logo

పల్లె బాట.. ఓట్ల వేట

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. భారాస, కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌లతో ప్రజల్లోకి వెళ్తుండగా..

Updated : 28 Apr 2024 05:59 IST

స్థానిక సమస్యలపై అభ్యర్థుల హామీ

ఈనాడు, నిజామాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. భారాస, కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌లతో ప్రజల్లోకి వెళ్తుండగా.. భాజపా చాయ్‌పే చర్చా పెడుతోంది. ఇన్నాళ్లు మండల స్థాయికే పరిమితమైన ప్రచారాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్తున్నారు. ప్రభావం చూపే వర్గాలను తమవైపు తిప్పుకొనే వ్యూహం అమలు చేస్తున్నారు. బలమైన సామాజికవర్గ పెద్దలను కలుస్తూ.. హామీలు ఇస్తున్నారు. వారి నుంచి వస్తున్న స్పందనను చూసి ముగ్గురు అభ్యర్థులు తమ ఓటు బ్యాంకును అంచనా వేసుకుంటున్నారు.

స్థానిక అంశాలకు  ప్రాధాన్యం

ఆయా మండలాలకు ప్రచారానికి వెళ్లిన సందర్భంలో అభ్యర్థులు అక్కడి సమస్యలు ప్రస్తావిస్తున్నారు. పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రాధాన్యమిచ్చి సాధించేందుకు చొరవ చూపుతామంటున్నారు. వెళ్లిన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రజలను ప్రభావితం చేసే విషయాలపైనా చర్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే రైతులు, గల్ఫ్‌ బాధితులు, బీడీ కార్మికులు, ఉపాధి కూలీలు, మహిళల ప్రయోజనాంశాలపై ప్రసంగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రిజర్వేషన్లు, పార్టీల మ్యానిఫెస్టోల్లోని విషయాలు ప్రస్తావిస్తున్నారు.

సమర్థత చాటుకుంటూ..

ముగ్గురు అభ్యర్థులు తమ రాజకీయ అనుభవం, ఇప్పటి వరకు ప్రజల కోసం చేసిన కృషిని చెప్పుకొంటున్నారు. మిగతా ఇద్దరి పనితీరు, వ్యవహార శైలితో పోలిస్తే తాను భిన్నమని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశమిస్తే సేవ చేస్తానని, చట్ట సభలో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతామంటున్నారు. ముగ్గురూ పరస్పరం తమ సమర్థత గురించి సభల్లో పరిచయం చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.  

ఇంకా  సంశయంలో...

శాసనసభ ఎన్నికల్లో గ్రామస్థాయి నాయకత్వానికి ప్రాధాన్యం లభించింది. ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఆ ఖర్చులు అభ్యర్థులు, పార్టీలు చూసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికలకొచ్చేసరికి అంతటి విస్తృత స్థాయిలో ప్రచారం ఉండదు. కానీ ర్యాలీలు.. కార్నర్‌ మీటింగ్‌లు, సమావేశాలకు జనసమీకరణ తప్పనిసరి. ప్రజలను తరలించటం, ఇతర ఏర్పాట్ల ఖర్చులకు అన్ని పార్టీలు వెనకాడుతున్నాయి. దీంతో కిందిస్థాయి నాయకత్వం ఇంకా సంశయంలోనే ఉండింది. తమ గ్రామంలో ప్రచారం మొదలెట్టాలంటే.. నాయకత్వం నుంచి భరోసా లభించకుండా ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉంది. వెళ్తే సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఓ పార్టీ నాయకుడు చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని