logo

నేరాలు.. ఘోరాల్లో జగన్‌ పీహెచ్‌డీ!

ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, విడవలూరు, న్యూస్‌టుడే: ‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ల్యాండ్‌, ఇసుక, మైన్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్రచందనం కుంభకోణాలకు చిరునామాగా మారింది.

Published : 28 Apr 2024 02:57 IST

ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం ‘ప్రజాగళం’ సభల్లో చంద్రబాబు ధ్వజం

ఈనాడు, నెల్లూరు: ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, విడవలూరు, న్యూస్‌టుడే: ‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ల్యాండ్‌, ఇసుక, మైన్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్రచందనం కుంభకోణాలకు చిరునామాగా మారింది. నేను ఏ తప్పు చేయకపోయినా అరెస్టు చేశారు. అంటే.. ప్రశ్నిస్తే దాడులు, అరెస్టులు చేస్తారా? జగన్‌కు నాకు శతృత్వం ఏంటి? వైఎస్‌, నేను ఒకప్పుడు మిత్రులం. రాజకీయంగా రెండు పార్టీల్లో పోరాడాం. వ్యక్తిగతంగా ఎప్పుడూ పోలేదు. ఇప్పుడు తెదేపా అంటే పథకాలు కట్‌ చేయడం, వారి భూములు లాక్కునే పరిస్థితికి దిగజారారు. నార్త్‌ కొరియాలో నవ్వినా, ఏడ్చినా, పండగ చేసుకున్నా కిమ్‌ కొడతాడు. అలాగే ఏపీలో జగన్‌.. నేరాలు, ఘోరాల్లో పీహెచ్‌డీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెంలో శనివారం జరిగిన ‘ప్రజాగళం’ సభల్లో ఆయన మాట్లాడారు. ‘ప్రజల ఆస్తులపై జగన్‌ బొమ్మలేంటి? పొలంలోనూ ఆయన బొమ్మే. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల భూములను కంప్యూటరీకరిస్తామంటున్నారు. పట్టాదారు పుస్తకం, అడంగల్‌ ఉండదు. వాటి ‘కీ’ మాత్రం జగన్‌ దగ్గర ఉంటుంది. అంటే మీ ఆస్తికి భద్రత లేనట్టే. ఒంటిమిట్టలో అప్పులు కట్టుకుందామని తనకున్న 4 ఎకరాలు అమ్ముకుందామనుకుంటే.. కాగితాల్లో సంబంధిత రైతు పేరు లేదు. ఎవరి చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుంది. చిన్న పిల్లలతో గంజాయి అమ్మిస్తున్నారని దిల్లీలో శ్రీలక్ష్మీ అనే మహిళబొటన వేలు నరుక్కుంది. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే మన తల మనమే నరుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఆత్మకూరులో వేదిక వద్దకు వస్తున్న చంద్రబాబుకు జన సైనికుల ఘన స్వాగతం

ఇచ్చిందెంత? దోచిందెంత?

‘జగన్‌రెడ్డి ఎక్కడ చెప్పినా.. సంక్షేమ పథకాలు ఇస్తున్నానని ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు అయిదేళ్లలో ఆయన ఇచ్చిందెంత? దోచిందెంత? ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, కరెంట్‌ ఛార్జీలు, చెత్త మీద పన్ను, పన్నుల భారం పెంపు.. ఇలా ఇచ్చింది రూ. పది. దోచింది రూ. 100.. అంతకంటే ఎక్కువగా జగన్‌రెడ్డి రూ.వేయి దోచుకున్నారు. అమ్మ ఒడిని నాన్న బుడ్డిగా మార్చారు. కరెంట్‌ ఛార్జీలు తగ్గిస్తానని
పది సార్లు పెంచారు. రూ. 14లక్షల కోట్ల అప్పు చేసి, ఒక్కొక్కరిపై రూ. లక్షల భారం వేశారు’ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓ సీనియర్‌ నాయకుడిగా చెబుతున్నా.. తెదేపా హయాంలో హైదరాబాద్‌ మహానగరంగా రూపుదిద్దుకుంది. ఆ తర్వాత అలాంటి నగరం నిర్మించి తెలుగుజాతి రుణం తీర్చుకోవాలని అమరావతి కట్టాలనుకున్నాను. నేడు జగన్‌ సర్వనాశనం చేశారు. సీపీఎస్‌ వారంలో రద్దు చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు. సూపర్‌-6 పథకాలను వివరించారు. ఆనం రామనారాయణరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డిలను గెలిపించాలని కోరారు.

బుచ్చిరెడ్డిపాళెం: ప్రజాగళం సభలో మాట్లాడుతున్న చంద్రబాబు.. చిత్రంలో వేమిరెడ్డి దంపతులు, దినేష్‌రెడ్డి

పర్సంటేజీ ఇస్తేనే.. ఎమ్మెల్యే ‘ప్రసన్న’ం!

‘కోవూరు ఎమ్మెల్యే పేరు ప్రసన్న కాదు.. పర్సంటేజ్‌ ఎమ్మెల్యే. ప్రసన్నను ప్రసన్నం చేసుకుంటేనే ఇక్కడ పనులు జరుగుతాయి. లేఅవుట్‌ వేయాలన్నా.. ఎకరాకు రూ.5 లక్షలు ఇవ్వాలి. కనిగిరి రిజర్వాయరు గ్రావెల్‌ తవ్వేశారు. ఇప్పుడు గోవా, పుదుచ్చేరి నుంచి మద్యం తెప్పిస్తున్నారు. రూ.వేయి కోట్ల చక్కెర కర్మాగార స్థలాన్ని కొట్టేయాలని చూశారు. ప్రశాంత కోవూరును.. గొడవలు, కబ్జాలకు నిలయంగా మార్చారు’ అని విమర్శించారు. తెదేపా అధికారంలోకి వస్తే.. కనిగిరి రిజర్వాయరు పూడిక తీయిస్తామని, జొన్నవాడ మల్లికార్జున ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పోలంరెడ్డి దినేశ్‌రెడ్డి, ఆయన తండ్రి శ్రీనివాస్‌రెడ్డిలు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. వారికి న్యాయం చేస్తామన్నారు.

మెట్టుకూరుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు

ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డే.. పెత్తనమంతా వెంకటేశ్వరరెడ్డిది

‘ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి పేరుకే.. పెత్తనమంతా వెంకటేశ్వరరెడ్డిది. కాంట్రాక్టులు, ఇసుక, ఎర్రచందనం, లేఅవుట్స్‌ దోపిడీ చేస్తున్నారు. పెన్నానదిని దోచేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ కాంప్లెక్స్‌లో సొంతంగా కాంప్లెక్స్‌లు కట్టుకుంటారు’ అని చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే  సోమశిల హైలెవల్‌ కెనాల్‌ పూర్తి చేస్తామని, ఆత్మకూరు అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. జగన్‌ నొక్కే బటన్‌ మన ఇంట్లో అమ్మమ్మ, నాన్నమ్మ, చిన్న పిల్లలు కూడా నొక్కుతారని, ప్రజలు నొక్కే బటన్‌ మీ జీవితాలను మార్చేస్తుందన్నారు. రూ. 500, రూ. 1000, క్వార్టర్‌ బాటిల్‌, బిర్యానీలకు కక్కుర్తి పడితే మన పిల్లల జీవితం నాశనం అవుతుందనే విషయాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలన్నారు.

బుచ్చిరెడ్డిపాళెం : ప్రజలకు తెదేపా అధినేత అభివాదం..

 

ప్రసన్నకు ప్రజలంతా బైబై చెప్పాలి

ప్రశాంతగా ఉండే కోవూరు నియోజకవర్గాన్ని ప్రసన్నకుమార్‌రెడ్డి అవినీతిమయంగా మార్చారు. చక్కెర కర్మాగారం రైతులకు పరిహారం అందించకుండా.. వారు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తీసుకువచ్చారు. విశాఖలో భూములు కాజేసిన విజయసాయిరెడ్డి ఇఫ్కో భూములు కాజేసేందుకు చూస్తున్నారు. ప్రసన్నకు రాజకీయ భిక్ష పెట్టింది తెదేపానేనని మర్చిపోయి.. విమర్శిస్తున్నారు. తెదేపా అధికారంలోకి రాగానే పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.  

ప్రశాంతిరెడ్డి, కోవూరు అభ్యర్థి


తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి

చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్టే. మంచి విజన్‌ ఉన్న నాయకుడు. పాలసీల్లో పారదర్శకత ఉంటుంది. అవినీతి రహిత పాలన అందించేందుకే రాజకీయాల్లోకి వచ్చాం. ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తెదేపా ప్రభుత్వం తీసుకుంటుంది. 

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి


ఆసుపత్రిని 250 పడకలుగా మారుస్తాం

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా ఆసుపత్రిని 250 పడకల స్థాయికి అభివృద్ధి చేస్తాం. సోమశిల హైలెవల్‌ కెనాల్‌, నడికుడి-కాళహస్తి రైల్వే లైన్‌ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడుకు విన్నవిస్తున్నా. మెట్ట ప్రాంతాల ప్రజలకు సాగు, తాగునీరు కల్పించే బాధ్యతను తీసుకుంటాం. సోమశిల రక్షణ పనులను వెంటనే పూర్తి చేయిస్తాం.  

ఆనం రామనారాయణరెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని