logo

పట్టణాల్లోనే అధికం

కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే రెండోరోజైనా శనివారం కొనసాగింది. ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఏలతో కూడిన 1240 బృందాలు ఇందులో

Published : 23 Jan 2022 04:19 IST

4,164 మందిలో లక్షణాలు గుర్తింపు

జిల్లా కేంద్రంలో ఇంటింటి సర్వే చేస్తున్న సిబ్బంది

ఈనాడు, నిజామాబాద్‌, న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం : కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే రెండోరోజైనా శనివారం కొనసాగింది. ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఏలతో కూడిన 1240 బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి. మండలానికో నోడల్‌ ఆఫీసర్‌ను నియమించి పర్యవేక్షిస్తున్నారు. రెండ్రోజుల్లో 225965 ఇళ్లలో 846154 మందిని పరిశీలించగా 4164 మంది జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

ఇంటింటికి వెళ్లి..
వ్యాధి లక్షణాలున్నవారు పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ప్రయాణాలు చేసిన వారు, బయట పనులకు వెళ్లే వారే ఉన్నట్లు సర్వేను పర్యవేక్షిస్తున్న ఓ అధికారి తెలిపారు. ప్రతి ఆశా కార్యకర్త వారికి కేటాయించిన ఇంటికి వెళ్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయా అని అడుగుతున్నారు. థర్మామీటర్‌, ఆక్సీమీటర్‌ తీసుకెళ్తున్నారు. లక్షణాలున్న వారికి హోం ఐసోలేషన్‌ కిట్‌ ఇస్తున్నారు. మారుమూల గ్రామమైతే ర్యాపిడ్‌ కిట్‌తో పరీక్ష చేస్తున్నారు. పెద్ద గ్రామాలైతే దగ్గర్లోని  పీహెచ్‌సీలకు వెళ్లి పరీక్షలు చేసుకోమని సూచిస్తున్నారు.

టీకా ఇస్తూ..
జ్వర సర్వేలోని బృందాలు ఇళ్లకు వెళ్లిన సందర్భాల్లో టీకా తీసుకోని 15 నుంచి 18 ఏళ్ల వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరికి కొవాగ్జిన్‌ వేస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన వారిలో రెండో డోసు వివరాలు ఆరా తీసి అక్కడికక్కడే టీకా ఇస్తున్నారు.

మొక్కుబడిగా పనిచేయొద్దు
‘దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జ్వర సర్వే జరుగుతోంది. దీన్ని మొక్కుబడిగా చేసి.. ఊరికే కూర్చొని లెక్కలు చెబితే కార్యక్రమం లక్ష్యం నెరవేరదంటూ’ అధికారులను ఉద్దేశించి మంత్రి చురకలంటించారు. కరోనా సమీక్షలో భాగంగా జ్వరాల సర్వేపై మాట్లాడారు. ఓ గ్రామానికి వెళ్లి సర్వే తీరును పరిశీలించగా ఆశా కార్యకర్త, ఏఎన్‌ఏం గతేడాది నివేదిక చూపారని పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోతే ఇలాంటివే జరుగుతాయన్నారు. కిందిస్థాయి సిబ్బంది కొవిడ్‌ రెండు దశల్లో బాగా పనిచేశారన్నారు.

లెక్కలు తెలియకుంటే ఎలా?
ఆర్మూర్‌ పట్టణంలో టీకా అర్హులు ఎంత మంది? ఇప్పటివరకు ఎందరు తీసుకున్నారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ను ప్రశ్నించారు. ఆయన చెప్పలేకపోవడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే లక్ష్యాన్ని ఎలా చేరుకుంటామన్నారు. టీకా పంపిణీ తక్కువగా జరిగిన చోట ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని