logo

జగనన్న మాయ‘దారి’ పాలన..!

వైకాపా పాలకులు అయిదేళ్ల పాటు కళ్లకు గంతలు కట్టుకున్నారేమో.. అందుకే రోడ్లపై అడుగడుగునా ఏర్పడిన గుంతలు వారికి కనిపించలేదు. పల్లెదారులు రాళ్లు తేలినా పట్టించుకోలేదు.

Updated : 29 Apr 2024 06:27 IST

వైకాపా పాలకులు అయిదేళ్ల పాటు కళ్లకు గంతలు కట్టుకున్నారేమో.. అందుకే రోడ్లపై అడుగడుగునా ఏర్పడిన గుంతలు వారికి కనిపించలేదు. పల్లెదారులు రాళ్లు తేలినా పట్టించుకోలేదు. కుంగిపోయినా కనీసం మరమ్మతులు చేయించేందుకు చేతులు రాలేదు. జగనన్న పాలనలో జిల్లాలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకునే మార్గాలు సైతం దెబ్బతిన్నాయి. ప్రయాణికుల ఒళ్లు హూనం చేస్తూ.. ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. ప్రమాదాలకు గురి చేస్తూ.. ప్రాణాలు తీస్తున్నాయి.

 న్యూస్‌టుడే, కొత్తూరు, లావేరు, బూర్జ, ఆమదాలవలస పట్టణం, ఇచ్ఛాపురం, సారవకోట, వజ్రపుకొత్తూరు, పలాస గ్రామీణం, ఎల్‌ఎన్‌పేట, గార, కోటబొమ్మాళి

కుంగిపోయినా కన్నెత్తి చూడలే..

సారవకోట మండలం కిడిమి నుంచి గొల్లపేట కూడలి వరకు 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు దుస్థితి ఇది. చాలా చోట్ల సుమారు అడుగు లోతులో కుంగిపోయింది. అయినా అయిదేళ్లలో కనీసం పట్టించుకోలేదు. సారవకోట, కోటబొమ్మాళి మండలాల్లోని సుమారు 40 గ్రామాల ప్రజలు ఈ మార్గంలోనే ప్రయాణిస్తారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనాలు తరచూ పాడవుతున్నాయని చోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


మూడు కి.మీ.. ముప్పుతిప్పలు..

ఈ చిత్రంలో కనిపిస్తున్నది బూర్జ మండలంలో గుత్తావిల్లి వద్ద రహదారిపై ఏర్పడిన గుంత. కొల్లివలస కూడలి నుంచి నారాయణపురం ఆనకట్ట వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. ఈ మార్గంలో చీడివలస, గంగంపేట, నారాయణపురం, లాభాం, గుత్తావిల్లి, కాలపర్తి, చిన్నలంకాం, పెద్దలంకాం గ్రామాల రాకపోకలు సాగిస్తుంటారు. వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


సరిహద్దులో అధ్వానం

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలను కలిపే పాలకొండ - హడ్డుబంగి ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. కొత్తూరు మండలం నివగాం వద్ద రోడ్డు ఇలా అధ్వానంగా మారింది. గోతుల్లో నీరు నిలిచి ఉండటంతో రాత్రి వేళ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం కురిస్తే ఈ మార్గం     చెరువును తలపిస్తోంది.  


ఇంకెన్ని ప్రాణాలు పోవాలి..?

శ్రీకాకుళం-ఆమదాలవలస ప్రధాన రహదారి మృత్యుదారిగా మారింది. దీనిపై నిత్యం సుమారు 10 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రోడ్డు అభివృద్ధికి 2021లో వైకాపా ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అవి కొన్ని రోజులకే అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అనంతరం ఏడాది వ్యవధిలో గుంతల్లో పడి 24 మంది మృతి చెందారు. సుమారు 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వాహనాలు తరచూ దెబ్బతింటున్నాయి. పాలకులు గుత్తేదారు వద్ద కమీషన్లకు కక్కుర్తి పడి రహదారి అభివృద్ధిని గాలికొదిలేశారని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.


అధికార విధ్వంసానికి సాక్ష్యం

జాతీయ రహదారి నుంచి లావేరు మండలం బొంతుపేట కూడలి-మెట్టవలస, గుమ్మడాం, వాళ్లేపేట, రణస్థలం మండలం కృష్ణాపురం, రావాడ తదితర 20 గ్రామాలకు వెళ్లే రహదారి ఇది. దీనిపై రాకపోకలకు వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారు.

తెదేపా హయాంలో ఏడు కిలోమీటర్ల మేర రూ.1.10 కోట్లతో తారు రోడ్డు నిర్మించారు. వైకాపా కీలక నేత మేనల్లుడు సమీపంలోని కొండ నుంచి కంకరను అడ్డగోలుగా టిప్పర్లలో తరలించడంతో ధ్వంసమైంది. అయిదేళ్లలో ప్రభుత్వం కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నరకయాతన పడుతున్నారు.


ధర్మాన హామీ.. ఏమైందో మరి..

గార మండలం వమరవల్లి పంచాయతీ హుకుంపేట గ్రామానికి వెళ్లే రహదారి పనులు అసంపూర్తిగా వదిలేయడంతో రాళ్లు తేలి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. తెదేపా హయాంలో 90 శాతం పనులు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారు. కానీ నెరవేర్చలేకపోయారు.


రోడ్డెక్కిన మొక్కలు

పలాస మండలం అల్లుఖోల పంచాయతీ సవర గోవిందపురం రోడ్డు నుంచి కొటారింగ్‌ తాళభద్ర వరకు రూ.2.12 కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి 2020 జులై 20న మంత్రి అప్పలరాజు శంకుస్థాపన చేశారు. అప్పట్లో చిప్స్‌ వేసి ఊరుకున్నారు. గుంతలు ఏర్పడటంతో ప్రయాణానికి ఇబ్బంది పడుతున్నారు. పొత్రియా గ్రామం వద్ద రోడ్డు మధ్యలో ఇలా పనికి రాని మొక్కలు పెరిగినా అధికారులు పట్టించుకోవట్లేదు.


అసమర్థ ప్రభుత్వం మనకెందుకు?

శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారిపై వెళ్తుంటే ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది.  వాహనాలు దెబ్బతింటున్నాయి. గోతుల్ని తప్పించే క్రమంలో ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రధాన రహదారిని అభివృద్ధి చేయలేని అసమర్థ ప్రభుత్వం మనకెందుకు?

ఎన్‌ ఢిల్లీశ్వరరావు, ప్రయాణికుడు, ఆమదాలవలస


ఆటోల మరమ్మతులు చేయించలేకపోతున్నాం..

ఆమదాలవలస-పురుషోత్తపురం రహదారి దారుణంగా తయారైంది. చెవ్వాకులపేట ర్యాంపు నుంచి ఇష్టానుసారం ఇసుక తరలిస్తున్న లారీల కారణంగా దారంతా గుంతలమయమైంది. ఆటో నడపాలంటేనే కష్టంగా ఉంటోంది. తరచూ మరమ్మతులకు గురికావడంతో మదుపులు పెట్టలేకపోతున్నాం. సంపాదన కన్నా మరమ్మతులకే ఎక్కువ ఖర్చు అవుతుంది.

చల్లా తిరుపతిరావు, ఆటో డ్రైవర్‌, పొన్నాంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని