logo

హలో పురపాలిక

 ‘హలో మేము పాత బాన్సువాడ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పైపులైను పగిలి నీటి సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోండి

Updated : 20 Apr 2024 06:52 IST

సమస్యల పరిష్కారానికి బాన్సువాడ బల్దియా ప్రత్యేక కార్యాచరణ

బాన్సువాడలో పనులు పరిశీలిస్తున్న కమిషనర్‌ అలీం

 ‘హలో మేము పాత బాన్సువాడ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పైపులైను పగిలి నీటి సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోండి’ అని పట్టణవాసి ఒకరు ఇలా ఫోన్‌ చేయడంతో పురపాలిక సిబ్బంది వెంటనే స్పందించి అక్కడి సమస్య పరిష్కరించారు.

 ‘ఇది మున్సిపల్‌ కార్యాలయమా? సార్‌.. నీరు రావడం లేదు’’ అని పలువురు పట్టణ ప్రజలు బల్దియా ఇచ్చిన హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకున్నారు.

 న్యూస్‌టుడే, బాన్సువాడ పట్టణం: బాన్సువాడ పురపాలిక పరిధిలో నీటి ఎద్దడి లేకుండా అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర పురపాలిక శాఖ ఆదేశాల మేరకు బాన్సువాడ బల్దియాలో ప్రత్యేక కంట్రోల్‌ రూంతో పాటు హెల్ప్‌లైన్‌ చరవాణి నెంబర్‌ 79895 15252 ను కేటాయించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

కార్యాలయం వెళ్లే అవసరం లేకుండా..

ఇంతకు ముందు నీటి సమస్యల విషయంపై ఇటు ప్రజాప్రతినిధులకు, అటు అధికారులకు విన్నవించేందుకు బల్దియాకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నూతనంగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం, సహాయ నెంబర్‌తో ప్రజలు తమ ఇంటి వద్ద నుంచే ఫోన్‌ చేసి సమస్య పరిష్కరించుకుంటున్నారు.

అధికారుల నియామకం..

సమస్యల పరిష్కారంలో త్వరగా చొరవ చూపేలా ప్రత్యేకంగా పది మంది వార్డు అధికారులను ఇందు కోసం కేటాయించారు. వీరు వారి పరిధిలోని సమస్యలు వెంటనే సంబంధిత సిబ్బంది దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేలా విధులు నిర్వర్తిస్తున్నారు.


ఇబ్బందులు లేకుండా
- అలీం, పుర కమిషనర్‌, బాన్సువాడ

ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ప్రత్యేక అధికారులను సైతం కేటాయించాం. బల్దియాలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశాం. ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నాం. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా చరవాణి నెంబర్‌ను సంప్రదించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని