logo

ఇది జగనన్న చీకటి రాజ్యం..!!

వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అంధకారమే మిగిలింది. ఎక్కడ చూసినా వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది.

Published : 28 Apr 2024 04:37 IST

రాజాం పట్టణాల్లో పరిస్థితి

బొబ్బిలి పట్టణం బాలాజీ నగర్‌ ప్రాంతంలో పరిస్థితి

వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అంధకారమే మిగిలింది. ఎక్కడ చూసినా వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. బొబ్బిలి పట్టణంలోని ప్రధాన రహదారులు మినహా పూర్తి స్థాయిలో ఎక్కడా దీపాలు వెలగడం లేదు. రాజాం శివారు ప్రాంతాలు చీకటి పడితే అంధకారంలో మగ్గుతున్నాయి. ఓ పక్క దొంగలు, మరోపక్క విష సర్పాల భయంతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణకు నిధులు లేక ఇబ్బందులు ఏర్పడ్డాయి.  

న్యూస్‌టుడే, బొబ్బిలి, రాజాం బొబ్బిలి,

పనులకు నిధుల్లేవ్‌

రాజాం పట్టణ పరిధిలోని పాలకొండ, బొబ్బిలి, శ్రీకాకుళం, ప్రధాన, రహదారుల్లో అన్నీ దీపాలు వెలగడం లేదు. విజయనగరం రహదారిలో గాయత్రీ కాలనీ వరకూ అంధకారం నెలకొంటోంది. ఇక్కడ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎంతగా మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి విస్తరణ పనులు నిలిచిపోవడం, దీనికి అంధకారం తోడవడంతో రాత్రివేళల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త ప్రాంతాలు, శివారు కాలనీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీపం మరమ్మతులకు గురైతే బాగు చేయడానికి నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణను ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)కు గతంలో అప్పగించారు. ఒప్పందం ముగిసిన తరువాత మున్సిపాల్టీలే సొంతంగా ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సి వస్తోంది. నిర్వహణకు నిధుల్లేక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 300 వీధి దీపాలు వచ్చాయని చెబుతున్నా.. క్లాంపులు, వైర్లు, నట్లు, బోల్టులు వంటివి రాకపోవడంతో కొత్తవి ఏర్పాటు చేయలేదనిఅంటున్నారు. పట్టణంలో 180 సెంటర్‌ లైటింగ్‌ (120 వాట్స్‌), 16 ఐమాక్స్‌ లైట్లు, 3 వేల వరకూ వీధి దీపాలు ఉన్నాయి. సమస్యను తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని  కమిషనర్‌ జాగరపు రామ అప్పలనాయుడు తెలిపారు.

ఇందిరమ్మ కాలనీ ప్రధాన రోడ్డులో ఇలా..

పాలకుల నిర్లక్ష్యం శాపమై..

బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో 3,000 గృహాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రెండు నెలలుగా సగానికిపైగా దీపాలు వెలగడం లేదు. రావువారివీధి, చినచెరువు గట్టు, ఎస్సీ కాలనీ శివారు, బాలాజీనగర్‌ ప్రాంతాల్లో దీపాలు ఉన్నా వెలుతురు లేదు. ఇటీవల గాలులతో కొన్ని మరమ్మతులకు గురయ్యాయని, కొత్తవి అమర్చుతున్నామని పురపాలక ఏఈ రవి చెప్పారు. ఇందిరమ్మ కాలనీలో తీగలు కొత్తవి వేయాలని, రూ.20 లక్షలు కేటాయించామన్నారు. వీధి దీపాల నిర్వహణకు పురపాలక నిధులు సకాలంలో కేటాయించక పోవడంతో సమస్య ఏర్పడుతోంది. ఏడాదికి సుమారు రూ.5 లక్షలు నిర్వహణకు ఖర్చుచేస్తున్నట్లు చెబుతున్నారు. గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు లేక ముందుకు రావడం లేదు.


మూడు నెలలుగా ఇంతే..

మూడు నెలలుగా ఇందిరమ్మకాలనీ ప్రధాన వీధుల్లో దీపాలు వెలగడం లేదు. బల్బులు అమర్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఏవో విద్యుత్తు తీగలు పాడయ్యాయని చెబుతున్నారు. నెలలు గడిచినా వాటిని బాగుచేయడం లేదు. రాత్రిపూట చాలా ఇబ్బందులు పడుతున్నాం. వీధుల్లో టార్చు వేసుకుని తిరగాల్సి వస్తోంది.  

రవణమ్మ, ఇందిరమ్మ కాలనీ, బొబ్బిలి


దొంగల భయం

నిత్యం అంధకారంలో మగ్గుతున్నాం. మా వీధిలో దీపాలు వెలగడం లేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మా ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. తుప్పలు, డొక్కలు ఉండడంతో పాములు చేరుతున్నాయి. దొంగల భయం వెంటాడుతోంది. ఏం చేయాలో తెలియడం లేదు. బిక్కు బిక్కుమని జీవనం సాగిస్తున్నాం.

రాములమ్మ, బొబ్బిలి, ఐటీఐ కాలనీ


అడుగు వేయలేకపోతున్నాం

చీకటి పడితే ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టలేకపోతున్నాం. విద్యుత్తు స్తంభాలు దిష్టి బొమ్మల్లా ఉన్నాయి. ఏవీ పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. రాత్రిపూట కుక్కల బెడద ఎక్కువగా ఉంది. శివారు ప్రాంతం కావడం వల్ల పాములు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి. చాలా భయమేస్తోంది.

లక్ష్మి, బొబ్బిలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు