logo

నీట్‌ కారణంగా 21 మంది ఆత్మహత్య

నీట్ రద్దు కానందున రాష్ట్రంలో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి పేర్కొన్నారు.

Updated : 20 Aug 2023 02:58 IST

అసెంబ్లీ తీర్మానాలపై గవర్నర్‌ సంతకం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి
నీట్‌ రద్దు డిమాండ్‌ చేస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్త నిరసనలు
ప్రకటించిన మంత్రి ఉదయనిధి

విద్యార్థులకు  బహుమతులు అందజేస్తున్న మంత్రి ఉదయనిది

కాంచీపురం, న్యూస్‌టుడే: నీట్ రద్దు కానందున రాష్ట్రంలో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంత్యుత్సవాల సందర్భంగా శనివారం కాంచీపురంలోని ఓ కల్యాణ మండపంలో ఉత్తిరమేరూర్‌ ఎమ్మెల్యే కె.సుందర్‌ అధ్యక్షతన కాంచీపురం ఎమ్మెల్యే సీవీఎంపి ఎళిళరసన్‌ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డీఎంకే తరఫున 538 మంది ఆటో డ్రైవర్లకు దుస్తులతో పాటు సంక్షేమ పథకాలు, కాంచీపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10 వ తరగతి, 12వ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. ఇంట్లో పెద్ద మహిళలకు త్వరలో రూ.1000లు అందజేసే పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో నీట్ను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం... కానీ నీట్‌ రద్దు కానందున రాష్ట్రంలో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారని తెలిపారు. అసెంబ్లీలో రెండుసార్లు నీట్ రద్దుకు తీర్మానాలు ఆమోదించి గవర్నర్‌కు పంపామని, కానీ గవర్నర్‌ సంతకం చేయడం లేదని గుర్తుచేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా నీట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ డీఎంకే తరఫున ఆదివారం నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో కాంచీపురం మేయర్‌ మహాలక్ష్మి యువరాజ్‌, జిల్లా పంచాయతీ ఛైర్మన్‌ పడపై మనోహరన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ నిత్యా సుకుమార్‌, పలువురు పార్టీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని