logo

విధేయతకు అవకాశం

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ విధేయతను కాంగ్రెస్‌ అధిష్ఠానం గుర్తించింది. ఆయనను శాసనమండలికి పంపాలని నిర్ణయించింది.

Updated : 18 Jan 2024 06:41 IST

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహేష్‌కుమార్‌ గౌడ్‌

ఈనాడు, నిజామాబాద్‌: పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ విధేయతను కాంగ్రెస్‌ అధిష్ఠానం గుర్తించింది. ఆయనను శాసనమండలికి పంపాలని నిర్ణయించింది. ఈ నెల 29న జరిగే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థుల గెలుపు లాంఛనమే కానుంది. జిల్లా నుంచి సీనియర్‌ నేతగా ఉన్న మహేష్‌ కుమార్‌గౌడ్‌ ఎన్‌ఎస్‌యూఐలో విద్యార్థి నాయకుడిగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం కల్పించింది.

చివరి నిమిషంలో  మార్పు

రెండు స్థానాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు గురువారం ఆఖరు రోజు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం పోటీకి నిలిపే ఇద్దరు అభ్యర్థుల విషయంలో మంగళవారమే నిర్ణయం తీసుకుంది. అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌కు దిల్లీ నేతల నుంచి ఈ మేరకు ఫోన్‌లో సమాచారం కూడా ఇచ్చారని చెప్పారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని చెప్పుకొచ్చారు. వీరిద్దరు బుధవారమే నామినేషన్లు వేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, బుధవారం మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల అధికారిక ప్రకటన వెలువడింది. అనూహ్యంగా అద్దంకి దయాకర్‌కు బదులు మహేష్‌కుమార్‌ గౌడ్‌ పేరు ఉంది. ఈ మార్పునకు కారణాలను పార్టీగాని, మహేష్‌కుమార్‌ గౌడ్‌ గాని చెప్పలేదు.

మాట  ఇచ్చినందుకే

పార్టీలో విధేయుడిగా ఉన్న మహేష్‌కుమార్‌ గౌడ్‌కు అధిష్ఠానం కొంతకాలం క్రితం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చింది. ఇవి చూస్తూనే ఆయన నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. టికెట్‌ కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ, రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో పోటీ చేయాలని అధిష్ఠానం నిర్ణయించడంతో అక్కడి షబ్బీర్‌ అలీకి నిజామాబాద్‌ అర్బన్‌ సీటు కేటాయించారు. ఈ సందర్భంలో మహేష్‌కు పార్టీ పెద్దలు రానున్న రోజుల్లో పదవిపై హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఆ మాట ప్రకారమే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

రాజకీయ  ప్రస్థానం

ఎన్‌ఎస్‌యూఐ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా పని చేశారు. యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శిగా, పీసీసీ కార్యదర్శిగా పని చేశారు. పీసీసీ అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధానకార్యదర్శిగా పని చేసి ప్రస్తుతం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా 2013-14 వరకు, 1994లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి, 2014లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడి పోయారు.

ఇతర పదవులు

పరిమళ పేపర్‌ బోర్డు లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్‌గా, బొమ్మ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించిన ఆయన తెలంగాణ స్పోర్ట్స్‌ కరాటే అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని