logo

రూపాయి రుణమివ్వని జగన్‌

బీసీల్లో వివిధ వర్గాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం కాపు, కుమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి తదితర కులాలతో పాటు ఈబీసీ, ఎంబీసీ(సంచార జాతులు), వైశ్య తదితర కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.

Published : 28 Apr 2024 04:47 IST

ఐదేళ్లలో కార్పొరేషన్లన్నీ నిస్తేజం
యువతకు స్వయం ఉపాధి దూరం
న్యూస్‌టుడే, విజయనగరం మయూరి కూడలి

తెదేపా హయాంలో ఏర్పాటైన యూనిట్‌(పాతచిత్రం)

  • ‘నా బీసీలందరికీ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వారిని ఆర్థికంగా లక్షాధికారులను చేసి, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నది మా ప్రభుత్వం ఉద్దేశం. గత ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ చెప్పిన మాటలివి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. గత ఐదేళ్లలో బీసీ ప్రధాన కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా రుణం దక్కలేదు. దీంతో యువత, నిరుద్యోగులు స్వయం ఉపాధికి దూరమయ్యారు.
  • నాపేరు పైడిరాజు. మాది విజయనగరం. రూ.5 లక్షలతో దుకాణం పెట్టుకోవాలని కొన్ని నెలల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో యూనిట్‌ పెట్టుకోలేకపోయా. రోజువారీ కూలి పనులకు
  • వెళ్తున్నా.
  • నా పేరు రమా. మాది విజయనగరం. గత ప్రభుత్వ హయాంలో నేను బ్యుటీషన్‌ కోర్సు నేర్చుకున్నా. ఏడాది పాటు ఉచిత శిక్షణ పొందా. అనంతరం ప్రభుత్వం మారింది. సొంతగా దుకాణం పెట్టుకోవాలని బీసీ కార్పొరేషన్‌ కార్యాలయానికి వెళ్లాను. ప్రస్తుతం రుణాలు ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. దీంతో అప్పు చేసి దుకాణం నడుపుతున్నా.

ఇదీ పరిస్థితి..

బీసీల్లో వివిధ వర్గాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం కాపు, కుమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి తదితర కులాలతో పాటు ఈబీసీ, ఎంబీసీ(సంచార జాతులు), వైశ్య తదితర కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అవసరం మేరకు 50 శాతం రాయితీతో రుణాలు అందించేవారు. స్వయం ఉపాధిలో భాగంగా 30 శాతం, ఆదరణ పథకం కింద కొన్ని యూనిట్లకు 90 శాతం వరకు సబ్సిడీ దక్కేది. అంతే కాకుండా ఎన్‌బీసీఎఫ్‌డీసీ ద్వారా 40 శాతం రాయితీతో వాహనాలు అందించేవారు. 2014 నుంచి 2019 మార్చి వరకు ఉమ్మడి జిల్లాలో 50,852 మందికి రూ.220.98 కోట్ల రుణం అందించారు. వైకాపా వచ్చాక రూపాయి కూడా దక్కలేదు.

అప్పట్లో ఇచ్చిన యూనిట్లు..

కులవృత్తులు చేసుకునే కుమ్మరి, కంసాలి, పద్మశాలి, శాలి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి, ఇతర వర్గాలకు చెందిన వారు టీ, టిఫిన్‌ దుకాణం, హోటల్‌, కూరగాయలు, విద్యుత్తు పరికరాలు, మందులు, దుస్తులు, వ్యవసాయ పరికరాలు, ఇతర సామగ్రి, వాహనాలు తదితర దుకాణాలు పెట్టుకునేందుకు అవకాశం ఉండేది. ఈమేరకు పథకాల కింద రుణాలు దక్కేవి. అలాగే ట్రాక్టర్లు, ఇన్నోవా కార్లు, ఆటోలు ఇచ్చేవారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి గానీ, ఒక్క వాహనం గానీ అందలేదు.

రాయితీలు ఇలా..

గత ప్రభుత్వ హయాంలో బీసీ విభాగాల్లోని పలు కార్పొరేషన్ల ద్వారా పెద్దఎత్తున రుణాలు దక్కాయి. ఆదరణ పథకం కింద 90 శాతం రాయితీ వచ్చేది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉండేది. ఎన్‌బీసీఎఫ్‌డీసీలకు రెండు ప్రభుత్వాలూ కలిపి 40 శాతం సబ్సిడీ అందించేవి. మిగిలిన 60 శాతాన్ని కార్పొరేషన్‌ కింద ఇచ్చేవారు. బీసీ, ఈబీసీ, ఎంబీసీ, వైశ్య తదితర కార్పొరేషన్లకు లబ్ధిదారుడి వాటాగా రూపాయి కట్టించుకోకుండా 50 శాతం రుణం అందించేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని