logo

ఐపీఎల్‌ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు

ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్‌ బయటకొస్తాడు.. స్టాన్స్‌ ఎలా తీసుకోవాలి..ఫుట్‌వర్క్‌ ఎలా ఉండాలి..డ్రైవ్‌ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు.

Updated : 29 Apr 2024 06:52 IST

క్రీడలకు సమాధి కట్టిన జగన్‌
స్పోర్ట్స్‌ హాస్టళ్లు, స్టేడియాలకు మంగళం
ప్రతిభావంతులకు కొరవడిన ప్రోత్సాహం
బాబు పాలనలో రూ. కోట్లతో వసతుల కల్పన

ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్‌ బయటకొస్తాడు.. స్టాన్స్‌ ఎలా తీసుకోవాలి..ఫుట్‌వర్క్‌ ఎలా ఉండాలి..డ్రైవ్‌ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం కూడా క్రీడలేనంటూ చెప్పుకొస్తారు. అయితే అయిదేళ్ల పాలనలో చిల్లిగవ్వ ఇవ్వకుండా అన్నీ చేసేశానని అబద్ధాలను ఆశువుగా పలికేస్తారని జిల్లాలోని క్రీడాభిమానులు  పెదవి విరుస్తున్నారు. పీఈటీలను తొలగించేసి.. క్రీడా వసతులు నిలిపేసి తమ వెన్ను విరిచారని వారు వాపోతున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రూ. కోట్లు వెచ్చించి జిల్లావ్యాప్తంగా నిర్మించిన ప్రాంగణాలను సైతం నిర్లక్ష్యంగా వదిలేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, కనిగిరి, ఒంగోలు గ్రామీణం, ఒంగోలు నగరం


కనిగిరిలో ప్రాంగణాలు శిథిలం

చిన ఇర్లపాడు ప్రాంతంలో నిలిచిపోయిన  మినీ క్రీడా స్టేడియం

చంద్రబాబు హయాంలో ప్రతి నియోజకవర్గానికి రూ. 2 కోట్ల అంచనాతో మినీ క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా కనిగిరిలో చినఇర్లపాడు సమీపంలోనూ చురుగ్గా నిర్మాణం సాగింది. తదనంతరం వైకాపా ప్రభుత్వం వచ్చాక దీన్ని నిర్లక్ష్యం చేయడంతో అసంపూర్తిగా మిగిలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డులో రూ.2 కోట్ల వ్యయంతో మినీ క్రీడా స్టేడియానికి శ్రీకారం చుట్టారు. 10 ఎకరాల స్థలంలో పనులు కూడా ప్రారంభించారు. తదనంతరం అది కూడా నిలిచిపోయినా.. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోయింది. అది చిల్ల చెట్ల మధ్య మొండిగోడలతో దర్శనమిస్తోంది. ఇదీ క్రీడాకారుల ఖిల్లాగా పేరొందిన కనిగిరిలో నెలకొన్న దయనీయ స్థితి.

పొలాల్లో సాధన

కనిగిరి అంటే క్రీడలకు ప్రసిద్ధి. స్థానికంగా జాతీయస్థాయి ఆటగాళ్లు పలువురు ఉన్నారు. వీరేకాక ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఖోఖో, కబడ్డీ, సాఫ్ట్‌బాల్‌, రగ్బీ క్రీడాకారులు వచ్చి స్థానికంగా శిక్షణ పొందేవారు. అలాంటి పట్టణంలో సాధన చేసేందుకు సరైన వేదికలు లేకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో రోడ్ల వెంబడి, పొలాల్లో సాధన చేస్తున్నారు. ఇక పాఠశాలల్లోనూ వ్యాయామ ఉపాధ్యాయుల కొరత వేధిస్తుండటంతో  విద్యార్థులకు దిశానిర్దేశం చేసేవారు కరవయ్యారు.

తెదేపా హయాంలో నియోజకవర్గానికి ఓ క్రీడా వికాస కేంద్రం

జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న మెరికల్లాంటి క్రీడాకారులున్నారు. వీరికి ఉపకరించేలా జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడా వికాస కేంద్రాలు (ఇండోర్‌ స్టేడియం) నిర్మించేందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. 2018లో పలుచోట్ల నిర్మాణాలు చురుగ్గా సాగాయి. ఆ తదనంతరం జగన్‌ ప్రభుత్వం రావడంతో ఒక్కసారే పరిస్థితి తల్లకిందులైంది. పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని క్రీడా సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. జిల్లాలో ఒంగోలు, యర్రగొండపాలెం, మార్కాపురం, సంతనూతలపాడులో స్టేడియం నిర్మాణ పనులు పూర్తికాగా; దర్శి, గిద్దలూరు, కనిగిరి, కొండపి స్టేడియాల నిర్మాణ పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ఒంగోలులో అప్పటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మినీ స్టేడియం నిర్మాణ పనులను పూర్తి చేసి, క్రీడాకారులకు వినియోగంలోకి తీసుకొచ్చారు. కొత్త స్టేడియాల నిర్మాణం సంగతి అటుంచి పాత వాటి నిర్వహణకు నిధులివ్వకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. దీంతో క్రీడాకారులు ప్రైవేట్‌  కేంద్రాలను ఆశ్రయించి శిక్షణ పొందాల్సి వస్తోంది.  

తుప్పలు.. డొంకల్లోనే ఆటల  పోటీలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యువతను ఆటల వైపు ప్రోత్సహిస్తున్నామంటూ జిల్లా వ్యాప్తంగా 719 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గతేడాది డిసెంబర్‌ 15 నుంచి జనవరి 26వ తేదీ వరకూ క్రీడా పోటీలు నిర్వహించారు. అందులో ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, క్రికెట్‌ విభాగాల్లో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకూ మొక్కుబడిగా పోటీలు సాగాయి. స్థానికంగా ఉన్న జడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేకపోవడంతో ఊరికి దూరంగా ఉన్నమ పొలాలు, తుప్పలు, డొంకల్లో మమ అనిపించారు. బురదతో నిండిన స్కూలు మైదానాల్లో ఆడేందుకు క్రీడాకారులు ఆపసోపాలు పడ్డారు.

పీఈటీ పోస్టులూ పీకేశారు

నాడు - నేడు కింద విద్యార్థుల్ని తీర్చిదిద్దానని చెప్పే ముఖ్యమంత్రి వాస్తవానికి వారి క్రీడా కౌశలాన్ని నిర్వీర్యం చేశారు. విద్యా శాఖలో సంస్కరణలంటూ ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల్ని పీకేశారు. 117 జీవో ద్వారా ఉన్నత పాఠశాలల్లో 120 మంది పిల్లల కన్నా తక్కువ ఉన్నచోట పీఈటీ పోస్టు రద్దు చేశారు. ఆ విధంగా జిల్లాలో 432 ఉన్నత పాఠశాలలుండగా 60 ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. అక్కడి పిల్లలకు క్రీడలు నేర్పించేవారు కరవయ్యారు.

సౌకర్యాలన్నీ రద్దు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంతో ఒక్కో క్రీడకు ఒక్కో జిల్లాలో స్పోర్ట్స్‌ హాస్టల్‌ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఓజిలిలో వాలీబాల్‌ క్రీడాకారులకు హాస్టల్‌ ఉండేది. శిక్షకులను ప్రభుత్వమే నియమించి, ఉచిత భోజన వసతి కల్పించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆ విధంగా నడిచే క్రీడా వసతి గృహాల్ని మొత్తం తీసేశారు. కొన్ని మండలాలను కలిపి జోనల్‌ పోటీలు నిర్వహించేవారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు జోనల్‌కు, ఆ తరువాత జిల్లా, రాష్ట్రస్థాయిలో పాల్గొనేవారు. వాటిని కూడా రద్దు చేశారు. ఒక్క స్కూల్‌గేమ్స్‌ మినహా ఏమీ జరగటంలేదు.

సామగ్రి సైతం నిలిపివేత

స్పోర్ట్స్‌ అథారిటీ ద్వారా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించి పాఠశాలలు, కళాశాలలకు క్రీడా సామగ్రి ఇచ్చేవారు. వాటిని నిలిపివేశారు. ఏదైనా క్రీడా అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తే వారికి ప్రభుత్వపరంగా కొంత డబ్బులు ఇచ్చేవారు. అలాంటి ప్రోత్సాహం లేదు.

దాతల సాయమే దిక్కు

ఎవరైనా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైతే ప్రోత్సాహకంగా నగదు అందజేసేవారు. వైకాపా ప్రభుత్వంలో ఆ ఊసేలేదు. ఇటీవల ఖోఖో జట్టు అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. వారికి రవాణా ఖర్చులు లేక దాతల సాయంతో పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించారు. ఆడుదాం ఆంధ్రా అంటూ ఆర్భాటం చేయడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదని క్రీడాకారులు వాపోతున్నారు. సరదాగా వైకాపా నాయకులు ఆటలాడుకున్నారు. దీనికి పెట్టిన ఖర్చుతో కోచ్‌లను నియమిస్తే ఔత్సాహికులకు మేలు జరిగేది.

ప్రగల్భం

‘‘మనకేం తక్కువ.. ఐపీఎల్‌ క్రికెట్‌ జట్టు మాదిరి మనకూ ఏపీఎల్‌(ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌) జట్టు ఉండాలి. ఈ ప్రభుత్వం క్రీడాకారుల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుంది’’ 

 ఇదీ ఆడుదాం ఆంధ్రాలో జగన్‌  పలికిన చిలక పలుకులు.

వాస్తవం

స్పోర్ట్స్‌ హాస్టళ్ల ఎత్తివేత..స్టేడియాలకు మంగళం..క్రీడాకారుల ప్రోత్సాహకాలకు తిలోదకాలు.. వెరసి అయిదేళ్లలో చేసిందల్లా క్రీడలకు సమాధి.    

వీధుల్లో ప్రాక్టీస్‌  చేస్తున్నా

నేను కనిగిరిలో డిగ్రీ చేస్తున్నా. జాతీయ స్థాయిలో ఇప్పటికే పలుమార్లు ఖోఖోలో పాల్గొన్నా. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే మాలాంటి వారిపైనా ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. సాధన చేసేందుకు ఒక్క క్రీడా ప్రాంగణం లేదు. మమ్మల్ని ఏ పాఠశాలలోనూ ఆడనివ్వడం లేదు. దీంతో వీధుల్లోనూ, రోడ్ల మీదే ప్రాక్టీస్‌ చేస్తున్నా. క్రీడా ప్రాంగణం కావాలని పలుమార్లు కలెక్టర్‌కు విన్న వించినా ప్రయోజనం శూన్యం.

అనురాధ, జాతీయస్థాయి క్రీడాకారిణి

వైకాపా పాలనలో క్రీడారంగం కుదేలైంది. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో యువత, విద్యార్థులు నీరుగారిపోయారు. గతంలో కొనసాగుతున్న స్పోర్ట్స్‌ హాస్టల్‌ను ఎత్తివేయడంతో వారికి మార్గనిర్దేశం కరవైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని