logo

ఆక్రమణలకు అడ్డేది.. అడిగేవారేరి..?

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి..

Published : 19 May 2024 02:36 IST

కబ్జా కోరల్లో సహజ వనరులు
అధికార పార్టీ నేతల అండతో యథేచ్ఛగా ఆక్రమణలు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి.. చెరువు, గెడ్డలు, వాగులు, కొండలు అక్రమార్కుల చెరలోకి వెళ్లిపోతున్నాయి.. వారి కన్నుపడితే చాలు రాత్రికిరాత్రే కబ్జాకు గురవుతున్నాయి. ఐదేళ్ల పాలనలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరుగుతున్న భూదందాకు హద్దే లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.

న్యూస్‌టుడే, లావేరు, రణస్థలం గ్రామీణం

నియోజకవర్గ పరిధిలో లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం, జి.సిగడాం మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో చిన్న, పెద్ద చెరువులు కలిపి సుమారు 1,280 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 1050 వరకు ఆక్రమణకు గురయ్యాయి. వీటితో పాటు గెడ్డవాగులు, సాగునీటి కాలువలు, సుమారు 250 కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి. ఇరువైపులా ఉన్న విలువైన భూములను కలిపేసుకున్నారు. కొన్నిచోట్ల పొలాలుగా మార్చేసి పంటలు, తోటలు సాగు చేస్తున్నారు.

జాతీయ రహదారి ఆనుకుని లావేరు మండలం తాళ్లవలస సమీపంలో ఉన్న 200 అడుగుల వెడల్పున ఉన్న చింతగెడ్డను కొంతమంది వైకాపా నేతల అండతో కప్పేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా విలువ సుమారు రూ.4 కోట్ల వరకు ఉంది. 

భూమి విలువ పెరగడంతోనే..

నాలుగు మండలాలు జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం, విశాఖ, శ్రీకాకుళం నగరాలకు మధ్యలో ఉండటంతో కబ్జాదారుల కన్ను వీటిపై పడింది. ఇక్కడ భూమి ధరలు రూ.కోట్లలో పలుకుతున్నాయి. ఆక్రమించిన స్థలాలను స్థిరాస్తి భూములుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో ధరలు ఉన్నాయి. ఇదే అదనుగా స్థానిక వైకాపా నేతలు అధికారులు, సిబ్బంది అండతో వందలాది ఎకరాలు కబ్జా చేశారు. రికార్డులు తారుమారు చేసి సర్వే నంబర్లు సృష్టించడం వంటివి చేశారు. కొండలను సైతం వదల్లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేశారు.

  • ఎచ్చెర్ల మండలంలో జాతీయ రహదారికి ఆనుకుని నారాయణపురం కూడలి కాలువ ఉంది. ఇది శ్రీకాకుళం నగరానికి దగ్గరలో ఉండటంతో భూమి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో అక్రమణదారులు కాలువను అక్రమించి ఇరువైపులా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. కాలువ సగానికిపైగా పూడుకుపోయింది. శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.
  • రణస్థలం మండల కేంద్రంలోని రామతీర్థాలు కూడలి నుంచి కొండములగాం, విజయనగరం వెళ్లే రహదారిలో గెడ్డపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గెడ్డలు కప్పేసి భవనాలు నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేదు.
  • చిన్నమురపాక డాబాల చెరువు సర్వే నంబరు 137లో 112.70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వైకాపా నేతల అండతో ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రస్తుతం 60 ఎకరాలపైన చెరువు గర్భాన్ని అక్రమించి వరి, పత్తి, కొబ్బరి, నీలగిరి తోటలతో పాటు కల్లాలుగా మార్చేశారు. ఎవరైనా అడిగితే వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఆయకట్టుకు సాగునీరందలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.  
  • లావేరు మండలం బుడుమూరు నారాయణసాగరం పెద్ద చెరువు సర్వే నంబరు 283లో సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో గర్భం ఉండేది. ప్రస్తుతం వంద ఎకరాలపైనే అక్రమార్కుల చెరలో ఉంది. దీంతో చెరువు రూపమే మారిపోయింది. పొలాలుగా మార్చి వరి, కొబ్బరి, సరుగుడు వంటి పంటలు సాగు చేస్తున్నారు.   
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని