logo

రాష్ట్రానికి 14 కోట్ల పని దినాలు

ఈ ఏడాది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రంలోని 26 జిల్లాలకు కేంద్రం 14 కోట్ల పని దినాలు కల్పించిందని జాయింట్‌ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి అన్నారు. బుధవారం కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల ఉపాధిహామీ

Published : 26 May 2022 06:47 IST


సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి, చిత్రంలో పీడీ శీనారెడ్డి తదితరులు

కొండపి, న్యూస్‌టుడే: ఈ ఏడాది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రంలోని 26 జిల్లాలకు కేంద్రం 14 కోట్ల పని దినాలు కల్పించిందని జాయింట్‌ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి అన్నారు. బుధవారం కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల ఉపాధిహామీ సిబ్బందితో క్లస్టర్‌ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది పని తీరు మెరుగుపరచుకోవాలని హెచ్చరించారు. గతేడాది 26 కోట్ల పని దినాలు కల్పించిన కేంద్రం ఈ సారి భారీగా కోత విధించిందని చెప్పారు. రాష్ట్రంలో పేదలను ఆదుకునేందుకు ప్రవేశ పెట్టిన ఈ పథకం క్షేత్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోందని అన్నారు. గ్రామాల్లో చెరువుల పనులు తప్ప చేసేందుకు ఇంకేమీ లేవా అని సిబ్బందిని ప్రశ్నించారు.

అక్కడ పనిచేసేది 621 మందేనా...
జిల్లాలోనే కరవు పనిలో చివరి స్థానంలో సింగరాయకొండ మండలం ఉందని కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6,500 మంది కూలీలకు కేవలం 621 మంది పని చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. కొండపిలో 18 వేల జాబ్‌కార్డులకు గాను 6 మంది మాత్రమే పనులకు రావడంపై ఏపీవో వాసంతిని నిలదీశారు. జరుగుమల్లి, పొన్నలూరు, టంగుటూరు మండలాల్లో కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు. సక్రమంగా పనిచేయకుంటే బదిలీలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పీడీ శీనారెడ్డి మాట్లాడుతూ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీడీ శ్యాంసన్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మస్తాన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని