logo

సినీ ఫక్కీలో ఎల్లయ్య హత్య

గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు.

Updated : 02 May 2024 06:39 IST

హత్యకు గురైన వడ్డె ఎల్లయ్య

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు. ఈ మేరకు ఆయన తహసీలా్దార్‌ ఎదుట లొంగిపోగా సీఐ జానకీరాం కోర్టులో హాజరుపరిచారు. జగ్గయ్యపేటలోని అద్దె ఇంట్లో చారి తన అనూయాయులతో కలిసి ఎల్లయ్యను హత్య చేయడంతో పాటు మృతదేహం దొరకకుండా దూరంగా తరలించారు. మృతదేహం, నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని ఎస్సై సూర్యభగవాన్‌ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లయ్య, చారి జన జీవన స్రవంతిలో మాజీ నక్సలైట్లుగా జీవనం సాగిస్తూ... ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. డబ్బుల విషయమై వారి మధ్య వివాదం ఏర్పడి గొడవలు పెద్దవయ్యాయి. ఎలాగైనా ఎల్లయ్యను హత మార్చాలని నిర్ణయించుకున్న శ్రీకాంతాచారి.. పథకం ప్రకారం.. గత నెల మొదటి వారంలోనే జగ్గయ్యపేట శివారులో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఎల్లయ్యను అక్కడికి రప్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన మహిళను, సూర్యాపేటకు చెందిన ఒకరిని సహ జీవన దంపతులుగా చిత్రీకరించారు. వారి మధ్య నగదు లావాదేవీల వివాదం ఉందని, సెటిల్‌మెంట్‌ చేసేందుకు రావాలని ఎల్లయ్యను జగ్గయ్యపేటకు పిలిచారు. తొలుత ఏప్రిల్‌ 16న జగ్గయ్యపేట బయలుదేరిన ఎల్లయ్యతో పాటు మిత్రుడు అంజయ్య వస్తున్నాడని తెలిసి నిందితుడు అకస్మాత్తుగా ప్లాన్‌ మార్చాడు. 18న రావాలని సూచించాడు. ఆ రోజు దంపతులతో పాటు అనుచరులతో జగ్గయ్యపేట చేరుకున్న నిందితుడు విజయవాడ రోడ్డులోని ఎస్‌జీఎస్‌ కళాశాల సమీపంలోని టీ పాకలో ఎల్లయ్య, అంజయ్యలను కలిశారు. అక్కడ మాట్లాడుకున్నాక.. ఇక్కడ సొమ్ము ఇస్తే బాగుండదని, మహిళకు డబ్బులు ఇచ్చేందుకు దగ్గర్లోని తన ఇంటికి రావాలని ఎల్లయ్యను చారి పిలిచాడు. మహిళతో పాటు అంజయ్యను అక్కడే ఉండమన్నారు. తాను మూత్రశాలకు వెళ్లాలని ఆమె చెప్పడంతో జగ్గయ్యపేట బస్టాండ్‌కి కారులో అంజయ్య తీసుకెళ్లారు. తిరిగి ఆమె రాకపోవడంతో అనుమానంతో అంజయ్య  ఫోన్లు చేశారు. ఎవరూ ఎత్తకపోవడంతో ఎల్లయ్య సోదరుడు సతీష్‌కి విషయాన్ని తెలియజేశారు. అద్దె ఇంట్లో ఎల్లయ్యను తన అనుచరుల సాయంతో చారి చంపేశాడు. మృతదేహాన్ని చేపలు రవాణా చేసే బాక్సులో ఉంచి లారీలో విశాఖపట్నం పంపారు. మృతదేహంతో పాటు వినియోగించిన ఫోన్లు, సిమ్‌ కార్డులు సముద్రంలో పడేసేలా పథకం రూపొందించుకున్నారు. పోలీసులు ప్రస్తుతం వాటి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే 34 కేసుల్లో ముద్దాయైన శ్రీకాంతాచారి ఈ హత్యను తమ ప్రాంతంలో చేస్తే పోలీసులకు దొరికిపోతానని జగ్గయ్యపేటను ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని