logo

బిజద... రాజీనామాల బెడద

గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్‌ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు.

Published : 24 Apr 2024 02:18 IST

రాష్ట్రవ్యాప్తంగా నేతల్లో అసంతృప్తి
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే

గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్‌ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విలువలకు సమాధి కట్టారని, అంకితభావంతో సేవలు చేసిన వారిని ఉపేక్షించారని ప్రసార సాధనాల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


టికెట్లు అమ్ముకున్నారు

హిందోళ్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే సీమారాణి నాయక్‌ మంగళవారం బిజదకు రాజీనామా చేశారు. మళ్లీ అభ్యర్థి కావాలన్న ఆమెకు ఈసారి టికెట్‌ నిరాకరించిన సీఎం ఢెంకనాల్‌ సిటింగ్‌ ఎంపీ మహేష్‌ సాహును రంగంలో నిలిపారు. ఎంపీగా ఆయన అయిదేళ్లు సక్రమంగా విధులు నిర్వహించలేదన్న ఆరోపణలున్నాయి. హిందోళ్‌ అసెంబ్లీ సెగ్మెంటు ఢెంకనాల్‌ లోక్‌సభ పరిధిలో ఉంది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీమారాణి విలేకరుల ముందు కన్నీరు కార్చారు. విలువలకు సమాధి కట్టిన బిజద నాయకత్వం టికెట్లు విక్రయించుకుందని, కార్పొరేషన్‌, మైనింగ్‌ కంపెనీల అండదండలున్నవారిని అభ్యర్థులుగా నిలిపిందని ఆరోపించారు.


ఆదర్శాలకు చెల్లుచీటి

సంబల్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యురాలు రాసేశ్వరి పాణిగ్రహి మంగళవారం బిజద ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆదర్శాలు, విలువలకు చెల్లుచీటి రాసిన పార్టీలో ఇమడలేకపోతున్నానని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... పశ్చిమ ఒడిశాకు మణిహారంగా నిలుస్తున్న సంబల్‌పూర్‌ లోక్‌సభ స్థానంలో ఉత్తర కోస్తాకు చెందిన నేత (ప్రణవ ప్రకాష్‌ దాస్‌ అలియాస్‌ బొబిదాస్‌)ను బిజద నుంచి అభ్యర్థిగా నిలిపారన్నారు. సంబల్‌పూర్‌, రెఢాఖోల్‌ అసెంబ్లీ స్థానాలకు ప్రసన్న ఆచార్య, రోహిత్‌ పూజారిలను ప్రకటించారని, అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత రెడోఖోల్‌కు ప్రసన్నను ఖరారు చేసి, సంబల్‌పూర్‌లో రోహిత్‌ను ఎంపిక చేశారన్నారు. చాలాచోట్ల అయోగ్యులను అభ్యర్థులుగా చేసినందున తాను అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు చెప్పారు.


పూరీ జిల్లాలో ఆగ్రహం

పూరీ జిల్లా నిమపడ అసెంబ్లీ సీటు ఈసారి దిలీప్‌ నాయక్‌కు కేటాయించినందుకు మాజీ మంత్రి సమీర్‌ దాస్‌, ఆయన మద్దతుదారులు బిజద నాయకత్వానికి సవాల్‌ చేస్తున్నారు. పూరీ పరిధిలోని కాకట్‌పూర్‌లో మంత్రి తుషార్‌కాంతి బెహరాను నిలబెట్టినందుకు మాజీ ఎమ్మెల్యే సురేంద్ర శెఠి వర్గీయులు గుర్రుగా ఉన్నారు. మంగళవారం భువనేశ్వర్‌లో సమావేశం నిర్వహించినవారంతా తుషార్‌కాంతిని ఓడిస్తామని శపథం చేశారు. సురేంద్ర తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు.


ఇద్దరు అధ్యక్షుల రాజీనామా

సీఎం నవీన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని కళ్లికోట సమితి అధ్యక్షుడు దైతారి బెహరా, కవిసూర్యనగర్‌ సమితి అధ్యక్షురాలు జ్యోతిర్మయి స్వయిన్‌ పదవులకు రాజీనామా చేశారు. దైతారి ప్రస్తుత కళ్లికోట ఎమ్మెల్యే సూర్యమణి బైద్య భర్త. జ్యోతిర్మయి అస్కా సిటింగ్‌ ఎమ్మెల్యే మంజుల స్వయిన్‌ కోడలు. సూర్యమణి, మంజులకు నవీన్‌ ప్రస్తుత ఎన్నికల్లో టికెట్లు కేటాయించారు. వీరిద్దరిపై ఆరోపణలు ఉన్నాయి. సమితి అధ్యక్షులు పదవులు ఎందుకు వదులుకున్నారన్న దానిపై స్పష్టత లేదు.


కానరాని పారదర్శకత

నేర చరిత్ర, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఈసారి అభ్యర్థులుగా చేయబోమని చెప్పుకున్న బిజద నాయకత్వం 10 వేల మంది ఆశావహులు దరఖాస్తులు చేసినట్లు పునరుద్ఘాటించింది. సీఎం, వి.కార్తికేయ పాండ్యన్‌లు టికెట్లు ఆశిస్తున్న నేతలతో మాట్లాడారు. అందరి బలాబలాలు పరిశీలించారు. నిఘావర్గాల నివేదికలు ఒకటికి పదిసార్లు పరిశీలించారు. ప్రకటించిన జాబితా మాత్రం పారదర్శకతకు అద్దం పట్టలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు కేటాయించారు. కొన్నిచోట్ల సిటింగ్‌ ఎమ్మెల్యేల భార్యలను పోటీకి నిలిపారు.


ప్రమాణాలు తీసికట్టు

టికెట్ల కేటాయింపులో పాండ్యన్‌ ప్రధానపాత్ర పోషించారు. ఆయనకు విధేయునిగా ఉన్నవారికి ప్రాధాన్యమిచ్చారు. టికెట్లు దక్కించుకున్నవారు పాండ్యన్‌ను ప్రస్తుతిస్తున్నారు. రానివారు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పరిస్థితి తీవ్రత గమనించిన నాయకత్వం ఆయాచోట్ల గ్రూపులు కట్టిన నేతలను ఆలయాలకు తీసుకెళ్లి ప్రమాణాలు చేయించారు. పార్టీ నిర్ణయాలకు శిరసావహిస్తామని, తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేయబోమని అసంతుష్టులతో చెప్పించారు. ఈ కార్యక్రమం అన్నిచోట్లా విజయవంతం కాలేదు.


నేటి నుంచి సీఎం ప్రచారం

బిజు వర్ధంతి రోజున నేతల ప్రమాణాలు (పాత చిత్రం)

ఇంతవరకు బిజద 21 లోక్‌సభ, 141 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 6 సీట్లకు సంబంధించి జాబితా ప్రకటించాల్సి ఉంది. ఈసారి తిరుగుబాటుదారుల బెడద ఎక్కువగా ఉండొచ్చని పరిశీలకులంటున్నారు. ముఖ్యమంత్రి నవీన్‌ బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ముందుముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని