logo

తగ్గుతుందా.. పెరుగుతుందా..?

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్‌శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

Published : 28 Apr 2024 05:37 IST

పోలింగ్‌శాతం, గెలుపోటములపై పార్టీల లెక్కలు

ఈనాడు, కామారెడ్డి: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్‌శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పెరిగితే ఎవరికి లాభం, నష్టం? తగ్గితే ఏ పార్టీకి ప్రయోజనం అన్న కోణంలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌శాతంపై ఎన్నికల యంత్రాంగం, అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

వేర్వేరు ఎన్నికల సమయంలో..

అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగిన 2009, 2014లలో పోలింగ్‌ భారీగానే నమోదైంది. 2018లోనూ జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. కాని 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌ను విశ్లేషిస్తే పట్టణ ప్రాంతాలకు చెందినవారే ఓటింగ్‌లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. పట్టణాల్లో పోలింగ్‌శాతం పెంచేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇతర ప్రాంతాలకు  వెళ్లడంతో..

స్థానిక సంస్థలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మేర పోలింగ్‌ తగ్గుతోంది. ఇదే విధంగా శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా తగ్గుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఎల్లారెడ్డి, జుక్కల్‌, నారాయణఖేడ్‌, అందోల్‌, జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్షాధారంగానే అన్నదాతలు పంటలు పండిస్తుంటారు. వేసవిలో కూలీలకు పల్లెలతో పాటు పట్టణాల్లో ఉపాధి లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో పలువురు నిరుపేదలు జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అడ్డాకూలీలుగా జీవనం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు ఓటింగ్‌లో పాల్గొనేలా పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చి గ్రామాలకు తరలించారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. దీనికి తోడు వేసవి సెలవులు రావడంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో పట్టణాలు, పల్లెల్లో పోలింగ్‌ తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి.

మారిన ప్రచార  సరళి

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ప్రచారంలో తేడా కనిపిస్తోంది. పార్టీల అగ్రనేతల హడావుడే తప్ప ద్వితీయ, గ్రామస్థాయి నేతల్లో ప్రచారం చేపట్టాలనే ఉత్సాహం కనపడడం లేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశాలతో సరిపెడుతున్నారు. గతంలో మాదిరి పోస్టర్లు, కరపత్రాల ప్రచారానికి స్వస్తి చెప్పారు. సామాజిక మాధ్యమాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని