logo

గురుతర బాధ్యత ఇదేనా జగన్‌!

దేశానికి ఉత్తమ పౌరులను అందించటానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు వైకాపా ప్రభుత్వంలో బోధనేతర పనిభారంతో సతమతమవుతున్నారు.

Published : 28 Apr 2024 02:45 IST

బోధనేతర పనులతో భారం
గుణపాఠం తప్పదంటున్న ఉపాధ్యాయులు

మరుగుదొడ్ల ఫొటోను అప్‌లోడ్‌ చేస్తున్న ఉపాధ్యాయుడు

దేశానికి ఉత్తమ పౌరులను అందించటానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు వైకాపా ప్రభుత్వంలో బోధనేతర పనిభారంతో సతమతమవుతున్నారు.

జిల్లాలో 13 వేలమందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి విద్యార్థులకు బంగారు బాటలు వేయాలనే  భావనతో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారితో మరుగుదొడ్ల ఫొటోలు తీయించడం జగన్‌ పాలనలో పరాకాష్ఠ.

న్యూస్‌టుడే, నెల్లూరు (విద్య), దుత్తలూరు

  • నిత్యం మరుగుదొడ్లు శుభ్రం చేయించడం ఆ ఫొటోను యాప్‌లో పోస్టు చేయడం విధిగా చేయాల్సి వస్తోంది. ఒకవేళ మరుగుదొడ్ల ఫొటోలు అప్‌లోడ్‌ చేయకపోతే సంబంధిత ఉపాధ్యాయులు షోకాజ్‌ నోటీసులు అందుకోవాల్సిందే.
  • గత తెదేపా ప్రభుత్వ హయాంలో పాఠశాలకు ఒకటి వంతున ట్యాబ్‌, బయోమెట్రిక్‌ యంత్రం ఉండేది. సులువుగా సకాలంలో హాజరు వేసుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. ఒకవేళ సాంకేతిక సమస్యలుంటే ఇతర సిబ్బంది పరిష్కరించేవారు. వైకాపా ప్రభుత్వంలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా మారింది.
  • ఉపాధ్యాయుడు సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు ముఖ ఆధారిత యాప్‌లో అది కూడా పాఠశాల ఆవరణలో హాజరు వేయాలి. సమయానికి నిమిషం ఆలస్యమైనా గైర్హాజరు కింద పరిగణలోకి తీసుకుంటారు. ఆ తరువాత తరగతి గదిలోని విద్యార్థుల హాజరు పట్టిక యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. మధ్యాహ్న భోజన వివరాలు, వండిన తరువాత ఆ వంటల చిత్రాలు, విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినే ఫొటో యాప్‌లో పొందుపర్చాలి. 
  • యాప్‌ల వినియోగం, ఆన్‌లైన్‌లో నమోదు తదితర పనులపై 30 శాతం మంది ఉపాధ్యాయులకు అవగాహన ఉంది. 70 శాతం మందికి మాత్రం అంతగా తెలియదు. దాదాపు 20కి పైగా యాప్‌లున్నందున నెట్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు.
  • ఇలా యాప్‌లలో సమాచారాన్ని చేరవేయడంలోనే ఆ రోజు ముగుస్తోంది.
  • ఒకవైపు పిల్లకు సకాలంలో సిలబస్‌ పూర్తి చేయడంతోపాటు పరీక్షలు పెట్టి వాటి ఫలితాలు విడుదల చేయడానికే సమయం ఉండటంలేదని, ఈక్రమంలో నాడు-నేడు పనుల పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఉపాధ్యాయులపై మోపడంతో పనిభారం ఎక్కువై తీవ్ర ఇబ్బందులు పడ్డామని వారు చెబుతున్నారు.
  • ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి యేటా రాష్ట్ర ప్రభుత్వం కాంపొజింట్ గ్రాంటు విడుదల చేయాల్సి ఉంది. సకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతుండటంతో పాఠశాల నిర్వహణ బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై పడింది. దీంతో చాలా మంది ప్రధానోపాధ్యాయులు తమ సొంత నిధులు వెచ్చించారు.
  • ఇలా తమను అనేక ఇబ్బందులు పాల్జేస్తున్నారని గురువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  • ఇక నాడు- నేడు పనుల పర్యవేక్షణ పనులు ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దాంతోపాటు పైఅధికారులు చెప్పే ఆదేశాలు ఎప్పటికప్పుడు పాటించాల్సిందే. ఇవన్నీ చేసిన ఉపాధ్యాయులు ఇక విద్యార్థులకు పాఠాలు చెప్పేదెప్పుడు.. విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శి అయ్యేదెప్పుడన్న విమర్శలు వస్తున్నాయి.
  • పిల్లల వర్క్‌బుక్‌లు కరెక్షన్‌ చేయాలని, ప్రతి విద్యార్థి విద్యాకానుక కిట్లు ధరించి వచ్చేలా చూడాలని, దీనికితోపాటు ట్యాబ్‌లు పనిచేయకపోయినా... వాటిని నిర్దేశిత గంటలు విద్యార్థులు చూడకపోయినా దానికి తమను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించడంతో ఉపాధ్యాయుల అవస్థలు వర్ణణాతీతం.

గతంలో ఎన్నడూ లేదు

నరసింహరావు, ఉపాధ్యాయుడు

గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఉపాధ్యాయులపై ఇలాంటి పనిభారం పడలేదు. ప్రభుత్వం నిర్దేశించిన యాప్‌లలో వివిధ రకాల ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంలోనే చాలా సమయం గడిచిపోతోంది. పనిభారం ఎక్కువ అవటంతో విద్యార్థులకు పాఠాలు బోధించే సమయంలో ఏకాగ్రత పెట్టలేకపోతున్నాం. దీనికితోడు నాడు- నేడు పనులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఉపాధ్యాయులనే బాధ్యులను చేయడం దారుణం.

బోధన కుంటుపడుతుంది

మాస ప్రసాద్‌ బీటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి

యాప్‌లు తగ్గించమని అడిగితే ఇంకా పెంచారు. దీనివల్ల బోధనలో వెనుక బడుతున్నాం. పాఠశాలకు వచ్చింది మొదలు యాప్‌లలో నమోదు చేయడానికే సమయం సరిపోతుంది. ప్రస్తుతం విద్యార్థుల మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని