logo

భానుడు భగ్గుమనె..!

ఉమ్మడి జిల్లాపై ఆదివారం భానుడు నిప్పులు చెరిగాడు. ఏడు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Published : 29 Apr 2024 04:36 IST

ఏడు ప్రాంతాల్లో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు

నిర్మానుష్యంగా నల్గొండ క్లాక్‌టవర్‌ సెంటర్‌

మిర్యాలగూడ పట్టణం, నాంపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాపై ఆదివారం భానుడు నిప్పులు చెరిగాడు. ఏడు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు నమోదైన గణాంకాల ప్రకారం రాష్ట్రంలోనే అత్యధికంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. రెండో అత్యధిక ఉష్ణోగ్రతలు నూతనకల్‌, నాంపల్లి, మాడ్గులపల్లిలో 45.4 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఒక్క ఉమ్మడి జిల్లా నుంచే ఏడు ప్రాంతాలు ఉండడం గమనార్హం. ఎండ, వడగాలుల ప్రభావం ఉదయం 10 గంటల నుంచే వీస్తుండడంతో మధ్యాహ్నం 12 గంటలకే రహదారులు జనం లేక వెలవెలబోయాయి.

గంటగంటకూ పెరుగుదల..

ఆదివారం ఉష్ణోగ్రతలు గంటగంటకూ పెరుగుతూ హడలెత్తించాయి. ఉదయం 11 గంటలకే దామరచర్ల మండలం తిమ్మాపూర్‌లో 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. 12 గంటల వరకు నాంపల్లిలో 44.4 డిగ్రీలకు చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాడ్గులపల్లిలో 45.2 డిగ్రీలు, నాంపల్లిలో 45.0 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు రామన్నపేటలో 45.5 డిగ్రీలు, నాంపల్లిలో 45.4 డిగ్రీలు, దామరచర్ల మండలం తిమ్మాపూర్‌, మాడ్గులపల్లిలో 45.2 డిగ్రీలు, అనుముల మండలం ఇబ్రహీంపేట, మోతె మండలం మామిళ్లగూడెంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు నూతనకల్‌లో 45.4 డిగ్రీలు, కట్టంగూరులో సైతం 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని