logo

కుటుంబ వైద్యం.. దైన్యం

స్థానికులకు మెరుగైన వైద్య సేవలందించటానికి గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు నిర్మాణానికి మూడేళ్ల క్రితం వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Published : 28 Apr 2024 02:37 IST

ప్రచారానికే పరిమితం
వైకాపా ప్రభుత్వ తీరు

వరికుంటపాడు మండలం విరువూరులో ప్రారంభం కాని హెల్త్‌ క్లినిక్‌ భవనం

దుత్తలూరు, వరికుంటపాడు, న్యూస్‌టుడే: స్థానికులకు మెరుగైన వైద్య సేవలందించటానికి గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు నిర్మాణానికి మూడేళ్ల క్రితం వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణాలు చేపట్టి మూడేళ్లవుతున్నా పనులు ముందుకు సాగలేదు. గత ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమం ఇతర సేవలు ప్రచారాలకే పరిమితమయ్యాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వైద్యం అందటం గగనంగా మారింది.

  • ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 93 సచివాలయాలున్నాయి. మొదటి విడతగా 82 ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆరోగ్య కేంద్రాల భవనాలను పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మించాలి. ఒక్కో భవనానికి రూ. 17.50 లక్షల వంతున నిధులు కేటాయించారు. 
  • నియోజకవర్గానికి మంజూరైన 82 భవనాల్లో 54 మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయి. కొన్ని మండలాల్లో భవనాలు పూర్తి అయినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో వాటిని అధికారులకు అప్పగించలేదు. ఆరు భవనాలు  పలు కారణాలతో పనుల ప్రారంభానికే నోచుకోలేదు. 
  • ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానాన్ని(ఎఫ్‌పీˆసీˆ) పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని క్లినిక్‌లను సిద్ధం చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పురోగతి లేదు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొన్ని భవనాల్లో ఎఫ్‌సీˆపీˆ సేవలు కొనసాగుతున్నాయి.
  • వసతికి సంబంధించిన సమస్యలు వేధిస్తుండటంతో వైద్య సిబ్బందితోపాటు స్థానికులుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పాఠశాలల్లోని చెట్ల కింద వైద్య సేవలు అందిస్తున్నారు.

ఆరుబయటే సేవలు

గుండాల కృష్ణారెడ్డి, సోమలరేగడ

దుత్తలూరు మండలం సోమలరేగడలో మూడేళ్ల క్రితం విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌ భవనం మంజూరైంది. అయినా ఇప్పటి వరకు ఈ భవనం పూర్తి కాలేదు. ప్రతి పదిహేను రోజులకొకసారి వైద్య సిబ్బంది వచ్చి పాఠశాల ఆవరణలోనే ఆరు బయట ఉండి స్థానికులకు సేవలందిస్తున్నారు. అరకొర సేవలతో స్థానికులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని