logo

బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది

‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు.

Published : 19 Apr 2024 03:53 IST

వాహనం ఢీకొని విద్యార్థి మృతి

భరద్వాజ్‌ మృతదేహాన్ని పట్టుకుని మేనమామ ఈశ్వర్‌ కన్నీరు మున్నీరు

న్యూస్‌టుడే - రాజాం: ‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. మీ అబ్బాయిని వాహనం ఢీకొందంటూ అందిన సమాచారం ఆ తల్లిదండ్రులు కుప్పకూలేలా చేసింది. రాజాం పట్టణంలోని లచ్చయ్యపేటకు చెందిన అయిదో తరగతి విద్యార్థి కొండేటి భరద్వాజ్‌ (10)ని గురువారం రాత్రి రాజాం వైకాపా అభ్యర్థి డా.తలే రాజేష్‌ ప్రచార రథం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. అదే వాహనంలో చోదకుడు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అప్పటికే అచేతనావస్థకు చేరిన బాలుడి ప్రాణం నిలిపేందుకు వైద్యుడు అప్పలనాయుడు ప్రయత్నించారు. సీపీఆర్‌ చేశారు. ఆఖరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. కుమారుడు ఇక లేడని తెలిసి తండ్రి వెంకటేశ్వరరావు కుప్పకూలిపోయాడు. తల్లికి విషయం చెప్పకుండా ఉంచారు. అప్పటికే ఆమె పలుమార్లు స్పృహ కోల్పోతుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రాత్రి 10 గంటల వరకూ ఇంకా కుమారుడు బతికే ఉన్నాడని ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. అంబులెన్స్‌ రాలేదని, వస్తే మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పినా ఆమె రోదనకు అంతులేకుండా పోయింది.

వేడుకల్లో  పాల్గొని..

భరద్వాజ్‌ తెలివైన, చురుకైన విద్యార్థిగా గుర్తింపు పొందాడు. రాజాం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ రోడ్డు ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల వార్షికోత్సవం గురువారం నిర్వహించడంతో తోటి విద్యార్థులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. ఈ విషయాలను ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులతో సంతోషంగా పంచుకున్నాడు. అల్పాహారం తీసుకురావాలని పురమాయించడంతో బయటకు వెళ్లి దాన్ని తీసుకువస్తూ రాజాం-చీపురుపల్లి రోడ్డు దాటుతుండగా వైకాపా ప్రచార రథం ఢీకొంది. వెంకటేశ్వరరావు, సంతోషి దంపతులకు తొలి సంతానంలో పాప గీతిక పుట్టింది. రెండో సంతానంగా భరద్వాజ్‌ జన్మించడంతో వారసుడొచ్చాడని వారు పొంగిపోయారు. తండ్రి ప్రైవేటులో చిరుద్యోగి అయినా ఏనాడూ ఏలోటూ లేకుండా పిల్లల్ని బాగా పెంచారు. ఇప్పుడు వైకాపా ప్రచార రథం వాహనం వారసుడ్ని పొట్టనబెట్టుకుందని ఆవేదన చెందుతున్నారు.

చట్టం తన పని తాను చూసుకుంటుందట

వైకాపా ప్రచార రథం నడిపిన చోదకుడు పరారయ్యాడు. అతను మద్యం తాగి ఉన్నట్లు చెబుతున్నారు. బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కేసును నీరుగార్చే ప్ర£యత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజాం ఎస్సై రవికిరణ్‌ ఆసుపత్రి వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. న్యాయం చేసేలా చూడాలని బాధిత కుటుంబం ఒక అధికార పార్టీ నాయకుడిని కోరగా.. ఆయన ఆసుపత్రి వద్దకు వచ్చి సాయం చేయకపోగా చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వ్యాఖ్యానించడం బంధు వులకు ఆగ్రహం తెప్పించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ మోహనరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని