logo

అనుబంధమన్నావు అనాధలా వదిలేశావు!

నియోజకవర్గ కేంద్రమైన సాలూరులో వేల కుటుంబాలకు జీవనాధారం ఆటోనగర్‌. పద్నాలుగేళ్ల కిందట దీనికి బీజం పడింది. ఇది అభివృద్ధి చేస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరడంతో పాటు కార్మికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.

Published : 30 Apr 2024 04:14 IST

ఆటోనగర్‌ను పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం
షెడ్లకు కేటాయించిన స్థలాలు: 120
లారీ మోటారు రంగంపై ఆధారిత కుటుంబాలు: 8,000
అనుబంధ పరిశ్రమలపై ఆధారపడే కార్మికులు: 550

లారీ పరిశ్రమ అంటే ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డికి ఎందుకో అంత కోపం. లేనిపోని పన్నులు వేశారు. వందల్లో ఉన్న ట్యాక్స్‌లను రూ.వేలు చేశారు.  పక్క రాష్ట్రాలతో పోలిస్తే  ఇంధనంపై  ఒక్కో లీటరుకి నాలుగు నుంచి ఆరు  రూపాయల  వరకు అదనపు భారం మోపారు. మరోవైపు వాహనాల్లో లోడు అధికంగా ఉందని  రూ.20 వేలకు జరిమానాలతో  బాదేస్తున్నారు.  దీనిపై ఆధారపడి ఉన్న కార్మికులను గడిచిన అయిదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.  ఇందుకు సాలూరు లోని ఆటోనగరే నిదర్శనం.

న్యూస్‌టుడే, సాలూరు


నియోజకవర్గ కేంద్రమైన సాలూరులో వేల కుటుంబాలకు జీవనాధారం ఆటోనగర్‌. పద్నాలుగేళ్ల కిందట దీనికి బీజం పడింది. ఇది అభివృద్ధి చేస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరడంతో పాటు కార్మికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అటువంటి ఆటోనగర్‌ ప్రగతిపై వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కనీసం పైసా కూడా విదల్చకుండా మొండిచేయి చూపింది. అంతేకాకుండా దీని బాధ్యతలను పారిశ్రామిక శాఖ అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జారీచేసి చేతులు దులిపేసుకుని మోటారు కార్మిక కుటుంబాల ఉపాధి ఉసురు తీసింది.


చేయాల్సినవి ఇవీ..

  • ఆటోనగర్‌లో రోడ్లు, కాలువలు నిర్మించి, తాగునీరు కల్పించాలి.
  • గతంలో విద్యుత్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన నియంత్రిక తుప్పు పట్టగా తీగలు దొంగల పాలయ్యాయి. దీనికి మరమ్మతులు చేపట్టి స్తంభాలు, తీగలు వేసి సరఫరా చేయాలి.
  • అప్పుల ఊబిలో కూరుకుపోయిన మోటారు కార్మికులను షెడ్ల నిర్మాణానికి బ్యాంకు రుణాలు ఇప్పించి ఆదుకోవాలి.
  • టైర్లు రీబటన్‌, పెయింటింగ్‌, స్టిక్కరింగ్‌, వేస్ట్‌ ఆయిల్‌ శుద్ధి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేయాలి.

ఆ దస్త్రం ఏమైంది

పురపాలక సంఘం పాలకవర్గం పగ్గాలు చేపట్టాక పట్టణాభివృద్ధికి మూడు ప్రాధాన్యత అంశాల్లో ఆటోనగర్‌ను చేర్చింది. 2021 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పుర అధ్యక్ష, ఉపాధ్యక్షురాలు పి.ఈశ్వరమ్మ, దీప్తి ప్రతిపాదనలు అందజేశారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక కావాలని సీఎం ఆఫీసు నుంచి కోరగా అధికారులు డీపీఆర్‌ సిద్ధం చేసి పంపారు. ఇది జరిగి మూడేళ్లు కావస్తున్నా నేటికీ వైకాపా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఆటోనగర్‌ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా మారింది.  


మౌలిక సదుపాయాలేవీ?

రోడ్డు పక్కనే మరమ్మతులకు నిలిపిన లారీలు

పట్టణంలో లారీ మోటారు పరిశ్రమకు అనుబంధంగా ఉన్న గ్యారేజీలు, మెకానికల్‌ షెడ్ల ఏర్పాటు చేసేందుకు ఆటోనగర్‌లో 120 స్థలాలు కేటాయించారు.  రోడ్డు, కాలువ, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతో ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఎమ్మెల్యే, ఎంపీ నిధులు అరకొరగా కేటాయించగా గ్రావెల్‌ రోడ్డు వేశారు. అదీ తుపాను వర్షాలకు కొట్టుకుపోయింది. షెడ్లు మొండి గోడలతో మిగిలాయి. ఆటోనగర్‌ లేక జాతీయ రహదారికి ఇరువైపులా మెకానికల్‌, గ్యాస్‌, ఆర్క్‌ వెల్డింగ్‌, పెయింటింగ్‌, ఎలక్ట్రీషియన్‌, బాడీబిల్డింగ్‌, టింకరింగ్‌, సీట్లు, అద్దాలు, కట్టలు, టైరు పంక్చర్లు వంటి గ్యారేజీలు కొనసాగుతున్నాయి. లారీలు, ఇతర వాహనాలు మరమ్మతులకు గురైతే రోడ్డుపైనే ఉంచి కార్మికులు పనులు చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు వాహనాలు ఢీకొనడంతో ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ పరిస్థితులకు చెక్‌ పెట్టేందుకే... 2010లో అప్పటి ఎస్పీ సౌమ్యామిశ్రా, ఆర్డీవో అంబేడ్కర్‌ ఆటోనగర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  


సమస్యలు కోకొల్లలు..

  • మరమ్మతుల పేరిట వాహనాలు రోడ్లపై నిలిపితే రాత్రివేళ అవి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.
  • టైర్లు, కట్టలు, విద్యుత్తు, వెల్డింగ్‌ పనులు చేసేటప్పుడు ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది.  
  • పట్టణంలోని జాతీయ రహదారి పక్కన మెకానిక్‌ షెడ్లు, బాడీబిల్డింగ్‌ పనులు చేస్తున్నారు. నిత్యం ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు.
  • షెడ్లు నిర్వహణ, అద్దెల భారం ఎక్కువై కార్మికులు రోజంతా   కష్టించి పనిచేసినా కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులే.

అనుబంధ పరిశ్రమలన్నారు..

ఆటోనగర్‌ అభివృద్ధి చేసి లారీ మోటారు పరిశ్రమకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాభివృద్ధిలో భాగంగా కార్మిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెంచుతామని గొప్పలు చెప్పారు. అయిదేళ్లు గడిచాయి తప్ప అభివృద్ధికి పూచిక పుల్లకూడా ఇవ్వలేదు.


అభివృద్ధి జరిగితే..

  • ఆటోనగర్‌ అభివృద్ధి జరిగితే లారీ పరిశ్రమకు సంబంధించి అన్ని పనులు ఒకేచోట అందుబాటులో ఉంటాయి.
  • పట్టణ ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయి. ప్రమాదాలు, ప్రాణనష్టం తగ్గుతాయి.
  • లారీ మోటారు పరిశ్రమకు అనుబంధంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

సాలూరు లారీ మోటారు పరిశ్రమ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ రెండు వేల లారీలున్నాయి. పట్టణంలో 12వేల కుటుంబాలు ఉండగా 8 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లారీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. అంటే 30 వేల మందికి అన్నం పెట్టే పరిశ్రమనే ముఖ్యమంత్రి చిన్నచూపు చూశారు.  


ఉత్తమాటలే..

లారీ మోటారు పరిశ్రమ, అనుబంధ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆటోనగర్‌ను నిర్మిస్తామంటూ ఎన్నికల్లో నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వానివి ఉత్తమాటలే. అప్పులు చేసి షెడ్లు నిర్మించుకున్న కార్మికులను కష్టాల ఊబిలోకి నెట్టేసింది. పోరాటాలు చేసి సాధించుకున్న ఆటోనగర్‌ పరిస్థితి చూస్తే బాధగా ఉంది.

ఎస్‌.రామచంద్రరావు, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు


పనులే కరవయ్యాయి

ప్రభుత్వం లారీ మోటారు పరిశ్రమపై లేనిపోని భారాలు మోపింది. కొత్త లారీల సంఖ్య తగ్గింది. బాడీ బిల్డింగ్‌ పనులు లేవు. గత అయిదేళ్లలో చాలామంది ప్రత్యామ్నాయం చూసుకున్నారు. తప్పనిసరి పరిస్థితిలో మోటారు రంగంలో కొనసాగుతున్నాం. ఆటోనగర్‌ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోక అవస్థలు పడుతున్నాం.  

ఎం.నరేష్‌, బాడీ బిల్డింగ్‌ కార్మికుడు, సాలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని