logo

తెదేపా ప్రభంజనం ఖాయం

‘నెల్లూరు జిల్లాలో తెదేపా ప్రభంజనం ఖాయం.  ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డితో పాటు.. నెల్లూరు నగర, గ్రామీణ ఎమ్మెల్యేలుగా నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను గెలిపించండి.

Published : 02 May 2024 04:13 IST

అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత తీసుకోండి
నెల్లూరును ట్రిపుల్‌ ఇంజిన్‌ స్పీడ్‌తో అభివృద్ధి చేస్తాం
యువగళంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు, నెల్లూరు: స్టోన్‌హౌస్‌పేట, న్యూస్‌టుడే: ‘నెల్లూరు జిల్లాలో తెదేపా ప్రభంజనం ఖాయం.  ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డితో పాటు.. నెల్లూరు నగర, గ్రామీణ ఎమ్మెల్యేలుగా నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను గెలిపించండి. నగరాన్ని డబుల్‌ ఇంజిన్‌ కాదు.. త్రిబుల్‌ ఇంజిన్‌ వేగంతో అభివృద్ధి చేస్తాం’ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. విశాఖలో ఖాళీ భూములు కబ్జా చేసిన వ్యక్తి.. నెల్లూరులో పోటీ చేస్తున్నారని, ఆయనకు అవకాశమిస్తే మీ ఇంటి పైకప్పు కూడా ఎత్తుకెళతారని ధ్వజమెత్తారు. బుధవారం నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో నిర్వహించిన యువగళం సభలో లోకేశ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఫ్రెడ్రిక్‌ దేవరంపాటి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. పెద్దఎత్తున యువతీ యువకులు పాల్గొని లోకేశ్‌తో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? సంపద ఎలా సృష్టిస్తారనే విషయాలను అడగడంతో పాటు ఉద్యోగాల కల్పనకు తీసుకోబోతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

అభ్యర్థులతో స్వీయచిత్రం

మూడేళ్లలో విమానాశ్రయం

‘2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమం, అభివృద్ధిని సమంగా ముందుకు తీసుకువెళ్లారు. 200 పింఛను రూ.2వేలు చేశారు. పరిశ్రమలు తీసుకొచ్చారు. ఆదాయాన్ని వృద్ధి చేశారు. అధికారంలోకి వచ్చాక.. అదే ఒరవడిని కొనసాగిస్తాం. గతంలో కృష్ణాకు హెచ్‌సీఎల్‌, చిత్తూరుకు జోహో వంటివి తీసుకువచ్చాం. ఈసారి నెల్లూరుకు ఐటీతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్‌ సంస్థలు తెచ్చే బాధ్యత నాది. కర్నూలులో ఎయిర్‌ పోర్టు కట్టింది. విజయవాడ విమానాశ్రయాన్ని విస్తరించి చంద్రబాబునాయుడే. ఆఖరికి భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ చేసి.. జీఎంఆర్‌కు ఇచ్చింది కూడా చంద్రబాబే. నెల్లూరుకు ఇంకా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. తెదేపా అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లలో నెల్లూరుకు విమానాశ్రయం తీసుకువస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తూ..

గెలుపు తథ్యం

‘నెల్లూరు నగరంలో నారాయణ రూ. 4,500 కోట్లతో అభివృద్ధి చేశారు. పేదలకు నాలుగు వేల ఇళ్లు నిర్మించారు. 43వేల ఇళ్లకు శంకుస్థాపన చేశారు. భూగర్భ డ్రైనేజీ పెండింగ్‌ పనులు పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం వైకాపా. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెదేపాకు పదికి పది ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం. పెట్టుబడులు తీసుకొచ్చి.. ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడి ఉత్సాహం చూస్తుంటే.. తెదేపా విజయ ఢంకా మోగించడం ఖాయమైపోయినట్టుంది. రూ. 3వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు డీఆర్‌డీవో ముందుకొచ్చింది. ఇప్పటి ముఖ్యమంత్రి తీరుతో పక్క రాష్ట్రానికి వెళ్లింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా నెల్లూరుకు సెంబ్‌ కార్ప్‌ వంటి పరిశ్రమలు తెచ్చాం. కేవలం రాజధాని తరలిస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరగద’ని లోకేష్‌ అన్నారు.

అభిప్రాయాలురాసి డబ్బాలో వేస్తూ..

యువత ప్రశ్నలు- లోకేశ్‌ సమాధానాలు

? పింఛను ఇంటికి రాకపోవడానికి కారణం మీరేనని వైకాపా అంటోంది. అధికారంలో ఉండి కూడా ఆ పార్టీకి చేతగావడం లేదని మీరంటున్నారు? ఏది నిజం?  - అనిత
⇒ లోకేశ్‌: నిజం గడపదాటే లోపు అబద్ధం ప్రపంచం చుట్టి వస్తోంది. వాలంటీర్లను ప్రభుత్వ బాధ్యతల నుంచి ఈసీ దూరం పెట్టింది. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు అందించాలని మేము డిమాండ్‌ చేశాం. అయినా సీఎస్‌ పట్టించుకోలేదు. నెల రోజులు ఓపిక పట్టండి. మీ ఇంటికే పింఛను, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం.
? వీఆర్‌ కళాశాలకు గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు మూత పడింది. తిరిగి ప్రారంభిస్తారా? వీఆర్‌ గ్రౌండ్‌ను స్పోర్ట్‌ యాక్టివిటీకి మాత్రమే వినియోగించేలా చూడాలి. జాబ్‌ స్కిల్స్‌ అప్‌ గ్రేడ్‌ చేయాలి  -  నజమ్‌ మహ్మద్‌
⇒ లోకేశ్‌: వీఆర్‌ కళాశాల విషయంలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. విద్య విషయంలో కేజీ నుంచి పీజీ వరకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చర్యలు చేపడతాం.


యువతుల సంబరం


నెల్లూరు : ప్రజాగళం సభలో యువత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని