logo

పాలన మరిచిన జగన్‌ట్రాఫిక్‌ కష్టాలు ఈ రీతిన

రోజురోజుకీ వాహనాలు పెరుగుతున్నాయి. వ్యాపార సంస్థలు వెలుస్తున్నాయి. రహదారులేమో విస్తరించడం లేదు. పైగా వీటిని ఆక్రమిస్తున్నారు.

Published : 28 Apr 2024 02:39 IST

రోజురోజుకీ వాహనాలు పెరుగుతున్నాయి. వ్యాపార సంస్థలు వెలుస్తున్నాయి. రహదారులేమో విస్తరించడం లేదు. పైగా వీటిని ఆక్రమిస్తున్నారు. దీంతో రద్దీ సమయాల్లో పాదచారులు నడిచే పరిస్థితి కూడా కనిపించడం లేదు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు చేపట్టేవారు. ప్రస్తుత ప్రభుత్వం వీటిని గాలికొదిలేసింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి.

న్యూస్‌టుడే బృందం

నిత్యం నరకం

కావలి: పట్టణంలోని ఒంగోలు బస్టాండ్‌ సమీపంలో రాత్రి వేళ వాహన రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఒక్కోసారి రాత్రి 9.30 గంటలు దాటినా కూడా పరిష్కారం కాదు. ఇరువైపులా రహదారుల అంచున వ్యాపారులు కొలువుదీరడం, వారి దగ్గర కొనుగోలుకు వచ్చే వారంతా తమ వాహనాలను నడిరోడ్డుపై పెడుతుండడంతో ఎక్కువగా ట్రాఫిక్‌ సమస్య నెలకొంటోంది. ఈపరిస్థితి పట్టణంలోని ట్రంకురోడ్డులో అడుగడుగునా ఉంది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌, ఉదయగిరి వంతెన కూడలి, రైతుబజార్‌ తదితర ప్రాంతాల్లో అడుగు ముందుకు పడడం లేదు. ఉదయగిరి వంతెన కూడలిలో నలుదిక్కులా వెళ్లే వాహనాలు అటూ ఇటూ ఎదురెదురుగా రావడంతో తరచూ నిలిచిపోతున్నాయి. ఈ విషయమై ట్రాఫిక్‌ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంకురోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగిస్తే సమస్య కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.

ఉదయగిరిలో ట్రాఫికర్‌

ఉదయగిరి : పట్టణంలో సీతారామపురం, గండిపాళెం మార్గాల్లో మార్జిన్‌ ఆనుకొని దుకాణాలు ఉన్నాయి. వీటికి వచ్చే వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం లేక రోడ్డుపైనే నిలిపేస్తున్నారు. ఉదయగిరి- సీతారామపురం మార్గంలో కూరగాయల మార్కెట్‌ వద్ద రోడ్డుపై రిక్షాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఆ మార్గంలో రెండు వాహనాలు ఎదురుపడినా రాకపోకలు ఆగిపోతున్నాయి.

ఆగి ఆగి.. ముందుకు సాగి

కందుకూరు గ్రామీణం, కందుకూరు పట్టణం, లింగసముద్రం, ఉలవపాడు, వలేటివారిపాలెం, గుడ్లూరు: కందుకూరు పట్టణంలో తపాలశాఖ, ఎన్టీఆర్‌ కూడళ్లు, అంకమ్మతల్లి ఆలయ మార్గాల్లో ట్రాఫిక్‌తో అంతరాయం ఏర్పడుతోంది. ఈ రహదారుల్లో హోటల్‌, దుకాణాలు ఎక్కువగా ఉండటంతో వాహనాలు రహదారులపైనే ఆపుతున్నారు. అంబేడ్కర్‌ కూడలి నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు, పెద్దబజారులో దుకాణాలుండడంతో.. సరకులతో వచ్చే లారీలు, ఆటోలు ఇక్కడ నిలిపేస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయి. రహదారులు విస్తరిస్తే ఈ సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. 

  • లింగసముద్రంలో ప్రధాన రహదారి విస్తరించకపోవడంతో వాహనాలు ఎదురుపడినప్పడు ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్డు మార్జిన్లలో వాహనాలు నిలపడం వల్ల సమస్య వస్తోంది. 
  • ఉలవపాడులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో దుకాణాలకు వెళ్లేవారు, పాఠశాలలకు వెళ్లేవారు, ఇతర గ్రామాల నుంచి చిల్లర సరకులు, వస్త్ర, ఇతరత్రా దుకాణాలకు వచ్చే వారితో కాస్తంత రద్దీగా ఉంటుంది. దీనికితోడు అక్కడ అటుఇటు నెట్టుడుబండ్లు ఏర్పాటు చేసుకుని చిరువ్యాపారులు కొంత ఆక్రమించారు.
  • గుడ్లూరు ప్రధాన వీధిలో నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. అర కి.మీ. పొడవు ఉన్న ప్రధాన వీధి వెడల్పు కేవలం 15 అడుగులు ఉండటంతో ఎదురుగా వాహనాలు వస్తే తప్పుకునేందుకు వీల్లేకుండాపోయింది. వ్యవసాయ ఉత్పత్తుల కోసం వాహనాలు ఈ మార్గం నుంచే వస్తుంటాయి. దీనికి తోడు ప్రధాన వీధిలో ఆక్రమణలుండటంతోట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. రెండుసార్లు రహదారి వెడల్పును కొందరు నాయకులు అడ్డుకున్నారు. మాలకొండకు ప్రతి శనివారం వేలాది మంది భక్తులు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో వస్తుంటారు. ఆలయ ముఖద్వారం వద్ద చిరు వ్యాపారుల, ఆటోవాలాల వల్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతోంది.

ట్రంకురోడ్డును విస్తరిస్తే: సురేష్‌, బిట్రగుంట

మేము తరచూ కావలి పట్టణానికి వివిధ పనులకు వస్తుంటాం. ట్రాఫిక్‌ అంతరాయంతో సకాలంలో ఇళ్లకు వెళ్లలేకపోతున్నాం. ట్రంకురోడ్డును విస్తరించాలి. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.

ఇబ్బందిపడుతున్నాం: వల్లభ

ఉదయగిరి పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యతో నిత్యం ఇబ్బందిపడుతున్నాం. ఉదయగిరి- సీతారామపురం, - గండిపాళెం మార్గాల్లో సమస్యగా ఉంటోంది. కొందరు వాహనాలను రోడ్లపై ఆపేస్తున్నారు. రహదారులు ఇరుకుగా మారడటంతో వాహన చోదకులు, స్థానికులు ఇబ్బందిపడుతున్నారు.


ఇరుకు రోడ్లతో: రామ్మోహన్‌

పట్టణంలో ప్రధాన రోడ్లు ఇరుకుగా మారడంతో ట్రాఫిక్‌ సమస్య నెలకొంది. కూరగాయల మార్కెట్‌, గండిపాళెం మార్గాల్లో రెండు బస్సులు ఎదురుపడితే దాటే వెసులుబాటు లేదు. నిత్యం ప్రజలు, వాహన చోదకులు అవస్థ పడుతున్నా ఆలకించేవారు లేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని