logo

అక్క, తమ్ముడి ఎదురుచూపు

ప్రస్తుతం రాబోయే ఎన్నికల కోసం రాష్ట్రమంతా పార్టీ టికెట్లు సాధించిన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. మల్కాన్‌గిరి జిల్లాలో మల్కాన్‌గిరి, చిత్రకొండ నియోజకవర్గాలున్నాయి.

Published : 15 Apr 2024 05:27 IST

చిత్రకొండ నియోజకవర్గ పరిస్థితి

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: ప్రస్తుతం రాబోయే ఎన్నికల కోసం రాష్ట్రమంతా పార్టీ టికెట్లు సాధించిన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. మల్కాన్‌గిరి జిల్లాలో మల్కాన్‌గిరి, చిత్రకొండ నియోజకవర్గాలున్నాయి. మల్కాన్‌గిరికి ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లు ఖరారు చేశాయి. చిత్రకొండ నుంచి కాంగ్రెస్‌ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. బిజద, భాజపా ఇంకా ప్రకటించలేదు. ఇక్కడి బిజద టికెట్‌ కోసం అక్క, తమ్ముడు ఎదురుచూస్తున్నారు. 

ఎవరికి వస్తుందో: చిత్రకొండలో బిజద అభ్యర్థి ఎంపిక తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇక్కడ లక్ష్మీధర్‌ ముదిలి, లక్ష్మీప్రియ నాయక్‌, మహేశ్‌ బకాలు రేస్‌లో ఉన్నారు. వీరిలో లక్ష్మీప్రియ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, లక్ష్మీధర ముదిలికి అవకాశం ఇవ్వాలని ఆయన మద్దతుధారులు ముఖ్యమంత్రికి లేఖ అందజేశారు. 2019లో గెలుపొందిన చిత్రకొండ ఎమ్మెల్యే పూర్ణచంద్ర బకా కుమారుడు మహేశ్‌ బకాకు టికెట్‌ దక్కనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

బాబాయ్‌, కుమార్తె పోటీ

2019 ఎన్నికల్లో పూర్ణచంద్ర బకా బిజద తరఫున, ఆయన అన్నయ్య కుమార్తె లక్ష్మీప్రియ నాయక్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. పూర్ణచంద్ర 2,545 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం ఆమె పార్టీని వీడి బిజదలో చేరారు. ప్రస్తుతం ఆమె బిజద మహిళా అధ్యక్షురాలుగా, జడ్పీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు.


లక్ష్మీప్రియకు అవకాశం?

ఇద్దరూ ఒకే పార్టీలో ఉండడంతో ఈసారి ఎన్నికల్లో ఆమెకు టికెట్‌ దక్కకూడదని, పూర్ణ తన కుమారుడిని బరిలో దింపారు. చిత్రకొండ సమితిలో లక్ష్మీప్రియకు వ్యతిరేకత ఉండగా, మత్తిలిలో మద్దతుగా ఉన్నారు. అధిష్ఠానం ఆమెకు టికెట్‌ కేటాయించాలని యోచిస్తున్నట్లు వినికిడి. టికెట్‌ తనకు దక్కదనే భావనతో మహేశ్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. లక్ష్మీకి అవకాశం వస్తే బాబాయ్‌, తమ్ముడు సహకరిస్తారో లేదో, మహేశ్‌కు వస్తే ఆమె మద్దతిస్తారా అన్నది వేచి చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని