logo

ఈ పాపాలెవరివి జగనన్నా!

మాదకద్రవ్యాల రహితం సంగతి అటుంచితే జిల్లా వ్యాప్తంగా గంజాయి వేళ్లు బలంగా నాటుకుంటున్నాయి. పల్లె పల్లెకూ పాకుతూ ఇంకా లోతులకు చొచ్చుకుపోతోంది. ప్రజల ప్రాణాలను తోడేసే గంజాయి భూతం జిల్లాను పట్టి పీడిస్తోంది.

Updated : 23 Mar 2024 06:09 IST

ప్రశాంత వనంలో గంజాయి మొక్కలు
వ్యాపారంగా మార్చుకున్న ముఠాలు
నాశనమవుతున్న యువత జీవితాలు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే

రాష్ట్రాన్ని వచ్చే మూడు నాలుగు నెలల్లో సంపూర్ణ మాదక ద్రవ్యాల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలి..

ఇవీ 2022 డిసెంబరులో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పిన మాటలు.

మాదకద్రవ్యాల రహితం సంగతి అటుంచితే జిల్లా వ్యాప్తంగా గంజాయి వేళ్లు బలంగా నాటుకుంటున్నాయి. పల్లె పల్లెకూ పాకుతూ ఇంకా లోతులకు చొచ్చుకుపోతోంది. ప్రజల ప్రాణాలను తోడేసే గంజాయి భూతం జిల్లాను పట్టి పీడిస్తోంది. మత్తు వలయంలో చిక్కుకున్న యువత తమ భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటోంది. వీటితో పాటు తాజాగా విశాఖలో డ్రగ్స్‌ మూలాలు నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిని చూపుతున్నాయి. బ్రెజిల్‌ నుంచి సముద్ర మార్గం ద్వారా విశాఖకు ఇరవై అయిదు వేల కిలోల డ్రగ్స్‌ను సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట కొందరు తీసుకొచ్చిన వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కంపెనీ నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి వాసులది కావడంతో మత్తు పదార్థాల విషవలయం అంశం మరోమారు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలన్నీ సగటు జిల్లా వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పాపాలన్నీ ఎవరివి జగనన్నా అని వారంతా ప్రశ్నిస్తున్నారు.
‌్ర పరిస్థితి మళ్లీ మొదటికి...: జిల్లాలోని యువత, విద్యార్థులను లక్ష్యంగా ఎంచుకుని కొందరు గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. ఏవోబీ ప్రాంతం నుంచి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా మార్చి అంటగడుతున్నారు. ఈ వ్యవహారం లాభసాటిగా ఉండటంతో ముఠాలుగా ఏర్పడి మరీ దందా సాగిస్తున్నారు. గతంలో పోలీసు శాఖ వీటిపై కాస్త కఠిన వైఖరి అవలంబించింది. గత కొన్నాళ్లుగా అటు సెబ్‌, ఇటు పోలీసులు పెద్దగా దృష్టి పెట్టకపోవటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

పగలూ అటుగా వెళ్లలేరు...: స్నేహితులతో కలిసి సరదాగా గంజాయి తాగటం మొదలుపెట్టిన కొందరు విద్యార్థులు క్రమంగా ఆ విష వలయంలో చిక్కుకుంటున్నారు. ఒంగోలు నగరంలో పలు శివారు ప్రాంతాలు గంజాయి అలవాటున్న వారికి అడ్డాలుగా మారాయి. ఆ ప్రాంతాల్లోకి పగటి వేళల్లో ఇతరులు వెళ్లేందుకు కూడా సాహసించలేని పరిస్థితి. నగరం నడిబొడ్డున పాడుబడిన భవనాలను కూడా ఈ ముఠాలు తమ ఆగడాలకు ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. రాత్రీపగలూ తేడా లేకుండా ఆయా ప్రాంతాల్లోనే సంచరిస్తూ మత్తులో దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఒంగోలులోని మంగమూరు రోడ్డు, పేర్నమిట్ట రోడ్డు, కొత్తపట్నం రోడ్డు, వెంగముక్కపాలెం రోడ్డుతో పాటు నూతన జాతీయ రహదారి పైవంతెన ప్రాంతాల్లో నిత్యం రాత్రివేళల్లో కొందరు గంజాయివ మత్తులో జోగుతున్నారు. ఆ ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే వారిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఉదంతాలూ ఉన్నాయి.

పోలీసుల్లోనూ విక్రేతలు...: మత్తుకు అలవాటుపడి చివరకు దాన్ని వీడలేక ఇతరత్రా చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. క్రమంగా తాము కూడా గంజాయి అక్రమ రవాణాదారులుగా మారుతున్నారు. ఒంగోలులో కొందరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇటీవల నాగులుప్పలపాడు మండలంలోని ఒక సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ను కూడా ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ ప్రాంతంలో ఉద్యోగం చేసే సదరు కానిస్టేబుల్‌ మన ప్రాంతంలో గంజాయికి ఉన్న డిమాండ్‌ను చూసి ఏవోబీలో కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చి స్నేహితుల సాయంతో విక్రయిస్తున్న వైనం వెలుగుచూసింది.


మూత్రం పోసి వికృతానందం...

గంజాయి మత్తుకు తోడు పూటుగా మద్యం తాగిన కొందరు యువకులు తాము మనుషులమన్న విషయాన్ని మరిచి రాక్షసుల్లా మారారు. పాత కక్షల నేపథ్యంలో తమ బృందంలోని యువకుడి పట్ల దుర్మార్గంగా వ్యవహరించి పైశాచికానందం పొందారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టారు. రక్తమోడుతున్న వ్యక్తిపై మూత్రం పోసి వికృతానందం పొందారు. ఈ విషయం తెలిసినప్పటికీ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. సుమారు నాలుగు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనను ‘ఈనాడు’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఐజీ స్థాయి అధికారి పోలీసులపై విచారణ చేపట్టారు. బాధ్యులుగా గుర్తించి ఇద్దరిపై వేటు వేశారు.

  • ఒంగోలులోని అప్పాయికుంటలో ఇటీవల సీతారామాంజనేయుల తెప్పోత్సవం నిర్వహించారు. వేడుక అనంతరం స్వామివార్ల విగ్రహాలను ఆలయానికి తీసుకెళ్తున్న భక్తులపై పైశాచిక మూక ఒకటి దాడి చేసింది. గంజాయి మత్తులో ఊగిపోతున్న ఆ దుర్మార్గులు.. స్వామివారి విగ్రహంపై మద్యం పోసి పైశాచికానందం పొందారు. ఈ కేసులో నిందితులపై ఇప్పటికీ పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు.
  • ఒంగోలు ఆర్టీసీ బస్టాండు సెంటరులోని ఒక లాడ్జిలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం(సెబ్‌) అధికారులు ఇటీవల దాడి చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గంజాయితో పట్టుబడ్డారు. వీరు ఏవోబీ ప్రాంతం నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
  • చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్‌ కార్మికులను లక్ష్యంగా చేసుకుని పెద్దఎత్తున గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. తాజాగా ఇటీవల చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి పెద్దఎత్తున బయటపడటం కలకలం సృష్టించింది. అంతకుముందు ఈ ప్రాంతంలో కార్మికులకు గంజాయి విక్రయిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

నల్లమలలో యథేచ్ఛగా సాగు...

జిల్లాలోని అటవీప్రాంతంలో అధికారుల కళ్లుగప్పి గంజాయి సాగు చేస్తున్న సంఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. యర్రగొండపాలెం మండలంలోని అటవీ ప్రాంతంలో గంజాయి మొక్కల సాగు వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. ఒక రైతు కందిలో సాగు చేస్తున్న 270 గంజాయి మొక్కలను అధికారులు గుర్తించారు. గతంలోనూ పలుచోట్ల ఇళ్ల మధ్య మొక్కల సాగు ఉందంతాలూ వెలుగు చూశాయి. అటు పోలీసులు, ఇటు సెబ్‌ నిస్తేజంగా వ్యవహరిస్తుండటంతో జిల్లాలో గంజాయి విక్రయాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. దీన్ని ఇలాగే ఉపేక్షిస్తే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు