logo

కళాశాలల తనిఖీలకు వేళాయె

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు.

Published : 25 Apr 2024 03:37 IST

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం

న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. చాలా ప్రైవేటు కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా కనీస ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఏటా వర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన విద్యా సంవత్సరం కోసం ఈ నెల 25 నుంచి మే 13 వరకు ఈ తనిఖీలు చేపట్టనున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు.

ప్రమాణాలు పాటిస్తున్నట్లు చూపిస్తూ..

వర్సిటీ పరిధిలో 3 ప్రభుత్వ, 12 ప్రైవేటు పీజీ కళాశాలలు, 16 ప్రభుత్వ(గురుకులాలు కలిపి), 54 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. 3 ఎంబీఏ, 1 ఎంసీఏ కళాశాలలున్నాయి. యూజీసీ, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ నిర్దేశించిన నిబంధనలు కళాశాలలు పాటించాల్సి ఉంటుంది. సొంత భవనాలు, ల్యాబ్‌లు, అర్హత కలిగిన అధ్యాపకులు, క్రీడా మైదానం సౌకర్యాలు లేని కళాశాలలు ఉన్నాయి. అయితే ముందస్తు సమాచారంతో యూనివర్సిటీ అధికారులు తనిఖీలకు వెళ్తుండటంతో పలు ప్రైవేటు యాజమాన్యాలు అన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్లు చూపిస్తున్నాయనే విమర్శలు నెలకొన్నాయి. పలు కళాశాలలు యూనివర్సిటీ నిర్దేశించిన పరీక్ష ఫీజు కంటే అధిక వసూళ్లకు పాల్పడుతున్నాయని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్‌ డబ్బులను కట్టించుకుంటున్నట్లు వివరాలతో వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

నెల రోజుల గడువు

యూజీసీ, ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీ నిర్దేశించిన నియమ, నిబంధనలకు లోబడి తనిఖీలు ఉంటాయి. ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు కచ్చితంగా ప్రమాణాలు పాటించాలి. కనీస సౌకర్యాలు లేని కళాశాలలకు వాటి కల్పనకు నెల రోజుల గడువు ఇస్తాం. 

ఆచార్య చంద్రశేఖర్‌, తెవివి అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు