logo

ఓటమి నుంచి విజయం వైపు

ఉమ్మడి జిల్లా నుంచి గతంలో శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి 2018 ఎన్నికల్లో నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం నుంచి అదే పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

Published : 04 Dec 2023 04:11 IST

న్యూస్‌టుడే - నిజామాబాద్‌ నగరం, ఇందూరు సిటీ, కామారెడ్డి పట్టణం, బాన్సువాడ, డిచ్‌పల్లి

విజయసంకేతం చూపుతున్న ధన్‌పాల్‌ సూర్యనారాయణ

ఉమ్మడి జిల్లా నుంచి గతంలో శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి 2018 ఎన్నికల్లో నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం నుంచి అదే పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి ధన్‌పాల్‌ సూర్యనారాయణ (భాజపా- 2014), కామారెడ్డి నుంచి వెంకటరమణారెడ్డి (భాజపా -2018) పోటీ చేసి పరాజయం పొందారు. మరోవైపు పైడి రాకేష్‌రెడ్డి (ఆర్మూర్‌ - భాజపా), మదన్‌మోహన్‌ (ఎల్లారెడ్డి - కాంగ్రెస్‌), లక్ష్మీకాంతారావు (జుక్కల్‌ -కాంగ్రెస్‌) తొలిసారి శాసనసభ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు.

ధన్‌పాల్‌ సూర్యనారాయణ: నిజామాబాద్‌కు చెందిన ధన్‌పాల్‌ సూర్యనారాయణ వ్యాపారవేత్తగా సుపరిచితులు. 1984లో విశ్వహిందూ పరిషత్‌లో సాధారణ సభ్యుడిగా చేరి.. జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2014లో భాజపా సభ్యత్వం తీసుకొని రాజకీయ ప్రవేశం చేశారు. అదే ఏడాది నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి బరిలో దిగారు. ఆ ఎన్నికలో భారాస అభ్యర్థి గణేశ్‌గుప్తా గెలుపొందారు. 2018లో అసెంబ్లీ బరిలో దిగేందుకు అవకాశం రాలేదు. ఈ సారి మాత్రం పార్టీ అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపింది. ఈ ఎలక్షన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై 14,620 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

వెంకటరమణారెడ్డి ప్రస్థానం ఇదీ..

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: 2018లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డికి 15,439 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన రమణారెడ్డికి ప్రస్తుతం నాలుగింతల ఓట్లు వచ్చాయి. గతంలో ఈయన కామారెడ్డిలో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమి చెందారు. 2006లో తాడ్వాయి మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2008 నుంచి 2011 వరకు ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. 2011లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. 2013 వరకు ఆ పార్టీ జిల్లా కన్వీనర్‌గా ఉన్నారు. 2014 నుంచి కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2018 ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు. ఆయన ప్రస్తుత విజయానికి అనేక కారణాలున్నాయి. డ్వాక్రా మహిళల సమస్యలపై పోరాటం చేశారు. నవయువ భేరి ఏర్పాటు చేసి యువతలో చైతన్యం కలిగించారు. కొవిడ్‌ వేళ ప్రజలకు ఆపన్న హస్తం అందించారు. కామారెడ్డిలో అవినీతి, అక్రమ దందాలపై ప్రజాదర్బార్‌ నిర్వహించి తనదైన మార్క్‌ను చూపారు. రెండు   పడక గదుల ఇళ్ల విషయంలో పోరాటం చేశారు. మాస్టర్‌ప్లాన్‌పై అలుపెరగని పోరాటం చేశారు.

భూపతిరెడ్డిని ఎత్తుకుని ఆనందం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు

భూపతిరెడ్డి : వైద్యుడిగా సుపరిచితుడైన డా.భూపతిరెడ్డి 2001లో తెరాస (ఇప్పటి భారాస)లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి భారాస అధినేత కేసీఆర్‌కు దగ్గరయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదనే నిరాశతో పార్టీ వీడారు. కొద్ది నెలలకే తిరిగి తెరాసలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో తెరాసలో చేరిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు టికెట్‌ దక్కింది. అప్పటి వరకు టికెట్‌ ఆశించిన భూపతిరెడ్డికి భరోసా ఇచ్చిన కేసీఆర్‌ తెరాస అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వివిధ కారణాలతో మూడేళ్ల పదవీ కాలం ఉన్నా ఎమ్మెల్సీ పదవికి, తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ఉద్యమ నాయకుడిగా, వైద్యుడిగా సేవలందించడం, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారనే సానుభూతి భూపతిరెడ్డి విజయానికి దోహదం చేశాయి.


కొనసాగిన సంప్రదాయం

న్యూస్‌టుడే, డిచ్‌పల్లి: గతంలో ఆర్టీసీ ఛైర్మన్‌గా పని చేసిన నేతలు.. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవనే సంప్రదాయం ఉంది. కాగా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా ఆర్టీసీ ఛైర్మన్‌గా పని చేశారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. దీంతో ఆర్టీసీ ఛైర్మన్‌ సెంటిమెంట్‌ కొనసాగిందనే ప్రచారం సాగుతోంది. బాజిరెడ్డి గోవర్ధన్‌ గతంలో ఆర్మూర్‌, బాన్సువాడ ఎమ్మెల్యేగా పని చేశారు. తెరాస(ఇప్పటి భారాస)లో చేరి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకం, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో హ్యాట్రిక్‌ విజయం సాధిస్తాననే ధీమాతో ముందుకుసాగారు. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థి డా.భూపతిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఈ సారి గెలిచి భారాస ప్రభుత్వం అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి వస్తుందని, జిల్లాలో తానొక్కడినే బీసీ అభ్యర్థిని అంటూ ఆయన చేసిన ప్రచారం ఫలించలేదని చెప్పొచ్చు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేగా.. మాస్‌ నేతగా పేరొందారు.


గెలుపు సంఖ్య పెంచుకుంది వీరే..

న్యూస్‌టుడే, బాన్సువాడ: ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి తమ గెలుపు సంఖ్యను మరోసారి పెంచుకున్న నాయకులు ముగ్గురు ఉన్నారు. వారిలో బాన్సువాడ నియోజకవర్గ భారాస అభ్యర్థి, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏడోసారి (1994, 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018, 2023) విజయం సాధించారు. బాల్కొండ నియోజకవర్గ భారాస అభ్యర్థి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మూడోసారి (2014, 2018, 2023) గెలుపొందారు. బోధన్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నాలుగోసారి (1999, 2004, 2009, 2023) విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని