logo

ఆత్మస్తుతి.. హామీల ఊసేది

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు.

Published : 29 Apr 2024 04:42 IST

కందుకూరు అభివృద్ధిని మరిచిన ముఖ్యమంత్రి
ప్రసంగం.. విమర్శలకే పరిమితం
ఈనాడు, నెల్లూరు: కందుకూరు పట్టణం, గ్రామీణం, గుడ్లూరు, వలేటివారిపాళెం, న్యూస్‌టుడే

న్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు. గతంలో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో చెబుతారని, ఈ సారి కొత్తగా ఏమైనా వరాలు ప్రకటిస్తారేమోనని భావించిన వారికి నిరాశ తప్పలేదు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ముఖ్యమంత్రి ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, పర నిందలతోనే సరిపోయింది. కనీసం కందుకూరు పేరు ఎత్తకుండా కార్యక్రమాన్ని ముగించడంపై తీవ్ర విమర్శలు వినిపించాయి. సీఎం హోదాలో తొలిసారి కందుకూరు పట్టణానికి వస్తున్నందున.. నియోజకవర్గ అభివృద్ధి గురించి కీలక హామీలు ఇస్తారని అంతా భావించారు. అటువంటివి ఏమీ లేకుండానే, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.

జగన్‌ ప్రసంగిస్తుండగానే.. వెనుదిరిగిన ప్రజలు

సభ జరుగుతుండగానే.. వెనుదిరిగిన జనం

జగన్‌ ఎన్నికల ప్రచార సభకు గ్రామాల నుంచి వచ్చిన మహిళలు, ప్రజలు.. వచ్చామా! నాయకులకు కనిపించామా! అక్కడి నుంచి వెళ్లామా!! అన్నట్లు కనిపించింది. సభ ప్రారంభమైనప్పటి నుంచే మహిళలు అధిక సంఖ్యలో వెనుదిరిగారు. సభకు జనాన్ని తరలించేందుకు నాయకులకు పోలింగ్‌ కేంద్రాల వారీగా రూ. 30వేల వరకు  ఖర్చులకు ఇచ్చినట్లు కొందరు వైకాపా నాయకులే చెప్పుకొన్నారు. మహిళలకు రూ.500, పురుషులకు రూ. 300, మద్యం సీసా ఇచ్చేలా ఒప్పందం చేసుకుని తీసుకువచ్చారు. సభా ప్రాంగణం సమీపంలో కొందరు నాయకులు ఆయా గ్రామాల వారు ఎవరెవరు వచ్చారో వివరాలు నమోదు చేసుకుంటూ కనిపించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన వారికి రూ. 200 చొప్పున పెట్రోల్‌ పోయించారు. పామూరు రోడ్డులోని దుకాణాల వెనుక.. వైకాపా నాయకులు మద్యం తాగుతున్న దృశ్యాలు కనిపించాయి. మధ్యాహ్నం నుంచి బస్సులను పట్టణంలోకి రాకుండా అడ్డుకోవడంతో పామూరు, లింగసముద్రం, వలేటివారిపాలెం వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఊరి చివరి వరకు నడిచి.. అక్కడి నుంచి వెళ్లారు. అంకభూపాలపురం ప్రాథమిక పాఠశాల వంట ఏజెన్సీ నిర్వాహకులు వైకాపా నాయకులతో కలిసి సభకు వచ్చారు. కొండి కందుకూరు గ్రామ క్షేత్రసహాయకులు హాజరయ్యారు.

వైకాపా కండువాలతో బార్‌లో మద్యం తాగుతున్న కార్యకర్తలు.. నగదు ఇచ్చేందుకు.. గ్రామాల నుంచి వచ్చిన వారి పేర్ల నమోదు

పదేళ్లుగా కనిగిరి నియోజకవర్గంలో ఉండటంతో.. వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ కనిగిరి మరిచిపోలేకున్నారు. ఆదివారం కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వచ్చే ముందు వైకాపా పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి విజయసాయిరెడ్డితో కలిసి ప్రసంగించారు. మాట్లాడటం ప్రారంభించగానే.. అందరికీ స్వాగతం పలుకుతూ.. నేడు కనిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అని.. వెంటనే సరిదిద్దుకుని కందుకూరు నియోజకవర్గంలో అని అనడంతో.. సభకు హాజరైన వారు.. కనిగిరిని మరిచిపోలేకుండా ఉన్నారని, రేపు ఇక్కడేం చేస్తారోనని చర్చించుకోవడం కనిపించింది.


నాడు అలా.. నేడిలా..

ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయాన 2018 ఫిబ్రవరిలో కందుకూరుకు వచ్చిన జగన్‌.. నియోజకవర్గానికి కీలకమైన రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధి, కాలువల మరమ్మతులు, రామాయపట్నం ఓడరేవు తదితరాలను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామని హామీలిచ్చారు. సీఎం అయ్యాక.. 2022 జులైలో రామాయపట్నం ఓడరేవు భూమి పూజకు వచ్చిన సందర్భంలో పట్టణంలో మౌలిక వసతుల కల్పన, బైపాస్‌, రాళ్లపాడు ఎడమ కాలువ పొడిగింపు, కరేడు పీహెచ్‌సీకి నూతన భవనం వంటి వాటిపై హామీ ఇచ్చారు. ఇచ్చిన వాటిలో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కందుకూరుకు వచ్చిన జగన్‌.. వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గత హామీల సంగతి సరేలే అనుకున్నా.. నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తామో కూడా కనీసం ప్రస్తావించలేదు. కేవలం తానుంటేనే పథకాలు వస్తాయని, ఇంకెవరూ ఇవ్వరంటూ ఉపన్యసించారు. ప్రతిపక్ష నాయకులను విమర్శించడానికే వచ్చారన్నట్లు మాట్లాడి.. ప్రసంగం ముగించడం ప్రజలను నిరాశ పరచింది. జగన్‌ సభా ప్రాంగణానికి రాకముందు.. నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రాళ్లపాడు ఎడమ కాలువ పనులు వేగవంతం చేయాలని, వెలిగొండ నుంచి 1.5 టీఎంసీ రాళ్లపాడుకు వచ్చేలా, కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేందుకు పరిశీలించాలని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ తదితరాలపై సీఎంకు అర్జీ ఇవ్వనున్నట్లు తెలిపారు. కనీసం వాటి గురించి కూడా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడలేదు.


ఎండ వేడిమికి.. అల్లాడిన జనం

జగన్‌మోహన్‌రెడ్డి సభ షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఉండటంతో.. అంతకంటే అరగంట ముందే నాయకులు జనాలను అక్కడికి ఆటోల్లో తరలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. కొందరు దుకాణాల నీడన సేదతీరారు. జగన్‌ వచ్చే వరకు అక్కడే ఉన్న జనం.. ఆయన బస్సు ఎక్కి ప్రసంగం ప్రారంభించగానే.. అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని