుంచి వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలోని అద్దంకి రహదారి వెంబడి ఓ ప్రైవేట్‌ గోదాముకు తరలించి అక్కడ పప్పు, పిండికి చెందిన ప్యాకెట్లను రాత్రి వేళల్లో కత్తిరించి బస్తాల్లో నింపుతున్నారు. 50 కిలోల బస్తాల్లో నింపి రాత్రి సమయాల్లో డీసీఎంలలో అక్రమంగా ఏపీలోని నర్సరావుపేట, బాపట్ల, సత్తెనపల్లి గుంటూరు జిల్లాలోని పలు పట్టణాలకు  తరలిస్తున్నారు. జిల్లాల వారీగా  సరఫరా చేసేందుకు అవగాహన కుదుర్చుకున్న వారి నుంచి పప్పును మిర్యాలగూడకు చెందిన ముఠా సభ్యులు కొనుగోలు చేస్తున్నారు. ఏపీలో బహిరంగ మార్కెట్‌లో శనగపప్పు కిలో రూ.90 నుంచి రూ.100 వరకు ఉండగా దీన్ని ఆసరాగా చేసుకుని ముఠా విక్రయాలు విస్తరిస్తున్నారు. కేంద్రం విక్రయదారులకు ప్యాకెట్‌పై ముద్రించిన ధరల కన్నా తక్కువగా సరఫరా చేస్తుండగా కిలోకి రూ.30 నుంచి రూ.50 అదనంగా ఆదాయం లభిస్తుండగా నల్లబజారు దందా ముమ్మరంగా సాగిస్తున్నారు.  జిల్లా స్థాయిలో పౌరసరఫరాల శాఖకు ఈ తరహా సబ్సిడీ సరకుల పంపిణీపై నియంత్రణ లేకపోవటంతో అక్రమార్కులు తమ ఇష్టారాజ్యం సాగిస్తున్నారు.

భారత్‌ ఆటా సబ్సిడీ గోధుమ పిండి ప్యాకెట్‌

కేంద్రం సబ్సిడీ విధానం ఇదే..

కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసే ‘జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’, ‘కేంద్రీయ బండార్‌’, ‘ జాతీయ వినియోగదారుల కో- ఆపరేటివ్‌ ఫెడరేషన్‌’ అనే మూడు సంస్థల ద్వారా రాయితీ సరకుల విక్రయాలు జరిపించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఏడాది క్రితం రాష్ట్రంలో సరకుల పంపిణీ ప్రారంభం అయింది. సబ్సిడీపై ‘భారత్‌ దాల్‌’ శనగపప్పు రూ.60 కిలో,  ‘భారత్‌ ఆటా’ గోధుమ పిండి కిలో రూ.27.50 ‘భారత్‌ రైస్‌’ బియ్యం కిలో రూ.29కి విక్రయించేలా ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని