logo

మౌనమేలనోయి!

రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Published : 29 Apr 2024 04:23 IST

గుణుపురంలో ప్రచారానికి దూరంగా కాంగ్రెస్‌ నేతలు

బిజయకుమార్‌ గమాంగ్‌ 

గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గుణుపురం నియోజకవర్గంలో గుణుపురం, గుడారి, పద్మపురం, రామన్నగుడ, చంద్రపూర్‌ సమితులతో పాటు గుణుపురం పురసంస్థ, గుడారి ఎన్‌ఏసీలున్నాయి. 289 పోలింగు కేంద్రాలు, 2,21,495 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఒక్కో సమితిలో మూడు రోజలు ప్రచారం చేసినా సమయం సరిపోదు. అయినా కాంగ్రెసు నాయకులు మౌనం వీడటం లేదు. జిల్లా కాంగ్రెసు అధ్యక్షునిగా బిజయ కుమార్‌ గమాంగ్‌, ఆయన భార్య మహిళా కాంగ్రెసు నాయకురాలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో గమాంగ్‌తో పాటు ఆయన కుమారుడు అవినాష్‌ గమాంగ్‌ (రాష్ట్ర యువజన కాంగ్రెసు అధికార ప్రతినిధి) కాంగ్రెసు టికెట్టు ఆశించినా, రాకపోవడంతో కొరాపుట్ లోక్‌సభ, గుణుపురం ఎమ్మెల్యే స్థానాలకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. అవినాష్‌తోపాటు ఆయన తల్లి కేతకీ గమాంగ్‌ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన కుమారునికి టికెట్‌ ఇవ్వలేదని, జిల్లా కాంగ్రెసు అధ్యక్షునిగా ఉన్నా తనకు తగిన గుర్తింపు లేదని బిజయకుమార్‌ గమాంగ్‌ అలక వహించినట్లు, అందువల్లే ఇంటి నుంచి బయటకు రాకుండా ప్రచారంలో పాల్గొనడం లేదని విశ్లేషకుల అంచనా.

రఘునాథ్‌ అసంతృప్తి

గుడారి సమితిలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, ఈ ప్రాంతంలో పార్టీలో భీష్మ పితామహునిగా గుర్తింపు పొందిన రఘునాథ్‌ పాత్ర్‌ కూడా ప్రచారంలో పాల్గొనడం లేదని సమాచారం. భాస్కర జగరంగాకు టికెట్‌ ఇప్పించాలని రఘునాథ్‌ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో భాస్కర కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆయన మద్దుతుదారునికి టికెట్‌ లభించకపోవడంతో రఘునాథ్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇలాఎవరూ ప్రచారం చేయకుండా మౌనం వహిస్తున్నారు. పార్టీలో అగ్రనాయకులు చొరవ చూపించి కాంగ్రెసులో రేబెల్స్‌ లేకుండా వారిని ఒప్పించి నామినేషన్లు ఉపసంహరణ అయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులు అంటున్నాయి. విభేదాలు లేకుండా అంతా కలిసి ఎన్నికల్లో ముందుకుసాగితే విజయం సాధించవచ్చని అంటున్నాయి. రానున్న రోజుల్లో సమీకరణాలు ఎలా మారనున్నాయో వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని