logo

‘సారా’క్షసులు

జగన్‌ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు.

Updated : 19 Apr 2024 04:52 IST

 జగన్‌ ఏలుబడిలో జడలు విప్పిన మహమ్మారి
పశ్చిమంలో అడుగడుగునా బట్టీలు
పెద్దదిక్కు కోల్పోతున్న పచ్చని కుటుంబాలు  
చేష్టలుడిగి చూస్తున్న సెబ్‌

 జగన్‌ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో వందల సంఖ్యలో బాధితులు మృత్యుముఖానికి చేరువవుతున్నారు. ఇటు అధికార పార్టీ నేతల, కొందరు అధికారుల ధన దాహం పేదల కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది.    

న్యూస్‌టుడే, మార్కాపురం నేర విభాగం

పశ్చిమ ప్రకాశం సారా తయారీ కేంద్రంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడపడితే అక్కడ సారా బట్టీలు పెట్టి పగలూ, రాత్రీ తయారు చేస్తున్నా యంత్రాంగం మౌనముద్ర దాలుస్తోంది. రెండేళ్ల క్రితం వరకు భారీగా దాడులు చేసి లీటర్ల కొద్దీ ఊటను అధికారులు ధ్వంసం చేశారు. అయితే ఎన్నికల క్రతువు మొదలు కావడం..అధికారుల బదిలీలతో ఈ దందా మళ్లీ జడలు విప్పింది. పాత నేరస్థుల కదలికలపైనా మీనమేషాలు లెక్కిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.

అక్కడ గుట్టుచప్పుడు కాకుండా..

అర్థవీడు మండలంలోని పాపినేనిపల్లి, మాగుటూరు తండా, యాచవరం, బొమ్మిలింగం, గన్నేపల్లి గ్రామాల్లోనూ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. వైపాలెం, పుల్లలచెరువు, అక్కపాలెం, పాలుట్లతో పాటు సమీప అటవీ ప్రాంతాల్లోనూ దీనికి అడ్డుకట్ట వేసేవారు కరవయ్యారు.

సర్వం కోల్పోయి..

టంగుటూరు: టంగుటూరుకి చెందిన తియా ఏడుకొండలు (39) పూల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. నాసి రకం మద్యం తాగుతుండటంతో తీవ్ర అస్వస్థతకు గురై ఒంగోలు రిమ్స్‌లో రెండేళ్ల క్రితం మృతిచెందారు. భర్త నెల రోజులపాటు ఆసుపత్రిలో తీవ్ర క్షోభ అనుభవించి ప్రాణాలు కోల్పోయారని భార్య లక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. కుమారుడు దివ్యాంగుడని, కుమార్తె పాఠశాలలో చదువుకుంటోందన్నారు. తాను కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.

కోడ్‌ కూసిన తర్వాత ఒక్క కేసూ లేదు

గతంలో జిల్లాస్థాయి ఉన్నతాధిÅకారులు ఎన్నికల సమయంలో సారా స్థావరాలపై ప్రత్యేక బృందాలతో దాడులు చేయించి నిలువరించేవారు. అయితే ఈ సారి యంత్రాంగం మిన్నకుండిపోయింది. తయారీ పూర్తిగా నిలిచిపోయిందంటూ ఉన్నతాధికారుల్ని తప్పుదోవ పట్టిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏనాడో కోడ్‌ కూయగా, ఇప్పటికీ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదంటే యంత్రాంగం నిఘా ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.

పాత నేరగాళ్లపై నిఘా ఏదీ ?

మార్కాపురం సెబ్‌ యూనిట్‌ పరిధిలో సారా తయారీ కుటీర పరిశ్రమను తలపిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతం అనుకూలంగా ఉండటంతో ఎక్కడికక్కడ దీన్ని     కాస్తున్నారు. ఉక్కుపాదం మోపాల్సిన సెబ్‌ అధికారులు రెండేళ్ల నుంచీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కేవలం అక్రమ మద్యంపై అక్కడక్కడా దాడులు చేసి బోగస్‌ లెక్కలు చూపుతున్నారు. ఫలితంగా పాత నేరస్థులు మళ్లీ పేట్రేగి  పోతున్నారు.

గతంలో హడలెత్తించిన అధికారులు

మార్కాపురం యూనిట్‌ పరిధిలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉండటం వల్ల సారా తయారీ ఎక్కువగానే ఉండేది. గతంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులతో తయారీ దారుల్ని హడలెత్తించారు. అనంతరం వచ్చిన ఎస్పీ మలికా గార్గ్‌ సైతం మూడు నెలలు సివిల్‌, సెబ్‌ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌ నడిపి దీన్ని కట్టడి చేశారు. ఆ తర్వాత షరా మామూలైంది.

అయిదు మండలాల్లో ఇష్టారాజ్యం

పెద్దారవీడు, అర్థవీడు, దోర్నాల, పుల్లలచెరువు, యర్రగొండపాలెం మండలాల్లో వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టులో ముంపు గ్రామాలైన గుండంచర్ల, కలనూతల, సుంకేసులలో తయారీ చేస్తున్నారు. దోర్నాలలోని సుందరయ్య కాలనీ, కనకమడుగు, భ్రమరాంబ చెంచు కాలనీలతో పాటు తిమ్మాపురం, పనుకుమడుగు, బన్నంబావి, నల్లగుంట్ల, కొర్రప్రోలు, చింతల, తుమ్మలబయలు, పెద్దబొమ్మలాపురం చుట్టుపక్కల గ్రామాల్లో తయారీ, అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

అమ్మో.. ప్రాణాంతక పదార్థాలతో..

సాధారణంగా మన్యం ప్రాంతాల్లో విప్ప పుప్వుతో సారా తయారీ చేస్తుంటారు. ఇది కొంత ప్రమాదకరమైనా, ప్రాణాంతకం కాదు. దీనికి భిన్నంగా పశ్చిమ ప్రకాశంలోని ఏజెన్సీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో తయారవుతున్న సారా సేవించిన వారి కీలక అవయవాలు వైఫల్యం చెందే ప్రమాదముంది. పెద్దఎత్తున యూరియాతో పాటు   బ్యాటరీ పొడిని సైతం కలుపుతున్నారు. ఇవి చాలవన్నట్లు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఇతర రసాయనాలు జోడిస్తున్నారు. వీటితో కాచిన సారాను ఎక్కువ మొత్తంలో సేవించిన వారు మృత్యువుకు చేరువవుతున్నారు. పెద్దారవీడు మండల కలనూతల, గుండంచర్లలో గతంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

కాలేయ సమస్యలతో వందలాదిమంది..

పుల్లలచెరువు మండలం అక్కపాలెం రహదారి మార్గంలో సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న సారా (పాతచిత్రం)

సారా తాగిన వారు తీవ్ర రుగ్మతలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా దోర్నాల, వైపాలెం, పాలుట్లతో పాటు చుట్టుపక్కల ఆసుపత్రులకు కాలేయ సంబంధిత సమస్యలపై వందల కేసులొస్తున్నాయి. నిస్సత్తువ ఆవరించి ఏ పనీ చేసుకోలేక మంచానికే పరిమితమవుతున్నారు. వీటికితోడు కామెర్లు, చర్మరోగ సమస్యలు కూడా వెంటాడుతున్నాయి.  


పెళ్లీడుకు వచ్చిన బిడ్డను మింగేసింది

హనుమంతునిపాడు : మాది హనుమంతునిపాడు. ముగ్గురు కొడుకులు, ఓ కూతురు. ఆఖËరి వాడు మచ్చా రాముడు పెళ్లీడుకు రావడంతో సంబంధారలు చూద్దామనుకున్నాం. ఇంట్లో అన్ని పనులూ అతనే చూసేవాడు. గొర్రెల మేపేందుకు వెళుతున్నప్పుడు చీప్‌ లిక్కర్‌కు అలవాటు పడ్డాడు. రోజూ తక్కువ రకం మద్యం తాగుతుండటంతో  ఆరోగ్యం దెబ్బతింది. దీంతో రెండేళ్ల క్రితం ఒంగోలులో ఆస్పత్రిలో  చేర్పించాం. 24 ఏళ్లకే వాడికి వందేళ్లు నిండిపోయాయి. లివర్‌ పాడైపోయి చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో మా గుండెల్లో రాయి పడింది. ఇప్పుడు వయస్సు మీద పడింది. మమ్మల్ని సాకేదెవరు ?  

మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని